పిట్టలవానిపాలెం: రబీ రైతులకు నీటికష్టాలు మొదలయ్యాయి. రెండవ పంటగా సాగు చేసిన మినుము,పెసర పైర్లకు నీటి తడు లు ఇచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని కోమలి, భవనంవారిపాలెం, సంగుపాలెం, కోడూరు గ్రామాల పరిధిలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో సాగు చేసిన మినుము,పెసర పైర్లను ప్రస్తుతం నీటి ఎద్దడి పట్టిపీడిస్తోంది. కోమలి చానల్ ద్వారా సాగు నీరు రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిపెట్టారు.
అందుబాటులో ఉన్న కుంటలు, బీడు కాలువలు, చెరువుల నుంచి నీటిని ట్యూబుల ద్వారా పొలాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అదనపు ఖర్చు అవుతున్నట్టు వాపోతున్నారు. 1200 నుంచి 1500 అడుగుల పొడవు ఉండే ట్యూబులు ఏర్పాటు చేసుకొని ఆయిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. దీనికోసం పైపులు,ఇంజన్ అద్దె, డీజిల్ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 10 రోజుల పాటు కోమలి చానల్ నుంచి సాగు నీటిని అందిస్తే అదనపు భారం తగ్గుతుందని అంటున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకొని ఆయిల్ ఇంజన్లు, ట్యూబు అద్దెలు పెంచేశారు. రైతులు ఖర్చుకు వెనుకాడకుండా పైరు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎకరాకు అదనపు ఖర్చులు ...
ఒక్క నీటి తడికి ఇంజన్ అద్దె రూ.800, ట్యూబు 100 అడుగులు అద్దె రూ.50, డీజిల్ 5 నుంచి 10 లీటర్ల వరకు ఖర్చవుతోంది. రాత్రి సమయంలో నీటిని అందించేందుకు రైతుతో పాటు మరొకరి సహాయం అవసరమవు తోంది.
రబీ కష్టం..!
Published Thu, Feb 5 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement