అంబేడ్కర్ నగర్‌లో నీళ్లొప్పుడొస్తాయో తెలియక ఖళీ బిందెలతో వేసి చూస్తున్న మహిళ
నగరవాసి గొంతెండుతోంది.. నాలుగు బిందెల నీటికి నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడో మే నెలలో తలెత్తే నీటి ఎద్దడి ఈ సారి మార్చిలోనే చుట్టుముట్టింది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో జనం ‘చుక్కలు’ చూస్తున్నారు. రెండు రోజులకోసారి నీరు సరఫరా చేయడం.. అదీ అరగంటే కావడంతో నగరం లోని చాలా ప్రాంతాల్లో తాగునీటికోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా.. అవి అందరికీ సరిపడక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
అనంతపురం న్యూసిటీ: నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లోనే రూ.67 కోట్లతో పీఏబీఆర్ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. 2.50 లక్షల పైచిలుకు జనమున్న ‘అనంత’కు రాబోయే 50 ఏళ్ల వరకు ఎలాంటి నీటి సమస్య రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటి పాలకులు నిర్లక్ష్యం..అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రజలకు గుక్కెడు నీరందక అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండురోజులకోసారి వచ్చే నీరు సైతం సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
ఏటా రూ.2 కోట్ల ఖర్చు చేసినా..
నగరానికి నీటి సరఫరా చేసేందుకు నగరపాలక సంస్థ ఏటా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. నగరంలో పైప్‌లైన్ నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రతినెలా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు. కనీసం చెడిపోయిన బోర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం లేదు. అందువల్లే పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులు మాత్రం రూ.వందల కోట్ల అభివృద్ధి చేశామని, ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్ల నీటిని అందిస్తున్నామని చెబుతున్నా... అది కాగితాలకే పరిమితమవుతోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేలుకోకపోతే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. అదే జరిగితే జనం మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
తాగునీరు కొనాల్సిందే
నగరంలో 50 డివిజన్లు ఉండగా...అధిక సంఖ్యలోని ప్రజలు తాగునీటిని (మినరల్ వాటర్) కొనుగోలు చేస్తున్నారు. బిందె రూ 7, క్యాన్ రూ 10 చొప్పున వెచ్చించి కొంటున్నారు. నగరపాలక సంస్థ తాగునీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతోనే మినరల్ వాటర్ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా సరఫరా
నీరు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నా... చాలా ప్రాంతాల వారు నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. మంగళవారి కాలనీ, పాతూరు, ఆస్పత్రి వెనుకవైపు కొట్టాలు, కొవూర్‌నగర్, లక్ష్మీనగర్, ఎర్రనేలకొట్టాలు, మురికివాడలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు సాక్షాత్తు నగరపాలక సంస్థలోని నీటి సరఫరా అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు. చాలా ప్రాంతాలకు అరగంట మాత్రమే నీరు సరఫరా చేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నగరంలో నీటి వ్యాపారం జోరందుకుంది.
ప్రచార ఆర్భాటమే
ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ప్రచార ఆర్భాటాలకే సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే...జనానికి సరిపడా నీరందించలేని పరిస్థితిలో ఉన్నారు. సాక్షాత్తూ మేయర్ స్వరూప ప్రాతినిథ్యం వహిస్తున్న 20వ డివిజన్‌లోని మిస్సమ్మ కాలనీలోనే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో ఉండే మంగళవారి కాలనీలో నీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులకు ఇవేమీ పట్టడం లేదు.
కెనాల్‌కు వెళ్లి తెచ్చుకున్నాం
ఈమె పేరు రత్న. 9వ డివిజన్ భవానీనగర్‌లో ఉంటోంది. నగరపాలక సంస్థ నీరు సరఫరా చేయకపోవడంతో నీటిని కొనుగోలు చేసి తీసుకెళ్తోంది. రెండ్రోజులకోసారి కూడా నీళ్లు సరిగా సరఫరా చేయడం లేదని... ఇక తాగునీటి కష్టాలు చెప్పుకుంటే తీరేవి కావంటోంది. నీళ్లు రాక కెనాల్‌కు వెళ్లి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎగబడతారని, మూడేళ్లుగా నీరు సరిగా రాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సారి ఓట్లడిగేందుకొస్తే అప్పుడు చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాలు
మున్నానగర్, రాణినగర్, బాపనవీధి, ఆసార్ వీధి, రాజమ్మ కాలనీ, వినాయకనగర్, ఉమానగర్, మంగళవారి కాలనీ, భవానీనగర్, భాగ్యనగర్, నీరుగంటి వీధి, అశోక్‌నగర్, బాలకృష్ణ కొట్టాలు, ప్రకాష్‌రోడ్డు, మల్లీశ్వరి రోడ్డు, హరిజన వాడ, కొవూర్‌నగర్, లక్ష్మీనగర్, 5, 6 రోడ్లలోని ఎక్స్‌టెన్షన్ ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. అది కూడా అంతంతమాత్రమే కావడంతో జనం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment