minister pullarao
-
లెక్కలు రాకపోతే నేను చెబుతా...: వైఎస్ జగన్
-
రైతుల ఆత్మహత్యలపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాలతో సహా శాసనసభ సాక్షిగా ఎండగట్టారు. మంత్రి పుల్లారావు అబద్ధాలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీపై వాస్తవాలను వైఎస్ జగన్ సభలో వివరించారు. రైతు ఆత్మహత్యలు, ఇన్పుట్ సబ్సిడీపై మంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపైనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే రైతు సమస్యలపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. సమాధానం చెప్పకుండా...అధికార పక్ష సభ్యులు ప్రతిపక్ష నేతపై మూకుమ్మడి విమర్శల దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ మరో పదినిమిషాలు వాయిదా పడింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా అంతకు ముందు వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. అయితే రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం వక్రీకరిస్తోందని... 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి...ఇప్పటివరకూ రూ.10వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రైతులు ఈ మూడేళ్లలో రూ.48వేల కోట్ల వడ్డీ కట్టారని, ఏటా రూ.3వేల కోట్లు ఇస్తే రుణాలు ఎలా తీరుతాయని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి రూ.లక్షా 36వేల 935 రుణాన్ని మాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పుల్లారావు చెప్పారని... అయితే ధర్మశ్రీ రూ.50వేల అప్పు తీసుకుంటే ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ చేసిందని, అయితే అది వడ్డీకే సరిపోగా... మళ్లీ వడ్డీతో కలిపి ఇప్పుడా రుణం రూ.51వేలుగా ఉందన్నారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేశామని అబద్ధాలు చెబితే ఎలా అని అన్నారు. లెక్కలు రాకపోతే తాను చెబుతానని, పెన్ను, పేపర్ తీసుకుని రాసుకోండని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. -
వ్యవసాయం లాభసాటిగా మార్చాలి
అధికారులు కష్టపడి పనిచేయాలి జేడీఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెల్లూరు రూరల్ : వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయాధికారులు కష్టపడి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక తాహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన జేడీఏ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, ఇరిగేషన్ తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు, భారీ వర్షాల పంట నష్టం పరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రైతులకు అందజేస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో కృష్ణపట్నం, కోడూరు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, జేడీఏ హేమమహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం'
-
'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం'
గుంటూరు : తుపాను, వరద, కరువు, పుష్కరాలు ఇలా ప్రతి అంశాన్ని అవకాశంగా మలుచుకుని ముఖ్యమంత్రి నుంచి టీడీపీ కార్యకర్తల వరకు ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెయిన్ గన్స్, సీసీఐ పత్తి కుంభకోణం, నకిలీ విత్తనాల వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్టు పెడుతున్నామని హడావుడి చేశారన్నారు. వారం రోజులు గడిచింది.. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి భాగస్వామ్యం, ప్రోద్బలంతోనే నకిలీ విత్తనాల వ్యాపారం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది రైతుల సమస్య అని, వారిని ఆదుకుని సమస్య పరిష్కరించాలనేది ప్రతిపక్ష నేత వైఎస్ జగమోహన్‌రెడ్డి డిమాండ్ అని పేర్కొన్నారు. అలసత్వం వహిస్తే రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెని క్రిస్టినా, కిలారి రోశయ్య పాల్గొన్నారు. -
మాటలే.. పనులు కావడం లేదు..
♦ అధికారులపై మంత్రి పుల్లారావు అసహనం ♦ జిల్లాలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం గుంటూరు వెస్ట్ : మాటలు చెబుతున్నారు... పనులు కావడంలేదు... నిధులు మంజూరయ్యాయి... పనులు చేయకుండా ఉండడం మంచిది కాదు... ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.. అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డీపీఓ వీరయ్య, డ్వామా పీడీ బాలాజీనాయక్, పీఆర్ ఎస్ఈ జయరాజ్లపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంగళవారం వ్యవసాయం, సాగు, తాగునీరు, ఇసుకరవాణా, ఎన్ఆర్ఈజీఎస్ పనులు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణం, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు ఉన్నా... ఆశించినస్థాయిలో పను లు జరగడం లేదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని కోరారు. జిల్లాలో ఎక్కడా సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఓగులేరు వాగులో బోరు వేసి చిలకలూరిపేటకు తాగునీరు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు వస్తున్నదని, దాని ద్వారా సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే విడుదలకు తగిన చర్యలు తీసుకుని చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాలో ఆరోపణలు వస్తున్నాయ ని, వాటిని నివారించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని కోరారు. ఇసుక అమ్మకాలలో వ్యాపారులను నిరోధించి, నిజంగా అవసరమైనవారు డి.డి ఇచ్చిన వెంటనే ఇసుక రవాణా అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. వినుకొండ, బాపట్ల తదితర ప్రాంతాలలో ఎడ్లబండ్లపై ఇసుకను రవాణా చేసి వారి నుంచి ఇక నుంచి రూ.100 బదులుగా రూ.50 వసూలు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరైన వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సీపీఐ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి ప్రభుత్వ తత్సమాన ఉద్యోగాలను కల్పించాలని కోరారు. అసైన్డ్ భూముల సాగుదార్లకు పూర్తిప్యాకేజి అందించి, దేవాదాయ భూముల సాగుదారులైన కౌలురైతులకు కుటుంబానికి 300 గజాల స్థలాన్ని ప్రత్యేక ప్యాకేజిగా అందించాలన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, గత 3 నెలలుగా కార్మికులకు బకాయి పడిన వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిని నమ్ముకుంటే అంతే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ సీట్లు లభించని నేతలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పనిచేసిన వారికి కాకుండా హైదరాబాద్‌లో లాబీయింగ్ నడిపిన వారికి సీట్లు లభించాయనే మాటలు పార్టీలో వినపడుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటమ్మా! ఎలా ఉన్నావ్! మనకు మంచి రోజులు వస్తాయ్! బాబు గారు ఉన్నారు! మన కష్టాన్ని గుర్తిస్తారు, నేనుంటాగా అంటూ మభ్యపెట్టి పనులు చేయించుకున్నారని, అనేక ధర్నాలు, రాస్తారోకోలు పుల్లారావు ఆధ్వర్యంలో విజయవంతం చేశామని నేతలు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో చిలకలూరిపేట నుంచి పుల్లారావు రాకపోయినా, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయనే ఉండి బాధ్యతలు నిర్వహించినట్టుగా పనిచేసిన నేతలకు దిక్కుతోచడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ‘మన పుల్లారావు’ కు మంత్రి పదవి వస్తుంది, ఆయనకొస్తే మనకు ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశపడి రెక్కలు ముక్కలు చేసుకున్న నేతలకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అసలు పార్టీలో ఏమీ జరుగుతోంది, తాము పదవులకు అర్హులం కాదా? లేకపోతే మనీతో రాజకీయం చేయాలా? అనేది అర్థం కాక తికమకపడుతున్నారు. అసలు మంత్రిని నమ్ముకుంటే మంచిదా? లేక తమ ప్రయత్నాలు తాము చేసుకోవడం మంచిదా? మరో నేతను ఆశ్రయించడం మంచిదా అనే మీమాంసలో పడిపోతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గుంటూరులోని పలువురు నేతలు సీటు ఆశించారు. అభ్యర్థిని ఖరారు చేయడానికి అనేకసార్లు నేతలు సమావేశం అయ్యారు. దీనిపై జిల్లా నేతలు ఇంకా నిర్ణయం తీసుకోక ముందే అధినేత చంద్రబాబు టీడీపీతో సంబంధం లేని ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించారు. ఈ విషయంలో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్య భూమిక వహించడంతో గుంటూరు నేతలు ఆ సీటు మిస్ అయ్యారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. దాదాపు రెండు నెలలపాటు మంత్రి పుల్లారావు కాన్వాయ్‌ను ఆశావహులంతా అనుసరించారు. హైదరాబాద్ వెళ్లేప్పుడు గన్నవరం విమానాశ్రయం వరకు సాగనంపడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయం చేరుకుని ఇంటి వరకు కాన్వాయ్‌ను ఫాలో కావడం వారికి నిత్య కృత్యమైంది. చివరకు పార్టీలో ఎవరూ ఊహించని విధంగా బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి అన్నం సతీష్ ప్రభాకర్ ఆ సీటును తన్నుకు పోయారు. దీనిలో పెద్ద లాబీయింగ్ జరిగిందని పార్టీలో వినపడుతోంది. మంత్రి పుల్లారావును నమ్ముకున్న వారిలో ఎవరికీ సీటు రాకుండా అన్నం సతీష్‌కు లభించింది. మంత్రి ఏ స్థాయిలోనూ తమ సేవలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లలేదని, సీటు ఖరారు చేసే రోజు కూడా ఆయనగుంటూరులో ఉండటాన్ని ఆశావహులు తప్పుపడుతున్నారు. ఇక పార్టీ పదవులు కూడా మంత్రి అనుచరుల కంటే ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులకే లభించాయి. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాల పనులపై మంత్రి వద్దకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. తిరిగి తిరిగి అలసి ఆయన వద్దకు వెళ్లడం మానుకుంటున్నారు.అందుకే మంత్రి కాన్వాయ్‌ను అనుసరించే వాహనాలు పూర్తిగా తగ్గిపోయాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆయన కాన్వాయ్‌ను పదిహేను ఇరవై కార్లు అనుసరిస్తే, ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇంటి వద్ద, గుంటూరులోని ఐబీ వద్ద మంత్రి కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. -
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం
బనవాసి ఫామ్‌లో 3 ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఒంగోలు దూడల సంరక్షణ కేంద్రం ఏర్పాటు గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కర్నూలు అగ్రికల్చర్ : జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలో 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్‌ను గుజరాత్‌కు చెందిన అంబుజా ఎక్స్‌పోర్టు కంపెనీ నెలకొల్పనుందని చెప్పారు. శనివారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో కలిసి స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం బనవాసిఫాంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇక్కడే ఒంగోలు దూడల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. గొర్రెల పెంపకందారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా కల్లూరు మండలం తడకనపల్లిలో పశువుల హాస్టల్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సూక్ష్మ పోషకాలను ఈనెలలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డీడీ పనితీరుపై మంత్రి ఆగ్రహం ఎమ్మిగనూరు టౌన్: వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాక ఎమ్మిగనూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. బనవాసి ఫారంలోని అంబోతుల ఘనీకృతవీర్య కేంద్రంలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో లేకపోవడంతో డీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, యంగ్బుల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని బోడబండ గ్రామ సమీపంలో పరిశీలించారు. ఎమ్మిగనూరులో రైతు బజార్, ఉల్లి, మెరప పంటల నిలువకు గాను 5టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కొత్త చెక్‌పోస్టును మంజూరు చేస్తానన్నారు. ధాన్యం ఎక్కువగా పండించే ప్రాంతాల్లో త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని ప్రభుత్వం రూ.1360నుంచి రూ.1400ల మద్దతుధరతో కొనుగోలు చేస్తోందన్నారు. ఎంత మంది రైతులు అడిగినా డ్రిప్, స్పింక్లర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బీవీ.జయనాగేశ్వరరెడ్డి, బీసీ.జనార్దన్‌రెడ్డి, తెలుగుదేశం నేతలు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, జిల్లా అధికారులు ఉన్నారు. బీమా పథకాల ప్రారంభం కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం, అటల్ పెన్షన్ యోజన పథకాలను కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 1,51,953 మందికి బీమా పథకాలను అమలు చేయడంపై మంత్రి బ్యాంకర్లను అభినందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, గౌరుచరిత, మణిగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
భూముల స్వాధీనం అనంతరం రాజధాని నిర్మాణం
► రాష్ట్ర మంత్రులు పుల్లారావు, నారాయణ వెల్లడి ► రాయపూడి, తుళ్లూరులో భూముల చదును ► రైతులకు కౌలు డీడీల పంపిణీ తాడికొండ (గుంటూరు) : రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల స్వాధీనం ప్రక్రియ పూర్తికాగానే రాజధాని నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తుళ్లూరు మండలం రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రైతులకు కౌలు డీడీలను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 4 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ కింద రూ.64 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. మరో రూ.169 కోట్లు రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీగా జమచేయనున్నామని చెప్పారు. నెలాఖరులోగా భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ నాయకులను తీసుకువచ్చినా, మేథాపాట్కర్ పర్యటించినా ఒరిగేదేమీ లేదని చెప్పారు. రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసంతో భూములిచ్చారన్నారు. రాజధానికి భూములు ఇవ్వనివారు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆయా రైతులకు పంటకు మాత్రమే అవకాశం కల్పించిందని చెప్పారు. పట్టిసీమను అడ్డుకోటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రయత్నాలు వృథా అన్నారు. పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ సోమవారానికి రైతు రుణమాఫీ 95 శాతం పూర్తవుతుందన్నారు. గ్రామ కంఠాల విషయంలో కూడా నెలాఖరులోగా రైతులకు అనుకూలంగా చేస్తామని చెప్పారు. మంగళగిరి మండలంలోని నీరుకొండ, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో 50 ట్రాక్టర్లతో శనివారం భూముల చదును చేయనున్నామని వివరించారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రాయపూడిలో కొమ్మినేని రాధాకృష్ణ పొలాన్ని, తుళ్లూరులో అప్పారావు పొలాలను మంత్రులు ట్రాక్టర్లతో చదునుచేశారు.