కులాల కుమ్ముడు
Published Thu, Feb 9 2017 12:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
భీమవరం :తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపడమే కాకుండా కులాల కోణాన్ని సైతం ప్రయోగిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరంతా సామాజిక వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలను వేడెక్కించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వీరవల్లి చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అప్పట్లో చంద్రశేఖర్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించినా చివరకు అదే సామాజిక వర్గానికి చెందిన అంగర రామ్మోహనరావుకు ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీష్ భీమవరం అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు టీడీపీలో చేరిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సీటు దక్కించుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. వీరంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ విషయంలోనూ వర్గాలవారీగా విడిపోయి ఆ పదవి దక్కించుకునేందుకు యత్నిం చి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సీనియర్ నాయకుడైన మెంటే పార్థసారథికి కట్టబెట్టేలా అంతా కలిసి ప్రయత్నిద్దామని ఎమ్మెల్యే పులపర్తి అంజి» êబు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ప్రకటించడంతో కులం కోణం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెంటే పార్థసారథితోపాటు గాదిరాజు బాబు, వీరవల్లి చంద్రశేఖర్ తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది.
మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి
ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామ్మోహనరావు ఇదే పదవి కోసం తిరిగి ప్రయత్నిస్తుండగా.. ఏలూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ పదవిపై కన్నేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినందున ఈ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో అంబికా ఉన్నారు. ఇక్కడా సామాజిక కోణమే నడుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్‌కు ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి ఈయనకు ఇవ్వకపోవచ్చని టీడీపీలో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ కోటాలో ఏలూరు నుంచి సైదు సత్యనారాయణ, తణుకు నుంచి డాక్టర్ దొమ్మేటి సుధాకర్, వావిరాల సరళాదేవి, తాడేపల్లిగూడెం నుంచి కిల్లాడి ప్రసాద్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాజిక చిచ్చు రగులుస్తున్న పదవుల వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక తెలుగు తమ్ముళ్లు తికమక పడుతున్నారు.
Advertisement