
అనంతపురం అగ్రికల్చర్: వేసవికి ముందే భానుడు భగభగ మంటున్నాడు. ఫిబ్రవరి చివరి వారంలోనే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్క్‌ను దాటిపోయింది. మధ్యాహ్నం వేళ మాడు పగిలిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకుని జనం ఆందోళన చెందుతున్నారు. ఇకమంగళవారం జిల్లా వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. మడకశిర, పెనుకొండ, హిందూపురం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో చలి వాతావరణం కొనసాగుతున్నా.. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం తాడిమర్రిలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా... అగళిలో 13.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 39 నుంచి 34 డిగ్రీల మధ్య గరిష్ట, 14 నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగాయి. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.