ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి! | Red Sandalwood Farmers To Benefit From CITES Decision | Sakshi
Sakshi News home page

ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!

Published Tue, Nov 28 2023 9:28 AM | Last Updated on Tue, Nov 28 2023 10:01 AM

Red Sandalwood Farmers To Benefit From CITES Decision - Sakshi

ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం.  

అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట.

ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి.

2004 నుంచి ఎగుమతిపై పరిమితులు
జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ చట్టబద్ధ సంస్థ కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పెసీస్‌ (సిఐటిఇఎస్‌ – ‘సైట్స్‌’)లో 1976 నుంచి భారత్‌ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఎర్రచందనం దుంగల ఎగుమతిపై 2004లో ‘సైట్స్‌’ పూర్తిగా నిషేధించలేదు గానీ, పటిష్టమైన సంరక్షణ చర్యల్లో భాగంగా పరిమితిని విధించింది. ఏటేటా ఈ జాతి చెట్ల స్థితిగతులను పరిశీలించి ఎగుమతి పరిమాణాన్ని సైట్స్‌ స్థాయీ సంఘం నిర్దేశిస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ చెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు అటవీ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్‌లో కూడా కొందరు రైతులు బంజరు భూముల్లో ఎర్రచందనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అటవీ భూముల్లోని ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంతో పాటు రైతుల భూముల్లోనూ సాగు చేస్తుండటంతో ఈ జాతి అంతరించే ముప్పు నుంచి బయటపడింది. 

19 ఏళ్ల తర్వాత..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా తాజా పరిస్థితిని నవంబర్‌ 6–10 తేదీల్లో జెనీవాలో జరిగిన ‘సైట్స్‌’ 77వ స్థాయీ సంఘం సమావేశం సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశం నుంచి సైట్స్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ–ఇండియా తరఫున అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎస్‌.పి. యాదవ్‌ సారథ్యంలోని ఉన్నతాధికార బృందం ఈ సమావేశంలో పాల్గొని పరిస్థితిని వివరించింది. దీంతో, భారత్‌ నుంచి ఎర్రచందనం ఎగుమతులపై 19 ఏళ్లుగా అమల్లో ఉన్న పరిమితిని తొలగిస్తూ ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో,  జెనీవాలోని సైట్స్‌ స్థాయీ సంఘానికి బదులు.. ఇక మీదట ఎర్రచందనం ఎగుమతుల వ్యవహారాలపై న్యూఢిల్లీలోని సైట్స్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ–ఇండియా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది.  

రైతులకు గొప్ప ప్రోత్సాహం
ఎర్రచందనం ఎగుమతిపై పరిమితిని రద్దు చేస్తూ సైట్స్‌ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధికారికంగా ప్రకటించారు. మన దేశం గత 19 ఏళ్లుగా సైట్స్‌ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించటమే కాకుండా ఎర్రచందనం వృక్ష జాతి పరిరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినందున సైట్స్‌ సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ‘ఈ పరిణామం ఎర్రచందనం తోటలు సాగు చేసే రైతులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంద’ని ఆయన అన్నారు. 

ఎర్రచందనం సాగు పద్ధతులు
ఎగుమతిపై పరిమితి తొలగిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌ దూలపల్లిలోని అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్‌బి) ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది కరదీపికను వెలువరించింది. ఆ వివరాలు...ఎర్రచందనం ప్రకృతిసిద్ధంగా తక్కువ నీటి వనరులున్న కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతగా సారవంతం కాని గ్నీస్, క్వార్ట్‌జైట్, లాటరైట్‌ లోమ్‌ నేలలు బాగా అనుకూలం. సారవంతమైన నేలలు, నీటి సదుపాయం ఉన్న నేలలు ఎర్రచందనం సాగుకు అనువైనవి కావు. ఈ నేలల్లో సాగు చేస్తే చెట్లు బాగా ఎత్తుగా, లావుగా పెరుగుతాయి. అయితే, కాండం లోపల చేవదేలడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. చేవను బట్టే ఎర్రచందనం నాణ్యత, ధర ఆధారపడి ఉంటాయి.

పాక్షిక శుష్క ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవులు పెరిగే ప్రాంతం దీనికి అనుకూలం. 700 నుంచి 1200 ఎం.ఎం. మేరకు వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కనీసం 700 ఎం.ఎం. వర్షం అవసరం. ఏడాదిలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉండే ప్రాంతాలు ఎర్రచందనం సాగుకు అనుకూలం. అధిక వర్షపాత ప్రాంతాలు అనుకూలం కాదు. పొడి వాతావరణంతో పాటు 26–28 డిగ్రీల సెల్షియస్‌ (గరిష్టంగా 48 డిగ్రీల సెల్షియస్‌) ఉష్ణోగ్రతలు ఉండాలి. నర్సరీ బెడ్లపై పెంచిన 1–2 ఏళ్ల నారు మొక్కల్ని నాటుకోవాలి. ఎర్రచందనం గింజలు చాలా తక్కువ శాతం మొలకెత్తుతాయి.

అందువల్ల వీటికి బదులు కొందరు ప్రైవేటు నర్సరీ వాళ్లు రైతులకు ఏగిశ మొక్కల్ని ఎర్రచందనం మొక్కలని నమ్మబలికి అంటగడుతూ ఉంటారని, రైతులు అప్రమత్తతంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏగిశ మొక్కలు కొన్ని సంవత్సరాల వరకు ఎర్రచందనం మాదిరిగానే కనిపిస్తాయట. కాండం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే రైతులు జాగ్రత్తవహించాలి. అటవీ శాఖ ద్వారా మొక్కల్ని కొనుగోలు చేయటం ఉత్తమం అని ఐఎఫ్‌బి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

30 ఏళ్లలో చెట్టుకు 59 కిలోల చేవ
అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్‌బి) సమాచారం ప్రకారం.. ఎర్రచందనం మొక్కల్ని 3“3 మీటర్ల దూరంలో (హెక్టారుకు 1,111 మొక్కలు) నాటుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు కోతకు రావటానికి 30 ఏళ్లు పడుతుందని ఐఎఫ్‌బి నిపుణులు తెలిపారు. నాటిన 20 ఏళ్లకు కాండం లోపలి భాగం (హార్డ్‌ వుడ్‌) చేవదేలటం ప్రారంభమవుతుంది. కాండంపై బెరడు కింద తెల్ల చెక్క ఉంటుంది. దాని లోపల ఎర్రగా చేవదేలి ఉంటుంది. ఆ ఎర్రని చేవ గల కర్రే విలువైనది.

30 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి 59 కిలోల చేవగల ఎర్రచందనం దుంగ వెలువడుతుంది. పోయిన చెట్లు పోగా 30 ఏళ్లకు హెక్టారుకు కనీసం 275 చెట్లు మిగులుతాయి. ఈ లెక్కన హెక్టారుకు 16.2 మెట్రిక్‌ టన్నుల బరువైన ఎర్రచందనం లభిస్తుంది. 40 ఏళ్లకు 38 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావచ్చని ఐఎఫ్‌బి అంచనా. 2017లో ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ వేలంలో మెట్రిక్‌ టన్ను ఎర్రచందనం దుంగలు రూ. 27.8 లక్షలకు అమ్ముడయ్యాయి. 

రాళ్ల భూముల్లో పెరుగుతుంది!
ఎర్రచందనం ఎగుమతిపై పరిమితులు రద్దవటం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా ఎగుమతిదారులను సంప్రదించడానికి వీలవుతుంది. ఎర్రచందనం తోటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది.  ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇతరత్రా పంటలు సాగుకు అనువుకాని రాళ్లు రప్పలతో కూడిన  మెట్ట భూములు, గుట్టల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఒక సంవత్సరం మొక్కల్ని నీరు పోసి రక్షిస్తే చాలు. తర్వాత వాటికవే పెరుగుతాయి.

ఎరువులు అవసరం లేదు. 30 ఏళ్లలో కోతకు వస్తాయి. ఐఎఫ్‌బిలో ఎర్రచందనం మీద చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. వన విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రైతులు, అటవీ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎర్రచందనం పెంపకం మాన్యువల్, ఎర్రచందనం–ఏగిశ (బిజసాల్‌) మధ్య వ్యత్యాసాలు, ఎర్రచందనాన్ని ఆశించే చీడపీడలు, నియంత్రణ చర్యలపై కరపత్రాలను విడుదల చేశాం. 
– వెంకట్‌రెడ్డి, సంచాలకులు, అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్‌బి), దూలపల్లి, హైదరాబాద్‌
director_ifb@icfre.org

ఎర్రచందనం రైతులకు ప్రయోజనకరం
అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాతుల పరిరక్షణ చర్యలను జెనీవాలోని ‘సైట్స్‌’ అనే అంతర్జాతీయ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను ఈ సంస్థ నిర్ణయించే పరిమితి మేరకే ఏటా ఎగుమతి జరుగుతోంది. దీంతో ఆ కోటా కన్నా ఎక్కువ ఎర్రచందనం మన రైతుల దగ్గర ఉన్నా ఎగుమతి చేసే వీలుండేది కాదు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల కృషి మేరకు ఎగుమతిపై ఉన్న పరిమాణాత్మక పరిమితిని ‘సైట్స్‌’ ఇటీవల రద్దు చేసింది.

దీంతో ఎర్రచందనం ఎగుమతుల నియంత్రణ అంశం మన దేశంలోని ‘సైట్స్‌’ ఇండియా అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఎర్రచందనం ఎగుమతిదారులు ఇక మీదట సైట్స్‌ ఇండియా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు ఇది ప్రోత్సాహకర పరిణామం. సాగు చేసిన ఎర్రచందనం దుంగలను అప్పటికప్పుడు అమ్మెయ్యాల్సిన అవసరం లేదు. నిల్వ చేసి అయినా మంచి ధరకు రైతులు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఎర్రచందనం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 
– వై. మధుసూదన్‌ రెడ్డి, అటవీ దళాల అధిపతి (పిసిసిఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  

పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

(చదవండి: పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement