తిరుమలలో నీటి సమస్య జటిలమవుతోంది. ప్రస్తుత నీటి నిల్వలు మరో 50 రోజులకు సరిపోతాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదం ఉంది. కళ్యాణిడ్యాం, కండలేరు, తెలుగుగంగ కూడా డెడ్ స్టోరేజ్‌కి చేరాయి. తిరుమలకు ప్రత్యామ్నాయంగా నీటిని తరలించే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటి వాడకాన్ని పొదుపుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరుణదేవుడిపై గంపెడాశలు పెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు.
సాక్షి, తిరుమల: తిరుమలకు నీటినందించే జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. విధిలేని పరిస్థితుల్లో టీటీడీ పొదుపు చర్యలు పాటిస్తోంది. దగ్గర్లో వర్షాలు రాకుంటే బ్రహ్మోత్సవాల నాటికి తీవ్ర ఇబ్బందులు తప్పేటట్లు లేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో 70 వేల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. దీనికితోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల మంది వరకు తిరుమలలో నివాసం ఉంటున్నా రు. వీరందరికి తాగునీటి సౌకర్యం కల్పిం చేందుకు 1963 నుంచి దశల వారీగా తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలను టీటీడీ నిర్మించింది. ఇవేగాక తిరుపతి కళ్యాణి డ్యాం నుంచి, బోర్ల ద్వారా కూడా నీటిని తిరుమలకు టీటీడీ తరలిస్తోంది.
గోగర్భం డ్యాంలో 2,683 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 5,167 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 670 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 3,962 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 1,295 లక్షల గ్యాలన్లు నీటిని నిల్వ చేయవచ్చు. తిరుమలకు సంబంధించి నిత్యం 30 నుంచి 40 లక్షల గ్యాలన్లు వరకు నీటి వాడకం ఉంటుంది. కానీ గత ఏడాది ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. తిరుమలలో సగటు స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వర్షాలు లేవు. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోగా కూమార, పసుపు ధార జంట ప్రాజెక్టుల్లో దాదాపు 2వేల లక్షల గ్యాలన్లు నీటి నిల్వలు ఉన్నాయి.
నీటి ఎద్దడి సమస్య కొత్తది కాదు
తిరుమలలో నీటి ఎద్దడి సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. 2002 సంవత్సరంలో కూడా తీవ్ర వర్షభావం కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పట్లో ట్యాంకర్ల ద్వారా టీటీడీ తిరుమలకు నీటిని తరలించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం భక్తుల అవసరాల దృష్ట్యా తిరుమలకు తిరుపతి నుంచి నీటిని తరలించేందుకు పైపులైను నిర్మించింది. కళ్యాణిడ్యాం నుంచి నీటిని భక్తుల అవసరాల కోసం తరలించేందుకు అనుమతించడంతో పాటు బోర్ల ద్వారా 2 లక్షల గ్యాలన్ల నీటిని తరలించింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే కళ్యాణిడ్యాంలో కూడా నీరు అడుగంటిపోయింది.
కండలేరు నుంచి తెలుగు గంగ నీటిని తిరుమలకు తరలించాలని నిర్ణయించినప్పటికీ కండలేరులో కూడా నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం తిరుమలలోని జలాశయాల్లో ఉన్న నిల్వల మేరకు మరో 50 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు అధికారులు. తిరుమలలో వర్షాలు సా«ధారణంగా ఈశాన్య రుతుపవనాలు కాలంలో కాకుండా నైరుతి రుతు పవనాల సమయంలో కురుస్తాయి. అంటే తిరుమల జలాశయాల్లో నీరు చేరే వర్షాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల మేరకు ఆగస్టు మాసం మధ్యంతరానికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయి.
బ్రహ్మోత్సవాల నాటికి పరిస్థితి మరింత తీవ్రం
సెప్టెంబర్ చివరలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ ఏడాది తిరుమలలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. నీటి ఎద్దడి తరుముకొస్తుండడంతో తిరుపతి నుంచి నీటి తరలింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగంతో టీటీడీ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. రానున్న నీటి ఎద్దడిని నివారించేందుకు త్వరలోనే జిల్లాస్థాయి అధికారులతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముంచుకొస్తున్న నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగా కళ్యాణిడ్యామ్ వద్ద ఉన్న బోర్ల నుంచి సాధ్యమైనంత నీటిని ప్రతిరోజు తిరుమలకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు.
అక్కడ నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిచోటా నీరు డెడ్ స్టోరేజ్ లెవల్‌కు చేరుకోవడంతో తిరుమలకు నీటిని తరలించే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ప్రస్తుతానికి ఉన్న నీటి ద్వారా దాదాపు 50రోజులు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అటు తర్వాత మాత్రం ఏడుకొండలవాడే దిక్కు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతా ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడుకొండలవాడు కనికరించపోతాడా.. వర్షం కురవకపోతుందా.. జలాశయాలు నిండకపోతాయా.. సమస్య తీరకపోతుందా.. అని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవ ప్రయత్నం ద్వారా చేయాల్సిందంతా చేసేయడంతో అధికారులు ఇక వరుణదేవుడిపై భారం మోపారు.
నీటి పొదుపు చర్యలు
తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం కూడా లేకపోవడంతో తిరుమలలో టీటీడీ నీటి పొదుపు చర్యలను మొదలుపెట్టింది. ఇప్పటికే మఠాలు, హోటళ్లకు కేవలం రోజుకు 4గంటలకు మాత్రమే నీటిని పంపిణీ చేస్తోంది. కాటేజీల్లో నీటి నియంత్రణ చేస్తోంది. ఇక స్థానికులు, ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటిని వదులుతోంది. దీంతో స్థానికులు, ఉద్యోగులు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment