- నామినేషన్ వేసిన ప్రతిభా భారతి
- సందిగ్ధంలో ఎమ్మెల్సీ సీటు
- గవర్నర్ కోటా సీటుపై అనూరాధ ఆశ
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో రెండేళ్ల ఎమ్మెల్సీ కోటాకు పంచుమర్తి అనూరాధ నో చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన పాలడుగు వెంకట్రావు చనిపోవడంతో ఆయన స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జూపూడి ప్రభాకర్‌కు కేటాయించారు. అయితే, జూపూడికి మన రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఆయన పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. నామినేషన్‌కు గురువారం ఆఖరు రోజు కావడంతో ఆ పదవికి నామినేషన్ వేయమంటూ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
రెండేళ్ల పదవికి వద్దు
రెండేళ్ల గడువు మాత్రమే ఉన్న ఈ స్థానానికి తాను పోటీ చేయబోనని అనూరాధ స్పష్టం చేసినట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలంటే.. తొలుత నిర్ణయించినట్టుగా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రెండేళ్లకు మాత్రమే పరిమితమయ్యే పదవి తనకు వద్దని అనూరాధ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మాజీ స్పీకర్ ప్రతిభా భారతితో హుటాహుటిన ఆ పదవికి నామినేషన్ వేశారు. దీంతో గవర్నర్ కోటాలో మరో మహిళకు అవకాశం కల్పించే కంటే మరొకరికి చాన్స్ ఇవ్వాలంటూ ఆశావహులు కోరుతున్నారు. అనూరాధను పక్కన పెడితే ఆ సీటు నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవీంద్రకు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఉమా ఆశీస్సులతో బచ్చులకు..
పంచుమర్తి అనూరాధ నగర మేయర్‌గా పనిచేసే సమయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో చంద్రబాబు ఆమెకు అవకాశం కల్పించారు. అలాగే, తొండేపు దశరథ్ జనార్ధన్ హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడంతో చంద్రబాబుతో పాటు పార్టీలోని అనేకమంది సీనియర్ నేతలకు దగ్గరయ్యారు. దీంతో ఆయనకూ సీటు దక్కింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు పొందుతున్న బచ్చుల అర్జునుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడు.
గత ఎన్నికల్లో నూజివీడు, బందరు సీట్లు ఆశించి భంగపడ్డారు. ఉమా సూచన మేరకు బచ్చులకు సీటు దక్కేందుకు మార్గం సుగమమైంది. కాగా, ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ సర్పెంచిల సంఘానికి దీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన గత ఎన్నికల్లో పెనమలూరు సీటు ఆశించారు. చంద్రబాబుతో నేరుగా పరిచయాలు ఉండటంతో ఆయనకు మరోసారి అవకాశం లభిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఆరేళ్ల పదవిలో కొనసాగే అవకాశం ఉన్న సీటు బచ్చులకు దక్కుతుందా..? లేదా వైవీబీకి వరిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.
గవర్నర్ కోటాలో సీటు వస్తుంది :
పంచుమర్తి అనూరాధ
తొలుత నిర్ణయించినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నరు కోటాలోనే తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని పంచుమర్తి అనూరాధ ’సాక్షి’కి చెప్పారు. తనకు సీటు తప్పనిసరిగా వస్తుందని, ఏవిధమైన ఇబ్బందులు ఉండబోవని ఆమె అభిప్రాయపడ్డారు.