
మాటలే.. పనులు కావడం లేదు..
♦ అధికారులపై మంత్రి పుల్లారావు అసహనం
♦ జిల్లాలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం
గుంటూరు వెస్ట్ : మాటలు చెబుతున్నారు... పనులు కావడంలేదు... నిధులు మంజూరయ్యాయి... పనులు చేయకుండా ఉండడం మంచిది కాదు... ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.. అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డీపీఓ వీరయ్య, డ్వామా పీడీ బాలాజీనాయక్, పీఆర్ ఎస్‌ఈ జయరాజ్‌లపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంగళవారం వ్యవసాయం, సాగు, తాగునీరు, ఇసుకరవాణా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు ఉన్నా... ఆశించినస్థాయిలో పను లు జరగడం లేదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని కోరారు. జిల్లాలో ఎక్కడా సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఓగులేరు వాగులో బోరు వేసి చిలకలూరిపేటకు తాగునీరు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు వస్తున్నదని, దాని ద్వారా సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే విడుదలకు తగిన చర్యలు తీసుకుని చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాలో ఆరోపణలు వస్తున్నాయ ని, వాటిని నివారించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని కోరారు. ఇసుక అమ్మకాలలో వ్యాపారులను నిరోధించి, నిజంగా అవసరమైనవారు డి.డి ఇచ్చిన వెంటనే ఇసుక రవాణా అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
వినుకొండ, బాపట్ల తదితర ప్రాంతాలలో ఎడ్లబండ్లపై ఇసుకను రవాణా చేసి వారి నుంచి ఇక నుంచి రూ.100 బదులుగా రూ.50 వసూలు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలి
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరైన వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సీపీఐ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి ప్రభుత్వ తత్సమాన ఉద్యోగాలను కల్పించాలని కోరారు. అసైన్డ్ భూముల సాగుదార్లకు పూర్తిప్యాకేజి అందించి, దేవాదాయ భూముల సాగుదారులైన కౌలురైతులకు కుటుంబానికి 300 గజాల స్థలాన్ని ప్రత్యేక ప్యాకేజిగా అందించాలన్నారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, గత 3 నెలలుగా కార్మికులకు బకాయి పడిన వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.