ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఇందూరు జిల్లా కుతకుత ఉడుకుతోంది.. ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పది గంటల తర్వాత నిప్పులు కురిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. భానుడి ప్రతాపానికి జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం జిల్లాలో సగటున 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో 45.2 డిగ్రీలుగా నమోదైంది. మిగతా మండలాల్లోనూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, వడ గాలులు దడ పుట్టిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉదయం 10 గంటలకే భయకరమైన వేడి వడ గాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే గడప దాటుతున్నారు. ఎండ తీవ్రత పెరగడం, జనం బయటకు వచ్చేందుకు భయపడుతుండడంతో ఉదయం పది గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఐదారు గంటలకు రహదారులు బోసి పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment