
తాగునీరు డ్రైనేజీ నీరును తలపిస్తోంది.. రంగుమారి దుర్గంధం వెదజల్లుతోంది..దేవుడా ఈ నీళ్లు ఎలా తాగాలంటూ గూడూరు పట్టణవాసులు ఘోషిస్తున్నారు.గూడూరు పట్టణంలో డిమాండ్ తగ్గట్టుగా తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేదిఅరుదు. అరకొరగా సరఫరా అవుతున్న నీరు కూడా దారుణంగా ఉంటోందనిప్రజలు ఆగ్రహిస్తున్నారు. నీటి సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులుస్పందించడం లేదు. తరచూ పైపులైన్లు పగిలిపోతుండడంతో కండలేరునుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోంది. వర్షాలు సక్రమంగాకురవక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మున్సిపల్ నీరేదిక్కయింది. మురుగు నీరొస్తోందని అధికారులను ప్రజలు అడుగుతుంటేసమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారు.
గూడూరు: గూడూరు పట్టణానికి కండలేరు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. పైపులు నాసిరకంగా ఉండడంతో అవి తరచూ పగిలిపోతూ కలుషిత నీరు వస్తోంది. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ లీకులను సరి చేయకపోవడంతో సరఫరా అవుతున్న నీరు కూడా కలుషితంగా మారి, మురుగు నీటిని తలపించేలా ఉంది. ఆ నీరే పట్టణ ప్రజలకు దిక్కవుతోంది. అసలే జ్వరాల తీవ్రతతో ఆస్పత్రుల పాలై అల్లాడుతుంటే, సరఫరా అవుతున్న కలుషిత నీరు తాగితే మరిన్ని జబ్బులు వచ్చి మంచాన పడతామని వారు వాపోతున్నారు. దీంతో విధి లేక క్యాన్ వాటర్‌నే కొని తాగాల్సి వస్తోందని, దీంతో ఖర్చు మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల
ప్రకారం ప్రస్తుతం గూడూరు పట్టణ జనాభా 78,700 ఉండగా 12,400 ఇళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో పట్టణానికి ఒక రోజుకు 10 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంది. సగటున ఒక్కొక్కరికీ 100 లీటర్ల నీటిని అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం అధికారికంగా 5,541 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా అదే సంఖ్య ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
పగులుతున్న పైప్‌లైన్లు
కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని సరఫరా చేసే పైపులు నాసిరకమైనవి ఏర్పాటు చేయడంతో అవి పలు ప్రాంతాల్లో తరచూ పగిలిపోయి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. అలా పగిలిపోయిన పైప్‌లను తిరిగి మరమ్మతులు చేసే క్రమంలో సక్రమంగా చేయకపోవడంతోనే ఆ ప్రాంతంలో లీక్ అయి మురుగు నీరు పైపుల్లోకి ప్రవహించి దుర్గంధభరితమైన తాగునీరు సరఫరా అవుతోంది. ఒక్కోసారి అసలు తాగునీరే సరఫరా కాక వాటి కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోం దని పట్టణ ప్రజలు వాపోతున్నారు. స్పందించాల్సిన ప్రజాత్రినిధులు, అధికారులు మిన్నకుండిపోతున్నారు.