
పద్మారెడ్డి తోటలో కందకం తవ్వుతున్న జేసీబీ
భూగర్భ జాలాలు అడుగంటిన నేపథ్యంలో వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లోని పండ్ల తోటల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోకసాని పద్మారెడ్డి కూడా వారిలో ఒకరు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో పద్మారెడ్డికి 80 ఎకరాల భూమి ఉంది. ఇందులోబత్తాయి తదితర తోటలు ఉన్నాయి. తోటలకు నీటి కొరత తీర్చుకునేందుకు గత కొన్నేళ్లుగా మొత్తం 247 బోర్లు వేసిన రైతు పద్మారెడ్డి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల బోర్లలో నీరు ఆఫ్ ఇంచ్‌కు తగ్గిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), వాటర్ మేనేజ్‌మెంట్ ఫోరం నిపుణుడు శంకరప్రసాద్ (90003 00993) సూచన మేరకు జూలై 5–6 తేదీల్లో తమ 80 ఎకరాల్లో, వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, కందకాలు తవ్వించారు. అదృష్టం కొద్దీ కందకాలు తవ్విన కొద్ది రోజుల్లోనే 3 రోజుల పాటు మంచి వర్షాలు కురిశాయి. పొలాల్లో కురిసిన ప్రతి చినుకూ కందకాల ద్వారా అంతకుముందెన్నడూ లేని విధంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జల మట్టం పెరిగింది. గతంలో ఆఫ్ ఇంచ్ పోసే బోర్లు ఇప్పుడు 2.5 ఇంచులు ఫుల్లుగా పోస్తుండడంతో పద్మారెడ్డి పరమానందభరితుడయ్యారు. అనూహ్యంగా ఇంత సులువుగా, ఇంత తక్కువ రోజుల్లో భూగర్భ జల మట్టం పెరగడం తనను ఆశ్చర్యపరచిందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో గుంటిపల్లి దగ్గర ఉన్న మరో 30 ఎకరాల్లో కూడా కందకాలు తీయిస్తున్నామన్నారు. సాగు నీటి భద్రత కోసం కందకాల ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక, టీవీ యాజమాన్యాలకు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నేతలకు పద్మారెడ్డి(99481 11931) కృతజ్ఞతలు తెలిపారు.