క‘న్నీటి’ వ్యథ
-
డెల్టా శివార్లలో అన్నదాతల అగచాట్లు
-
ముందస్తు సమాచారం లేకుండా వంతులవారీ విధానం
-
మోటార్లతో తంటాలు పడుతున్న రైతులు
తామే అపర భగీరథులమని.. వేల, లక్షల కోట్ల రూపాయలు తెచ్చి.. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా.. ఒక్క ఎకరం కూడా ఎండకుండా నీరిచ్చేస్తామని పాలకులు చెబుతున్నారు. కానీ, చుక్కనీరందే దారి లేక.. కళ్లముందే పంటలు ఎండిపోతూంటే చూడలేక.. శివారు రైతు కంట కన్నీరు ఒలుకుతోంది. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు వంతులవారీ విధానం అమలు చేయడంతో గోదావరి డెల్టా రైతులు.. అదునుకు పదును అందక వాడిపోతున్న వరిపైరును చూసి ఏలేరు రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
అమలాపురం :
గోదావరి డెల్టాలో రబీ శివారు ఆయకట్టుకు నీటి ఎద్దడి ఏర్పడుతోంది. సెంట్రల్ డెల్టాలో ఇప్పటికే సాగునీరందక అక్కడి రైతులు నానాపాట్లూ పడుతున్నారు. నాట్లు పడుతున్న సమయంలో ముందస్తు సమాచారం లేకుండా ఇరిగేష¯ŒS అధికారులు వంతులవారీ విధానం అమలులోకి తేవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీనికితోడు గోదావరిలో సహజ జలాల రాక పడిపోవడంతో ఆయకట్టు శివారు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.
గోదావరి డెల్టాలో ఈ ఏడాది 4.80 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోందని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే వాస్తవ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందుకు 80 టీఎంసీల వరకూ సాగునీరు అవసరం కాగా, గత ఏడాది 65 టీఎంసీలతోనే రబీ పండించారు. అయితే సుమారు 50 వేల ఎకరాల్లో దిగుబడి దెబ్బతింది. ఈ ఏడాది గోదావరి ఇ¯ŒSఫ్లో ఆశాజనకంగా ఉండడంతో నీటి ఎద్దడి ఉండదని అధికారులు భావించారు. కానీ వారం పది రోజులుగా నదిలో ఇ¯ŒSఫ్లో అనూహ్యంగా పడిపోయింది.
పడిపోతున్న సహజ జలాలు
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఇ¯ŒSఫ్లో 7,460 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కాలువలకు వదిలేస్తున్నారు. తూర్పు డెల్టాకు 2,200, మధ్య డెల్టాకు 1,430, పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు. ఇ¯ŒSఫ్లోలో సీలేరు నుంచి వచ్చేది 4,199.79 క్యూసెక్కులు కాగా, 3,260.21 క్యూసెక్కులు మాత్రమే సహజ జలాలు. నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15 నాటికి సహజ జలాల రాక 1,500 క్యూసెక్కులకు పడిపోతుంది. పైగా బ్యారేజ్ వద్ద 13.64 మీటర్లవద్ద ఉండాల్సిన పాండ్ లెవెల్ 13.35 మీటర్లకు పడిపోయింది. ఇటు ఇ¯ŒSఫ్లో, అటు పాండ్‌లెవెల్ తగ్గడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
శివారుకు అందని నీరు
ఇ¯ŒSఫ్లో తగ్గడంతో మూడు రోజుల నుంచి డెల్టాలో వంతులవారీగా సాగునీరందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయకట్టు రైతులకు చెప్పడంలో ఇరిగేష¯ŒS, వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించారు. మధ్య డెల్టాలో ఇంకా 20 శాతం, తూర్పు డెల్టాలో 10 శాతం నాట్లు పడాల్సి ఉంది. చాలాచోట్ల సంక్రాంతి తరువాతే ఎక్కువగా నాట్లు పడ్డాయి. ఈ చేలకు నీరు చాలా అవసరం. నాట్లు వేసిన తరువాత చేలల్లో ఐదు సెంటీమీటర్ల చొప్పున నీరు పెడతారు. వంతులవారీ విధానం గురించి ముందుగా చెప్పి ఉంటే రైతులు కొంతవరకూ చేలల్లో నీరు నిల్వ పెట్టుకునేవారు. పైగా పంటబోదెలు అధ్వానంగా ఉండడంతో నీరు శివారుకు చేరడం లేదు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు; అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు, గంగలకుర్రు; అమలాపురం మండలం బండారులంక, భట్లపాలెం; ఉప్పలగుప్తం మండలం రాఘవులుపేట, ఎస్.యానాం, కూనవరంతోపాటు మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి; తూర్పు డెల్టాలో తాళ్లరేవు, కరప, కాజులూరు, కె.గంగవరం మండలాల్లోని శివారు భూముల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో చాలామంది రైతులు మోటార్లతో డ్రైన్ల నుంచి, భూగర్భం నుంచి నీరు తోడుకుంటున్నారు.