మడిలో.. తడబడుతూ.. | MADILO..TADABADUTOO.. | Sakshi
Sakshi News home page

మడిలో.. తడబడుతూ..

Published Sun, Jul 24 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

మడిలో.. తడబడుతూ..

మడిలో.. తడబడుతూ..

  • ముందుకు సాగని ఖరీఫ్‌
  • గోదావరిలో నీరున్నా డెల్టా, పుష్కరలో ముందుకు సాగని సాగు
  • ఏలేరు, పంపాలో కానరాని జలకళ
  • కీలక సమయంలో కానరాని వరుణుడి కరుణ
  • జూన్‌లో రెట్టింపు.. జూలైలో సగమే వర్షపాతం
  •  
    •  చుక్క నీరు లేక ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టులో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. భూపతిపాలెం రిజర్వాయర్‌లో నీరున్నా.. ఆగస్టు ఒకటిన కానీ విడుదల చేసే అవకాశం లేదు. గోదావరిలో వేలాది క్యూసెక్కుల నీరు వథా పోతున్నా మంత్రిగారు రావాలంటూ పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయడంలేదు. ఈ కారణంగా మెట్ట, ఏజెన్సీల్లో సాగు ముందుకు సాగడం లేదు.
    •  మూడు నాలుగు రోజుల ముందు వరకూ ఈ నెలలో జిల్లాలో పెద్దగా వర్షాలు లేవు. అయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో గోదావరిలో వరద పోటెత్తింది. అయితే, అదే గోదావరి డెల్టాలో మొత్తం 40 శాతం కూడా ఖరీఫ్‌ వరి నాట్లు పడలేదు. తూర్పు డెల్టాలో ఖరీఫ్‌ కొంత ఆశాజనకంగా ఉన్నా.. మధ్య డెల్టాలో మాత్రం ముంపు భయంతో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు.
    •  ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది. ఇది నిజమేనన్నట్టు కాస్త ఆలస్యంగా వచ్చినా నైరుతి ప్రభావంతో జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కీలకమైన జూలై నెలలో వరుణుడు ముఖం చాటేయడంతో.. తొలకరి సాగుకు సమాయత్తమైన రైతులు.. సాగు ముందుకు సాగుతుందో లేదోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
     
    అమలాపురం : 
    నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి పుణ్యమా అని జిల్లాలో జూన్‌ నెలలో భారీ వర్షాలు కురిశాయి. రైతులు తొలకరిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అనావృష్టితో రెండేళ్లపాటు అష్టకష్టాలు పడ్డ మెట్ట, ఏజెన్సీ రైతులు.. ఈ ఏడాది మంచి దిగుబడి సాధించాలని ఆశించారు. కానీ అవసరమైన సమయంలో కరుణ చూపని వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. జూన్‌లో రెట్టింపు కురిసి.. తొలకరిపై రైతుల్లో ఆశలు రేపిన వర్షం.. జూలైలో మాత్రం కురవాల్సినదానిలో సగం కూడా పడలేదు. జూలై ఒకటి నుంచి 23వ తేదీ (శనివారం) వరకూ సగటున 177.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 103.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఏజెన్సీలోని చింతూరులో సాధారణంకంటే 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదు కాగా.. మిగిలిన ఏజెన్సీ, మెట్ట మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం లేదు. మెట్టలోని తొండంగి, గొల్లప్రోలు, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, గోకవరం, రంగంపేట మండలాల్లో సగం వర్షం లోటే. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు ఒడుదొడుకులకు లోనవుతోంది. జిల్లాలో ప్రధాన పంటయిన వరి సాగు లక్ష్యం 5.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకూ 1.76 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మరోపక్క ఖరీఫ్‌లో జిల్లా రైతులు సాగు చేసే చిరుధాన్యాలు, అపరాలు, పత్తి, చెరకు పంటల సాగు సైతం ఇంకా 30 శాతం కూడా మించలేదు. సాగులో జరుగుతున్న ఈ అసాధారణ జాప్యంవల్ల.. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో కురిసే  వర్షాలకు నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    గోదావరి డెల్టా ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ప్రస్తుత పరిస్థితి :
    తూర్పు డెల్టాకు నీటి విడుదల : 4,100 క్యూసెక్కులు 
    మధ్య డెల్టాకు : 2,000 క్యూసెక్కులు
    పశ్చిమ డెల్టాకు : 6,500 క్యూసెక్కులు
    సముద్రంలోకి : 1,57,711 క్యూసెక్కులు
    ఇన్‌ ఫ్లో : 1,69,848 క్యూసెక్కులు
    పాండ్‌ లెవెల్‌ : 13.81 మీటర్లు
    మొత్తం ఆయకట్టు : 10.16 లక్షల ఎకరాలు
    జిల్లాలో ఆయకట్టు : 5 లక్షలు ఎకరాలు
    •  తూర్పు డెల్టాలో నాట్లు జోరుగా పడుతున్నాయి. ఇక్కడ 70 శాతం నాట్లు పడ్డాయి. వెదజల్లు సాగు ఎక్కువగా జరుగుతోంది. రామచంద్రపురం, అనపర్తి, ఆలమూరు, రాజమహేంద్రవరం వ్యవసాయ సబ్‌ డివిజన్లలో సాగు జోరుగా సాగుతోంది. కాకినాడ, కరప సబ్‌ డివిజన్లలో కాస్త ఆలస్యమైంది.
    •  మధ్య డెల్టాలో సాగు పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం సబ్‌ డివిజన్లలో 20 శాతం కూడా నాట్లు పడలేదు. ముంపునకు భయపడి ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాల్లో సాగు జరిగే పరిస్థితి లేదు. మిగిలినచోట్ల కూడా సాగు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆగస్టు 15 వరకూ నాట్లు పడనున్నాయి.
    •  పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ)లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గోదావరిలో వరద పోటు ఉన్నా పీబీసీ శివారుకు సాగునీరందడం లేదు. 41,700 ఆయకట్టు ఉండగా, ఇప్పటివరకూ 100 ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. కేవలం 25 వేల ఎకరాలకు సరిపడిన ఆకుమడి మాత్రమే వేశారు.
     
    ఏలేరు ప్రాజెక్టు
    ప్రాజెక్టు సామర్థ్యం : 24 టీఎంసీలు
    ప్రస్తుత నీటినిల్వ : 2.87 టీఎంసీలు
    •  ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుత ఇన్‌ఫ్లో 350 క్యూసెక్కులు మాత్రమే. ఇలాగైతే జలాశయం నిండేదెప్పుడని రైతులు ఆందోళన చెందుతున్నారు.
    • ప్రాజెక్టు పరిధిలో వాస్తవ ఆయకట్టు 53 వేల ఎకరాలు కాగా, సుమారు 67 వేల ఎకరాలు సాగవుతోందని అధికారుల అంచనా. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు ఈ ఆయకట్టుపై ఆధారపడుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో కూడా సాగునీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
     
    భూపతిపాలెం
    ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం : 204 మీటర్లు
    ప్రస్తుత నీటిమట్టం : 201.5 మీటర్లు
    ఈ ప్రాజెక్టు పరిధిలో వాస్తవ ఆయకట్టు 16 వేల ఎకరాలు. కానీ 11 వేల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఆయకట్టుకు విడుదల చేయడం లేదు. 10 శాతం నారుమడులు పడగా, నాట్లు ఒక్క శాతం కూడా పడలేదు.
     
    తాండవ
    ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం : 380 అడుగులు
    ప్రస్తుత నీటిమట్టం : 355 అడుగులు
    ఆయకట్టు : తూర్పు, విశాఖ జిల్లాల్లో కలిపి 51,234 ఎకరాలు
    జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టులో మాత్రమే ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా ఉంది. 90 శాతం నాట్లు పూర్తయ్యాయి.
     
    పంపా
    గరిష్ట నీటిమట్టం : 106 అడుగులు
    ప్రస్తుత నీటిమట్టం : 88 అడుగులు
    గత ఏడాది ఇదే సమయానికి : 92 అడుగులు
    ఆయకట్టు : 12,500 ఎకరాలు
    పంపా దిగువన ఇప్పటివరకూ 200 ఎకరాల్లో నారుమడులు వేశారు. అది కూడా బోర్లు ఉన్న రైతులు మాత్రమే వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆకుమడులు ఎండిపోయాయి కూడా. ఆగస్ట్‌లో పుష్కర ఎత్తిపోతల నుంచి పంపాకు నీరు వస్తే తప్ప ఖరీఫ్‌ సాగయ్యే పరిస్థితి లేదు.
     
    పుష్కర ఎత్తిపోతలు
    సామర్థ్యం : 1,400 క్యూసెక్కులు
    ప్రస్తుత తోడకం : లేదు.
    ఈ పథకంపై 1.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. రాజానగరం, జగ్గంపేట, ఏలేశ్వరం, తుని నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం ద్వారా సాగు జరగాల్సి ఉంది. పంపా ఆయకట్టుకు కూడా దీనినుంచే సాగునీరు అందాలి. గోదావరికి వరదలు వచ్చి వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథా పోతున్నా ఆయకట్టుకు మాత్రం నీరు విడుదల చేయడం లేదు. రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చి మోటార్‌ స్విచ్‌ వేయాలని చెబుతూ అధికారులు ఇప్పటివరకూ సాగునీరు సరఫరా చేయకపోవడం విడ్డూరం.
     
    పంటలవారీగా సాగు వివరాలు (ఎకరాల్లో)
    పంట లక్ష్యం ఎంత సాగు శాతం
    వరి 5.69 లక్షలు 1.76 లక్షలు 31
    చిరుధాన్యాలు 3,675 466 13
    అపరాలు 9,781 3,276 33
    నూనెగింజలు 793.6 1,683 200
    పత్తి 53,701 16,978 32
    చెరకు 31,959 6,133 19
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement