ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు | Water Problems Start in Anantapur | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు

Published Tue, Feb 12 2019 12:46 PM | Last Updated on Tue, Feb 12 2019 12:46 PM

Water Problems Start in Anantapur - Sakshi

కక్కలపల్లికాలనీ పంచాయతీలో తాగునీటి కోసం మహిళల ఇబ్బందులు

వేసవి ఇంకా ప్రారంభం కాకనే తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 140 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఎండలు ముదిరితే పరిస్థితి ఏంటని తల్చుకుంటేనే గొంతులో తడారి పోతోందని ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవిలో ఉపశమనం కలిగించడానికి అధికారులు తమవంతు ప్రయత్నంగా వేసవి ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.17కోట్లు ఇస్తే వేసవిలో నీటిఎద్దడిని నివారించగలమని ప్రతిపాదనలు పంపారు.

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం అసలే కరువు జిల్లా. ఈ ఏడాది మరింత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 45శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సమయానికి 18 మీటర్ల లోతులో ఉండాల్సిన భూగర్భజలాలు 23 మీటర్ల లోతులో ఉన్నాయి. వేసవిలో ఇంకా అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు. ఇప్పటికే 140 గ్రామాలకు నీళ్లను ట్యాంకర్లతో అందిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వర్షాభావం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయం...దారి మళ్లిన నీళ్లు
ఈ ఏడాది వర్షాభావానికి పాలకుల స్వార్థం తోడవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. హెచ్చెల్సీ, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు దారి మళ్లాయి. ముఖ్యంగా  హంద్రీనీవా ద్వారా కొన్ని చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఎన్నికల సమయం కావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాకు వచ్చి కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని కుప్పంకు మళ్లించారు. జిల్లాలో చెరువులన్నీ నింపిన తర్వాతే కుప్పంకు తీసుకుపోవాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. గతంలో కన్నా ఈ ఏడాది తక్కువ చెరువులు నింపారు. పీఏబీఆర్‌ కుడికాలువ కింద కేవలం 0.8 టీఎంసీలు వదిలి మమ అనిపించారు. చెరువులు కూడా తడపకుండానే ముగించారు.

వేసవిలో నీటిఎద్దడి గ్రామాలు 500లకు పైమాటే
ఈ ఏడాది జిల్లాలో 500 గ్రామాలకు పైగా తీవ్ర తాగునీటి ఎద్దడితో అగచాట్లు ప్రమాదం ఉన్నట్లు అంచనాలున్నాయి. అధికారికంగానే 350 గ్రామాలను గుర్తించారు. వాటన్నింటికీ ట్యాంకర్లతో నీరందించాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇలా సరఫరా చేసేందుకు కూడా సమీపంలో నీటి వసతి దొరకడం కూడా గగనంగా మారుతోంది. ఇదిలా ఉంటే గతేడాది నీరందించిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. దాదాపు రూ.4కోట్లకు పైగా బకాయి పడినట్లు తెలుస్తోంది. వాటిని చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది నీరు సరఫరా చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.17కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

నీటి ఎద్దడిని నివారిస్తాం
తాగునీటి ఎద్దడి నివారణకు రూ.17కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉంటే మా దృష్టికి వచ్చిన 24 గంటల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఏ సమయంలోనైనా నా నెంబర్‌ 91001 22100కు ఫోన్‌ చేస్తే తక్షణం నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.– హరేరామనాయక్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement