"సర్వజన" కష్టాలు
– నీళ్లు లేక ‘ఎక్స్‌రే’లు తీయని వైనం
– శిశువులకు స్నానం చేయించడానికీ ఇబ్బంది
– సమస్య తెలిసినా ట్యాంకులన్నీ ఖాళీగా ఉంచిన వైనం
– ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం
నీళ్లు లేకుంటే ఎక్స్‌రేలు తీయరా? ఇదేంటబ్బా.. ఇసిత్రం.. మేమెప్పుడూ ఇనలేదే.. అయినా సార్లు సెప్పినారు కదా.. రేపొద్దాం పదండి ! ఇదీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యులకు తలెత్తిన సందేహాలు. అవును..ఇది నిజం. నీటి సరఫరా లేకపోవడంతో పీడియాట్రిక్, సర్జికల్, గైనిక్ వార్డుల్లోని రోగులతో పాటు ఎక్స్‌రేలు తీయించుకునేందుకు వచ్చిన వారూ ఇబ్బందిపడ్డారు.
- అనంతపురం మెడికల్
సర్వజనాస్పత్రిలో గైనిక్ వార్డు భవనంపైన ఉన్న నీటి ట్యాంక్ నుంచి సదరు వార్డుతో పాటు ఎక్స్‌రేలు తీసే మూడు గదులకు నీరు సరఫరా అవుతుంది. మంగళవారం ఉదయం ట్యాంక్‌లో నీళ్లు లేకపోవడంతో ఎక్స్‌రేలు తీసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యేకంగా డ్రమ్ములను ‘డార్క్ రూం’లలో ఏర్పాటు చేసుకున్నా అందరికీ ఎక్స్‌రేలు తీయలేకపోయారు. ఎంఎల్‌సీ, ఆరోగ్య శ్రీ కింద వచ్చిన రోగులకు మాత్రమే ఎక్స్‌రేలు తీశారు. ఔట్‌పేషెంట్స్‌గా వచ్చిన ఏ ఒక్కరికీ తీయలేదు.
ముందే తెలిసినా.. పట్టించుకోలేదా?
అనంతపురానికి పీఏబీఆర్ నుంచి సరఫరా అవుతున్న నీటి పైప్‌లైన్‌ల లీకేజీల మరమ్మతుల కారణంగా సోమ, మంగళవారాల్లో నీటి సరఫరా ఉండదని గత శుక్రవారమే అధికారులు ప్రకటించారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ముందుచూపుతో వ్యవహరించి సంప్‌తో పాటు అన్ని వార్డుల వద్ద ఉన్న ట్యాంక్‌లను నీటితో నింపలేకపోయారు. ఫలితంగా రోగులకు నీటి కష్టాలు తప్పలేదు. గైనిక్ వార్డులో ఉన్న 50 మందికి పైగా శిశువులకు మంగళవారం స్నానం చేయించేందుకు నానా తిప్పలు పడ్డారు. బాత్‌రూంలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. నీరు కోసం బయట సులభ్ కాంప్లెక్స్‌ను ఆశ్రయించారు.
స్పందించని ఎమ్మెల్యే
ఆస్పత్రిలో నీటి కష్టాలపై సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఉదయాన్నే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. నగర పాలక సంస్థ కమిషనర్‌తో మాట్లాడారు. అత్యవసరంగా పది ట్యాంకర్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరారు. ఇందుకు సరేనన్న అధికారులు కేవలం రెండు ట్యాంకర్లు మాత్రమే పంపారు. ఆ నీటిని సంప్‌లో నింపారు. వాస్తవానికి సంప్ నుంచి ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయాలంటే కనీసం ఐదు ట్యాంకర్లు అవసరం. కానీ రెండే రావడంతో ఆ నీరు ఎందుకూ పనికి రాకుండాపోయింది. మిగిలిన ట్యాంకర్ల కోసం అధికారులకు ఫోన్‌లు చేసినా ‘అదిగో..ఇదిగో’ అంటూ రోజంతా గడిపేశారు. బుధవారం నీరు అందుబాటులోకి రాకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.