సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో ఎమ్మెల్సీ టిక్కెట్ పోరు పతాక స్థాయికి చేరింది. ఆశావహులంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. అధినేత చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు. ఏదో ఒక విధంగా దక్కించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. కొందరైతే ఎంతడిగితే అంత ముట్టజెప్పేందుకు సిద్ధ పడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిస్తే ఓకే....లేదంటే స్థానిక సంస్థల కోటాలో...కాదంటే గవర్నర్ కోటాలో ఇవ్వాలంటూ పట్టుబడుతున్నా రు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలి యదు గాని ఆశావహులు మాత్రం టెన్షన్‌లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అధిష్టానం హామీతో మొన్నటి ఎన్నికల పొటీ నుంచి తప్పుకున్నవాళ్లు పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే వారంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ చుట్టూ తిరుగుతున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
రాష్ట్ర మహిళా పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ప్రయత్నిస్తుండగా, అరకు ఎంపీగా పోటీ చేసి నష్టపోయానన్న వాదనతో, ఎస్టీ కేటగిరీలో ప్రాధాన్యం కల్పించాలని గుమ్మడి సంధ్యారాణి కోరుతున్నారు. పార్వతీపురం డివిజన్ రాజకీయాలను ప్రభావితం చేయాలంటే తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు అడుగుతున్నారు. ఇక, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తనను ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని ద్వారపురెడ్డి జగదీష్, సీనియర్ నేతలగా తమను పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, గద్దే బాబూరావు ప్రయత్నిస్తున్నారు. ఇక, మొన్నటి ఎన్నికల్లో తనకు రావల్సిన టిక్కెట్‌ను చివరి నిమిషంలో మృణాళినికి ఇచ్చారని, అధికారంలోకి వస్తే తగిన అవకాశాల్ని కల్పిస్తామని హా మీ ఇచ్చారన్న డిమాండ్‌తో చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులరాజు పోటీ పడుతున్నారు.
వీరంతా ప్రస్తుతం హైదరాబాద్ లో తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఇక, ఏ పార్టీ వైపు చూడకుండా, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని, ఎటువంటి పదవి పొందని తనకు అవకాశమివ్వాలని జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కోరుతున్నారు. విజయనగరంలోనే ఉండి తనకున్న లాబీయింగ్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక వర్గ కోటాలో, డివిజన్ కోటాలో, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఒక్కొక్కరూ ఒక్కో నినాదంతో అడుగుతున్నా రు. ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీలో పట్టు ఉన్న నేతలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కొందరైతే ఎంతైనా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తీవ్ర పోటీ నెలకొనడంతో బయటికి కలిసిమెలిసి ఉన్నట్టు కన్పిస్తున్నా లోలోపల ఎవరికి వారు చాడీలు చెప్పుకుని, దెబ్బకొట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. నేతల ట్రాక్ రికార్డులను చూడాలని, మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని, ఎంపీపీ పదవులిప్పిస్తామని, నామినేటేడ్ పోస్టులిప్పిస్తామని పెద్ద ఎ త్తున డబ్బులు నొక్కేసిన నేతల్ని, తరు చూ పార్టీలను మారి నేతలను, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసే నేతల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్తున్నారు.
టీడీపీలో ఎమ్మెల్సీ పోరు
Published Thu, Mar 12 2015 3:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement