సాక్షి ప్రతినిధి, అనంతపురం: నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్‌గౌడ్‌కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు.
పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
జేసీ కుటుంబానికి కొమ్ములొచ్చాయా?
నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గానికి ఏమైనా కొమ్ములొచ్చాయా అంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న బాబు.. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది.
బీసీ వర్గాల్లో అసమ్మతి రాగాలు
బోయ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం జిల్లాలో ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన నిమ్మల కిష్టప్ప తనను పక్కన పెట్టారని టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా అంటున్నట్టు సమాచారం. నిమ్మల, బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ వంటి బీసీ నేతలతోపాటు శింగనమల, మడకశిర నియోజకవర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు అధికార పక్షం దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దూసుకెళుతుండగా.. ఇప్పటివరకు చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు శనివారం ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment