బనవాసి ఫామ్‌లో 3 ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల
ఒంగోలు దూడల సంరక్షణ కేంద్రం ఏర్పాటు
గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు
వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కర్నూలు అగ్రికల్చర్ : జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలో 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్‌ను గుజరాత్‌కు చెందిన అంబుజా ఎక్స్‌పోర్టు కంపెనీ నెలకొల్పనుందని చెప్పారు. శనివారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో కలిసి స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం బనవాసిఫాంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇక్కడే ఒంగోలు దూడల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు.
గొర్రెల పెంపకందారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా కల్లూరు మండలం తడకనపల్లిలో పశువుల హాస్టల్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సూక్ష్మ పోషకాలను ఈనెలలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
డీడీ పనితీరుపై మంత్రి ఆగ్రహం
ఎమ్మిగనూరు టౌన్: వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాక ఎమ్మిగనూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. బనవాసి ఫారంలోని అంబోతుల ఘనీకృతవీర్య కేంద్రంలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో లేకపోవడంతో డీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, యంగ్‌బుల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని బోడబండ గ్రామ సమీపంలో పరిశీలించారు.
ఎమ్మిగనూరులో రైతు బజార్, ఉల్లి, మెరప పంటల నిలువకు గాను 5టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కొత్త చెక్‌పోస్టును మంజూరు చేస్తానన్నారు. ధాన్యం ఎక్కువగా పండించే ప్రాంతాల్లో త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ధాన్యాన్ని ప్రభుత్వం రూ.1360నుంచి రూ.1400ల మద్దతుధరతో కొనుగోలు చేస్తోందన్నారు. ఎంత మంది రైతులు అడిగినా డ్రిప్, స్పింక్లర్‌లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బీవీ.జయనాగేశ్వరరెడ్డి, బీసీ.జనార్దన్‌రెడ్డి, తెలుగుదేశం నేతలు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, జిల్లా అధికారులు ఉన్నారు.
బీమా పథకాల ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం, అటల్ పెన్షన్ యోజన పథకాలను కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 1,51,953 మందికి బీమా పథకాలను అమలు చేయడంపై మంత్రి బ్యాంకర్లను అభినందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, గౌరుచరిత, మణిగాంధీ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం
Published Sun, May 10 2015 4:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement