
రైతుల ఆత్మహత్యలపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాలతో సహా శాసనసభ సాక్షిగా ఎండగట్టారు. మంత్రి పుల్లారావు అబద్ధాలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీపై వాస్తవాలను వైఎస్ జగన్ సభలో వివరించారు.
రైతు ఆత్మహత్యలు, ఇన్‌పుట్ సబ్సిడీపై మంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపైనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే రైతు సమస్యలపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. సమాధానం చెప్పకుండా...అధికార పక్ష సభ్యులు ప్రతిపక్ష నేతపై మూకుమ్మడి విమర్శల దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ మరో పదినిమిషాలు వాయిదా పడింది.
రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా అంతకు ముందు వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. అయితే రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం వక్రీకరిస్తోందని... 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి...ఇప్పటివరకూ రూ.10వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రైతులు ఈ మూడేళ్లలో రూ.48వేల కోట్ల వడ్డీ కట్టారని, ఏటా రూ.3వేల కోట్లు ఇస్తే రుణాలు ఎలా తీరుతాయని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి రూ.లక్షా 36వేల 935 రుణాన్ని మాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పుల్లారావు చెప్పారని... అయితే ధర్మశ్రీ రూ.50వేల అప్పు తీసుకుంటే ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ చేసిందని, అయితే అది వడ్డీకే సరిపోగా... మళ్లీ వడ్డీతో కలిపి ఇప్పుడా రుణం రూ.51వేలుగా ఉందన్నారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేశామని అబద్ధాలు చెబితే ఎలా అని అన్నారు. లెక్కలు రాకపోతే తాను చెబుతానని, పెన్ను, పేపర్ తీసుకుని రాసుకోండని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు.