
అనంతపురం అర్బన్: రాబోవు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సెంటర్ ఫర్ క్‌లైమేట్ చేంజ్ అండ్ అడాప్టేషన్ డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. ఉష్ణోగ్రత కారణంగా కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై డైరెక్టర్ కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్తుల నివారణ అమలులో భాగంగా తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం జిల్లాలను ఎంపిక చేశారన్నారు. అనంతపురం జిల్లాలో కదిరి, గుంకతల్లు మండలాలను ఎంపిక చేశారన్నారు.
ఈ రెండు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ మండలాల్లో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, కార్మిక, వైద్యారోగ్య, ఐసీడీఎస్, డ్వామా, డీఆర్‌డీఏ, అగ్నిమాపక, పోలీసు, తదితర శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. వేసవిలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.