గుక్కెడు నీటికి.. కడివెడు కష్టాలు | Water Problems in Anantapur | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీటికి.. కడివెడు కష్టాలు

Published Tue, Apr 16 2019 11:12 AM | Last Updated on Tue, Apr 16 2019 11:12 AM

Water Problems in Anantapur - Sakshi

ఖాళీ బిందెలతో కటకంవారిపల్లి వాసుల నిరసన

గుక్కెడు నీటికోసం ‘అనంత’ అల్లాడిపోతోంది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటగా బిందెనీటి కోసం జనం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారగా..    ప్రజలు పనులు మానుకుని నీటియుద్ధాలు చేస్తున్నారు. ఏటా ఇదే సమస్య నెలకొంటున్నా ఉన్నతాధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నం కాగా.. రెండు నెలలుగా పల్లెలు జలం కోసం ఘొల్లుమంటున్నాయి.  

అనంతపురం, టవర్‌క్లాక్‌ : భూగర్భజలం పాతాళంలోకి పడిపోయింది. కరువుకు నిలయమైన ‘అనంత’లో ఏటా అనావృష్టి నెలకొనడంతో జలం...జటిలంగా మారింది. జిల్లాలో 63 మండలాలుండగా.. 1003 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి వేసవిలోనూ పల్లెవాసులు నీటి చుక్కకోసం అష్టకష్టాలు పడుతున్నారు.

పాతాళంలో జలం
అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, రామగిరి, వజ్రకరూరు, పుట్లూరు. గుత్తి, గుంతకల్లు, కనగానపల్లి మండలాల్లో భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఈ మండలాల్లోని వారంతా వేసవి వచ్చిందంటే తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతారు. బిందె నీటికోసం మండుటెండలో కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా ఇదే సమస్య నెలకొంటున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

శాశ్వత పరిష్కారం చూపని సర్కార్‌
జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం ద్వారా  వైఎస్‌ రాజశేఖరరెడ్డి  తన హయాంలో మూడు నియోజకవర్గాలకు తాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. ఆ మేరకు నిధులు విడుదల చేసి పనులు కూడా వేగవంతంగా చేయించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు వైఎస్సార్‌ హయాంలోనే రూపుదిద్దుకున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణను టీడీపీ సర్కార్‌ గాలికొదిలేయడంతో పల్లెలన్నీ గొంతుతడిపే చుక్కనీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా...అవి ఎందుకూ చాలడం లేదని జనం చెబుతున్నారు. పైగా అరకొర నీటి సరఫరా వల్ల నీటికోసం ఘర్షణ పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు.

డేంజర్‌ జోన్‌లో ఉన్న గ్రామాలు
భూగర్భజలం పూర్తిగా అడుగంటడంతో జిల్లాలోని 31 గ్రామాలు డేంజర్‌జోన్‌లోకి వెళ్లిపోయాయి. అనంతపురం రూరల్‌ మండలంలోని ఎంబీపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రోనిపల్లి, ఎర్రోనిపల్లి తాండకు, గంగినేపల్లి తండా, ఫ్యాదిండి, వెళ్ళుదుర్తి, రామగిరి మండలంలోని గరిమేకపల్లి, కొండాపురం, వజ్రకరూరు మండలంలో కొనకొండ్ల, పుట్టపర్తి మండలంలో సి.వెంగన్నపల్లి, పుట్లూరు, పి.చింతపల్లి, చింతలపల్లి, బాలపురం, ఎం.కాండాపురం, కుండగారికుంట, గోపరాజుపల్లి, చింతకుంట్ల, తుకపల్లి, నాగిరెడ్డిపల్లి, గుత్తి మండలం కె.ఊబిచెర్ల, ఉటకల్లు, బేదపల్లి, ఊబిచెర్ల, జక్కలచెరువు, టి.కొత్తపల్లి, గుంతకల్లు మండలంలో మల్లెనపల్లి, ఎన్‌.కొట్టాలకు, మొలకలపెంట, కనగానపల్లి మండలంలోని వేపకుంటల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులే చెబుతున్నారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ అరకొర నీటి సరఫరాతో అల్లాడిపోతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతున్నా...అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారని వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement