
ప్రజా సమస్యలు చర్చకు రానివ్వలేదు
అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై జగన్ ఆగ్రహం ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా సర్కారు అడ్డుకుంది
ప్రాధాన్య అంశాలపై నోటీసులు ఇచ్చినా చర్చకు రానీయ లేదు
సభలో వారే తీర్మానాలు పెట్టుకుని వారే మాట్లాడుకున్నారు
సీఎం ముగింపు ప్రసంగంపై వివరణ కోరడానికీ అవకాశమివ్వలేదు
రుణ మాఫీలో తప్పులు తెలుసుకుని సరిదిద్దాలన్న ఆలోచనే లేదు
సీఆర్‌డీఏ బిల్లు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దంటే.. రాజధానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని బురదజల్లుతున్నారు
అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతిపక్ష నేత విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం దాటవేసిందని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సమావేశాల్లో ప్రతి పక్షాన్ని మాట్లాడనీయలేదని ఆయన ఆరోపించా రు. మంగళవారం శాసనసభ నిరవధికంగా వా యిదాపడిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి పక్షం గొంతెత్తితే ప్రజా సమస్యలు చర్చకొస్తా యి, ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలు బయటపడతాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షా న్ని మాట్లాడనీయకుండా అధికారపక్షం అడ్డుపడింద’’ని విమర్శించారు. అత్యంత ప్రాధాన్యం ఉన్న సమస్యలపై చర్చ కోసం తాము నోటీసులు ఇస్తే వాటిలో ఆరింటిని చర్చకు అవకాశం రాకుం డాచేశారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల క్రమబద్ధీకరణ, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, పోలవరం ప్రాజెక్టు, శ్రీశై లం జలాశయం వివాదం, సామాజిక కార్యకర్తల నియామకం వంటి అంశాలు సభలో చర్చించకుండానే ప్రభుత్వం సభను వాయిదా వేసుకుందని దుయ్యబట్టారు. సభలో వారే తీర్మానాలు పెట్టుకుని వారే మాట్లాడుకున్నారని.. ఇది వరకు సభలో వచ్చిన తీర్మానాన్నే రెండోసారి కూడా పెట్టారని జగన్ తప్పుపట్టారు.
క్లారిఫికేషన్లకూ అవకాశమివ్వరా?: సభ చివ రిరోజున సీఎం చంద్రబాబు ముగింపు ప్రసం గం పూర్తయ్యాక, కనీసం వివరణ కోరడానికి కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని ఆయ న పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు తన ప్రసంగంలో నిర్మొహమాటంగా అబద్ధాలు చెప్పుకుంటూ పో యారు. అవి అబద్ధాలు అని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఆయన గంట సేపు ముగింపు ప్రసంగం చేస్తే, ఆ తర్వాత కనీసం ప్రతిపక్ష నేతగా నాకు పది నిమిషాలైనా అవకాశమివ్వలేదు. మామూలుగా అయితే స్పీకర్‌కు పేపర్లు ఇవ్వాలి. అవి ఇవ్వకుండానే వెళ్లిపోయారు.’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేస్ స్టడీస్ చెప్పాలంటే వేలకు వేలు..: ‘‘రుణ మాఫీకి సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు రైతు ల కేస్ స్టడీకి సంబంధించి మాత్రమే మా ప్రసంగంలో చెప్పడానికి ఆస్కారం కల్పిస్తారు. చెప్పాలంటే వేలకు వేలున్నాయి. అవన్నీ చెప్పలేం కదా. అందుకే రెండు ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలనే మేం ఈ సందర్భంగా ఉటంకించాం. బాబుకు కేస్ స్టడీ అంటే ఏంటో రియల్ స్టడీ అంటే ఎంటో తెలియదు. ఈ మాఫీ వివరాలను కూడా మేం ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచే తీసుకున్నాం. అవి మేము సృష్టించినవి ఎంత మాత్రం కావు’’ అని జగన్ వివరించారు. ఆత్మహత్యలకు సంబంధించి తాము మొత్తం 86 పేర్లతో ఉన్న జాబితాను స్పీకర్‌కు అందజేశామం టూ ఆ జాబితాలను విలేకరులకు అందించారు. ‘‘రుణ మాఫీ విషయంలో ఎలాంటి తప్పులు జరిగాయని జగన్ చెబుతున్నారు.. వాటిని తెలుసుకుని సవరిద్దాం.. అని ప్రభుత్వం ఆలోచిం చడం లేదు. ఎంత సేపూ రుణ మాఫీకి కేటాయించిన 4,664 కోట్ల రూపాయలలోపే అంతా సర్దుబాటు చేయాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. మొత్తానికి చంద్రబాబు మాఫీ వ్యవహారం అంతా ‘పౌడర్ కోటింగ్’ (రంగుపూయడం) లాగా చేస్తున్నారని, అబద్ధాలు చెప్పడం వాటిని సమర్థించుకోవడానికే సరిపోతోందని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దంటే ఎదురుదాడా?: సీఆర్‌డీఏ బిల్లులో రైతులకు ఎంతి స్తారు? కౌలు రైతులకు ఎంతిస్తారు? అనే అంశాలను పొందుపర్చలేదేమని ప్రశ్నిస్తూ తాము లోపాలను ఎత్తి చూపితే వాటికి సమాధానం చెప్పకుండా.. రాజధానిని తాము వ్యతిరేకిస్తున్నామని బురద జల్లుతూ చంద్రబాబు ఎదురుదాడికి దిగారని జగన్ మండిపడ్డారు. ‘‘రాజధానికి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ ఏమిటి? జోనింగ్ ఎలా చేస్తారు? అనే ప్రశ్నలకు కూడా సమాధా నం రాలేదన్నారు. ‘ల్యాండ్ పూలింగ్’ పేరుతో ‘ల్యాండ్ ఫూలింగ్’ చేయొద్దని, రైతుల భూముల తో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొ ద్దని చేసిన సూచనను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ భూములున్న మంగళగిరి, వినుకొండ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు గానీ రైతుల భూమిలో వారికి అరకొర లాభాలు ఇచ్చి మిగతావి నువ్వు తీసుకోవడం ఏమిటని తాము అడిగితే జవాబు లేదన్నారు. యాభై వేల ఎకరా ల్లో 25 వేల ఎకరాలు కనీస అవసరాలకు పోతే 12 వేల ఎకరాలు రైతులకు ఇస్తామంటున్నారు, ఇక మిగిలిన 13 వేల ఎకరాలు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే కదా అని ప్రశ్నిస్తే.. వైఎస్సార్‌సీపీ రాజధానికి వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ లో మాట్లాడ్డానికి తమ వారు ఇద్దరికి అవకాశం ఇస్తే అధికారపక్షం నుంచి ఆరుగురితో మాట్లాడించి తమను తిట్టిస్తున్నారని తప్పుబట్టారు. అంతా ఆత్మస్తుతి - పరనింద లాగా సాగిందన్నా రు. ‘‘మంగళవారం చంద్రబాబు గంట సేపు ముగింపు ప్రసంగం చేస్తే వివరణలు అడగడానికి నాకు పది నిమిషాలు కూడా ఇవ్వలేదు. చం ద్రబాబు ప్రసంగం ఎంత సుదీర్ఘంగా సాగిందం టే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు గాఢంగా నిద్రపోయారు’’ అని ఆయన ఉదహరించారు.
భయపడి రైతులకు పరిహారం ఇస్తామంటున్నారు
‘‘ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులను ఓదారుస్తానని విశాఖపట్నంలో నేను ప్రకటించిన తరువాత చంద్రబాబు భయపడి.. మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తానని సీఎం అన్నారు. నా పర్యటన దగ్గర పడుతుండటంతో సీఎం ఈ ప్రకటన చేశారు’’ అని జగన్ పేర్కొన్నారు. రైతు కుటుంబాల ఓదార్పు కార్యక్రమం సంక్రాంతి తరువాత చేపడతానన్నా రు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? అని అడిగినపుడు ‘‘నేను ఇది వరకు ఓ దార్పు చేసినపుడు కూడా ఆ కుటుంబాలకు ఏం చేశామనేది నా నోట్లో నుంచి ఏనాడూ చెప్పలేదు. వారే (ఆ కుటుంబీకులు) చెప్పుకుని ఉంటే ఉండొచ్చు. ప్రచారార్భాటం చేసుకుని అదే పనిగా ఎప్పుడూ చెప్పలేదు. మానవతా దృక్పథంతో ఏం చేయాలో అది చేశాం’’ అని జగన్ వివరించారు.
చంద్రబాబునే అడగండి నాపై కేసులెలా వచ్చాయో...
తనపై కేసులెలా వచ్చాయో చంద్రబాబునే అడగాలని జగన్ సూచించారు. ‘‘మీరు ప్రజా సమస్యలను ప్రస్తావించినపుడల్లా మీపై ఉన్న కేసులను పదే పదే అధికారపక్షం ఎత్తి చూపుతోంది కదా. దానికేమంటారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘చంద్రబాబునే అడగండి, నా మీద కేసులెలా వచ్చాయో... ఎవరు పెట్టారు? అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినందుకే.. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై నాపై కేసులు పెట్టించారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నపుడు నాపై కేసులు ఎందుకు రాలేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై పోరాడి ఆ పార్టీని వీడాను కనుకనే నాపై కేసులు పెట్టారు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు’’ అంటూ జగన్ ముగించారు. విలేకరుల సమావేశంలో సహచర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, కాకాని గోవర్థన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మానవతా కోణంలోనే చూడాలి..
‘‘రుణాలు రానందువల్ల, రుణ మాఫీ చేయనందువల్ల మాత్రమే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేనెప్పుడూ చెప్పలేదు. వార లా చేసుకోవడానికి కారణాలు అనేకం ఉం డొచ్చు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీర్చలేక బాధతో కొవొచ్చు. పంటలకు మద్దతు ధర లభించక నష్టపోయి ఉండొచ్చు. కరువు వల్ల పంటలు లేక చనిపోయి ఉండొచ్చు. కారణాలేమైనా మరణించింది రైతులే కదా. వాటిని మానవతా కోణంలోనే చూడాలి’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్ర తి దానికీ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల లో ఇబ్బందుల వల్లరైతులు చనిపోయారంటారు. కానీ ఈ మనిషి చేసిన మోసం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవం మాత్రం అంగీకరించరు’’అని జగన్ దుయ్యబట్టారు.