‘డబుల్‌’ కాలనీల్లో సదుపాయాలు కరువు | Water And Power Cuts in Double Bedroom Scheme Colonies | Sakshi
Sakshi News home page

సౌకర్యాల్లేవ్‌!

Published Tue, May 21 2019 8:03 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Water And Power Cuts in Double Bedroom Scheme Colonies - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం... అవి పూర్తయ్యేలోగా ‘డబుల్‌’ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఫైర్‌ స్టేషన్లు, పోలీస్‌ స్టేషన్లు, సీసీ టీవీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగర్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు తదితర ఏర్పాటు చేయాలని భావించింది. అయితే జీహెచ్‌ఎంసీకి ఇళ్ల నిర్మాణ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులపై స్పష్టత లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖలఅధికారులతో ఏడాది క్రితం సమావేశం నిర్వహించారు. ఆయా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు వివరాలు అందజేయగా, జీహెచ్‌ఎంసీ వాటిని క్రోడీకరించి ఆయా పనులకు దాదాపు రూ.616 కోట్లు ఖర్చువుతుందని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన అనుమతులతో పాటు సంబంధిత శాఖలకు నిధులు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి ఏడెనిమిది నెలల క్రితమే నివేదిక అందజేసింది.

అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. నిధులకు సంబంధించి ఆయా శాఖలకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయనిదే తాము పనులు చేపట్టలేమని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేనిదే లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం త్వరిత్వగతిన నిర్ణయం తీసుకోవాలని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు... ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఆయా శాఖలు మొత్తం లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలకు ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తకాగా... మరో 35 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. కనీసం ఇళ్లు పూర్తయిన కాలనీల్లోనైనా మౌలిక సదుపాయాలు కల్పించనిదే ప్రభుత్వ ప్రయోజనం నెరవేరదని అధికారులు పేర్కొంటున్నారు. వృథాగా మారిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర ఇళ్ల పరిస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 

ఇవీ ప్రతిపాదనలు...   
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 109 ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయా శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.   
టీఎస్‌ఏపీడీసీఎల్‌: విద్యుత్‌ ఏర్పాట్లకు రూ.235.40 కోట్లు.
జలమండలి: ఓఆర్‌ఆర్‌ లోపల తాగునీటి సరఫరాకు రూ.158.65 కోట్లు.
ఆర్‌డబ్ల్యూఎస్‌అండ్‌ఎస్‌: ఓఆర్‌ఆర్‌ వెలుపలి కాలనీలకు తాగునీటి ఏర్పాట్లకు రూ.77.40 కోట్లు.  
హెచ్‌ఎండీఏ: జీహెచ్‌ఎంసీ వెలుపలి ప్రాంతాల్లోని కాలనీలకు అప్రోచ్‌ రోడ్లకు రూ.94.30 కోట్లు.  
 డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌: 10 ఫైర్‌ స్టేషన్ల ఏర్పాటుకు రూ.26.16 కోట్లు.  
రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌: 7 పోలీస్‌ అవుట్‌ పోస్టులు, 36 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.11.26 కోట్లు.  
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌: 3 పోలీస్‌ అవుట్‌ పోస్టులు, 32 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.7.34 కోట్లు.  
 సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌: 3 పోలీస్‌ అవుట్‌ పోస్టులు, 19 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు.
అన్నీ కలిపి మొత్తం వ్యయం: రూ.616.01 కోట్లు.  
 ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement