మంత్రిని నమ్ముకుంటే అంతే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ సీట్లు లభించని నేతలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పనిచేసిన వారికి కాకుండా హైదరాబాద్‌లో లాబీయింగ్ నడిపిన వారికి సీట్లు లభించాయనే మాటలు పార్టీలో వినపడుతున్నాయి.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటమ్మా! ఎలా ఉన్నావ్! మనకు మంచి రోజులు వస్తాయ్! బాబు గారు ఉన్నారు! మన కష్టాన్ని గుర్తిస్తారు, నేనుంటాగా అంటూ మభ్యపెట్టి పనులు చేయించుకున్నారని, అనేక ధర్నాలు, రాస్తారోకోలు పుల్లారావు ఆధ్వర్యంలో విజయవంతం చేశామని నేతలు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో చిలకలూరిపేట నుంచి పుల్లారావు రాకపోయినా, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయనే ఉండి బాధ్యతలు నిర్వహించినట్టుగా పనిచేసిన నేతలకు దిక్కుతోచడం లేదు.
పార్టీ అధికారంలోకి వస్తే ‘మన పుల్లారావు’ కు మంత్రి పదవి వస్తుంది, ఆయనకొస్తే మనకు ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశపడి రెక్కలు ముక్కలు చేసుకున్న నేతలకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అసలు పార్టీలో ఏమీ జరుగుతోంది, తాము పదవులకు అర్హులం కాదా? లేకపోతే మనీతో రాజకీయం చేయాలా? అనేది అర్థం కాక తికమకపడుతున్నారు. అసలు మంత్రిని నమ్ముకుంటే మంచిదా? లేక తమ ప్రయత్నాలు తాము చేసుకోవడం మంచిదా? మరో నేతను ఆశ్రయించడం మంచిదా అనే మీమాంసలో పడిపోతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గుంటూరులోని పలువురు నేతలు సీటు ఆశించారు. అభ్యర్థిని ఖరారు చేయడానికి అనేకసార్లు నేతలు సమావేశం అయ్యారు. దీనిపై జిల్లా నేతలు ఇంకా నిర్ణయం తీసుకోక ముందే అధినేత చంద్రబాబు టీడీపీతో సంబంధం లేని ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించారు. ఈ విషయంలో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్య భూమిక వహించడంతో గుంటూరు నేతలు ఆ సీటు మిస్ అయ్యారు.
ఆ తరువాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. దాదాపు రెండు నెలలపాటు మంత్రి పుల్లారావు కాన్వాయ్‌ను ఆశావహులంతా అనుసరించారు. హైదరాబాద్ వెళ్లేప్పుడు గన్నవరం విమానాశ్రయం వరకు సాగనంపడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయం చేరుకుని ఇంటి వరకు కాన్వాయ్‌ను ఫాలో కావడం వారికి నిత్య కృత్యమైంది. చివరకు పార్టీలో ఎవరూ ఊహించని విధంగా బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నం సతీష్ ప్రభాకర్ ఆ సీటును తన్నుకు పోయారు. దీనిలో పెద్ద లాబీయింగ్ జరిగిందని పార్టీలో వినపడుతోంది.
మంత్రి పుల్లారావును నమ్ముకున్న వారిలో ఎవరికీ సీటు రాకుండా అన్నం సతీష్‌కు లభించింది. మంత్రి ఏ స్థాయిలోనూ తమ సేవలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లలేదని, సీటు ఖరారు చేసే రోజు కూడా ఆయనగుంటూరులో ఉండటాన్ని ఆశావహులు తప్పుపడుతున్నారు. ఇక పార్టీ పదవులు కూడా మంత్రి అనుచరుల కంటే ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులకే లభించాయి. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాల పనులపై మంత్రి వద్దకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. తిరిగి తిరిగి అలసి ఆయన వద్దకు వెళ్లడం
మానుకుంటున్నారు.అందుకే మంత్రి కాన్వాయ్‌ను అనుసరించే వాహనాలు పూర్తిగా తగ్గిపోయాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆయన కాన్వాయ్‌ను పదిహేను ఇరవై కార్లు అనుసరిస్తే, ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇంటి వద్ద, గుంటూరులోని ఐబీ వద్ద మంత్రి కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది.