-
క్లోజర్ పనుల దారి పనులదే
-
అసత్యాలు రాస్తున్నారంటూ మండిపాటు
-
‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ సాక్షి కథనంపై
-
చినరాజప్ప చిందులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో పంట కాలువలకు ఒకటో తేదీనే సాగునీరు ఇచ్చేశాం.. ఖరీఫ్ సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడక్కడా కాలువ పనులు జరుగుతున్నా సాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. అయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవాలు రాస్తున్నాయని కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. చినరాజప్పకు కోపం రావడానికి ‘సాక్షి’లో శనివారం ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనమే కారణమైంది. కాలువలకు నీరు విడుదలచేసి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు సాగునీరందని ఆయకట్టు పరిస్థితులపై ఫొటోలతో సహా ‘సాక్షి’లో ప్రచరితమవడంతో చినరాజప్పకు చిర్రెత్తుకు వచ్చింది.
జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో పార్టీ జిల్లా కార్యాలయం కోసం అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న జెడ్పీ స్థలాన్ని మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరిశీలించారు. అనంతరం చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతుండగా సాగునీరు సరఫరా సక్రమంగా జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాత్రికేయులు పలు ప్రశ్నలు సంధించారు. అంతే హోంమంత్రి చినరాజప్పకు ఒక్కసారిగా కోపం కట్టలుతెంచుకుని మీరేమి మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈ నెల ఒకటోతేదీ నాడే సాగునీరు విడుదల చేశాం ... అయినా ఇంకా సాగునీరందడం లేదని ఓ పత్రికలో (సాక్షి పేరు ఎత్తకుండా)ల్లో చూశానని, అవి అసత్యాలు రాస్తున్నాయని మండిపడ్డారు. క్లోజర్ పనులు జరుగుతుంటే పంట పొలాలకు సాగునీరు ఎలా సరఫరా అవుతుందనే ప్రశ్నకు పనులు దారి పనులవే, సాగునీరు దారి సాగునీరిదేనని చెప్పుకు వస్తూ అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ విలేకర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పంట పొలాలకు నీరు ఇచ్చేసినా ఇవ్వలేదని ఎలా రాస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. క్లోజర్ పనులు జరుగుతున్నా సాగునీరు పూర్తిగా సరఫరా అవుతోందని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై వివాదాలు లేకుండా అమలాపురం పరిసర ప్రాంతాల్లో కమిటీలు కూడా వేశామని చినరాజప్ప చెప్పారు.