వర్షాకాలంలోనూ నీటికి కటకట
– తీవ్ర వర్షాభావంతో పైకి రానుంటున్న పాతాళగంగమ్మ
– ఎండిపోతున్న తాగునీటి వనరులు
– నేటికీ 330 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా
– సెంటీ మీటరు కూడా పెరగని జలాలు
అనంతపురం సిటీ : జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో ప్రజానీకం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో అటు రైతులే కాదు.. తాగునీటికి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 30 మండలాల వరకూ తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అందులో సమస్యాత్మకంగా మారిన 24 మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. గతంతో పోలిస్తే వర్షాకాలంలో కూడా జిల్లా ప్రజలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు.
ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే నెలాఖరు వరకూ మాత్రమే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నీటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ సమయంలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్ల సహాయంతో, వ్యవసాయబోర్లను లీజుకు తీసుకుని నీటిని సరఫరా చేసేవారు. అయితే ఈ ఏడాది మాత్రం వర్షాకాలంలో ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తున్నా తాగునీటి విషయంలో మార్పు రాలేదు కదా రోజురోజుకూ జఠిలమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పూర్తిగా వరుణుడు ముఖం చాటేయడం, వచ్చినా పెద్దగా భూగర్భజలాలు పెరిగేంత పడకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆగస్టు గడుస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క వర్షం కురవలేదు. దీంతో భూగర్భజలాలు వేసవిలో కంటే అట్టడుగు స్థాయికి పడిపోయాయి.
అటు వ్యవసాయ రంగానికి సంబంధించిన బోర్లతో పాటు ప్రజలకు తాగునీరందించే పంచాయతీ బోర్లు కూడా ఎండిపోయాయి. ఫలితంగా గ్రామాల్లో వేసవి పరిస్థితులు తలపిస్తున్నాయి. నీళ్ల కోసం నేటికీ వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. దాదాపు 1400 గ్రామాలకు అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. నెలాఖరు వరకూ వర్షం కురవకపోతే ఈ గ్రామాల సంఖ్య పెరిగే అవకాశముందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు భావిస్తున్నారు.
ఈ (ఆగష్టు) నెలలో కూడా వర్షం పడకపోవడంతో తాగునీటి వనరులపై దెబ్బ పడుతోంది. భూగర్భ జలాలు 81 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది కంటే మూడు నుంచి నాలుగు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంతో వందలాది బోర్లు ఎండిపోయాయి. ఈ ఏడాది తాగునీటికి సంబంధించిన మొత్తం 1240 బోర్లు ఎండిపోయినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలన్నదే ప్రస్తుతం అందరిని ఆందోనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తాగునీటి సమస్యని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.