మా నీళ్లు మాకే కావాలి | Water Problems | Sakshi
Sakshi News home page

మా నీళ్లు మాకే కావాలి

Published Thu, Apr 16 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

గురిజాల రవీందర్‌రావు

గురిజాల రవీందర్‌రావు

 సందర్భం
 
 ప్రాణహితను కాళేశ్వరంలో నిర్మించినా... ఎస్.పీ.ఎం(సిర్పూర్ కాగజ్‌నగర్)ను మూసేసినా... ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో గ్రామాలను మాయం చేసినా... అవి పుట్టిన పేర్లే అస్తిత్వం కోల్పోతాయి. ఇది నవ తెలంగాణలో జరగడానికి వీల్లేదు. ఇందుకేనా తెలంగాణను తెచ్చుకున్నది?
 
 తెలంగాణలో పలు జిల్లాలకు ఎన్నో వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు. శతాబ్దాలుగా.. వెనుకబడిన ఆదివాసీలకు నిల యమైన మా జిల్లాకు కొత్తవి రావాల్సినవి రాకపోగా, ఉన్న వే పోతాయంటూ పిడుగులాం టి వార్తను ప్రజలనెత్తి మీద వేస్తున్నారు. దశాబ్దాల తరువాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో పనులు చేపట్టి న తర్వాత ఈ జిల్లాలో ఇప్పటికే రూ.5వేల కోట్లను ఖర్చు చేశారు, కొద్ది రోజుల లోపలే జాతీయ హోదా వస్తుందని ఎంపీ కవిత ప్రకటన చేసిన విషయం తెలిసిం దే. కానీ మా జిల్లాలోని ప్రాణహిత నీళ్లను మాకు ఇవ్వ కుండా చేవెళ్ల వరకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించడం ఆదిలాబాద్ ప్రజలకు పిడుగులాంటి వార్తే అవుతుంది.
 తెలంగాణలో అధికారపార్టీకి ఏ జిల్లాలోనూ లేనంత ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీలను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చింది. ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని రెండుసార్లు  ఎమ్మెల్యేగా గెలిపించారు. జిల్లాలోని చెన్నూర్, సిర్పూర్, పెద్దపల్లి నియోజకవర్గాల ప్రజలు స్థానికేతరులను దాదాపు 7 నుండి 8 సార్లు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. కానీ నైజాం దగ్గర నుండి నిన్నటి దాకా పాలకులుగా ఉన్నవారు వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు.

 ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీరం అని వర్ణించిన కేసీఆర్, లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత నది ద్వారా వచ్చేటటువంటి ఈ నీళ్లను ఇతర జిల్లాలకు పందేరం పెట్టి, ఆదిలాబాద్ పొట్ట కొట్టడానికి పథకాలు సిద్ధం చేయడం న్యాయమా? ఇతర జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ఆ తర్వాతే ఈ జిల్లాకు దక్కా ల్సినవి ఇస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వారు సెలవివ్వాలి.

 గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌కు 5 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌కు 3 లక్షల ఎకరాలు, రంగా రెడ్డికి 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌కు లక్షా 71 వేల ఎక రాలు, నల్గగొండకు 2లక్షల 29 వేల ఎకరాలకు నీటి కేటాయింపు చేస్తూ ఆదిలాబాద్‌కు మాత్రం లక్షా 56 వేల ఎకరాలకు మాత్రమే నీటి కేటాయింపులు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించిన మేరకు, ఈ జిల్లాలోని లక్షా 50 వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నీరు దక్కకుండా పోయే ప్రమాదం పొంచుకుని ఉంది. ఏ న్యాయం ప్రకారం చూసినా సరే.. ఏ జిల్లాలో ఉన్న టువంటి నీళ్లు ముందు ఈ జిల్లాకే రావాలి. రాజ్యాంగం ప్రకారమైనా, సహజ న్యాయసూత్రాల ప్రకారమైనా ఇదే సరైనది. ఈ విషయమై గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం ఇక జరగదని ఆశిస్తున్న తరుణంలో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాకు తీరని నష్టం జరుగుతూ ఉన్నది.

 ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు పరిశ్రమల మూసివేత, మరోవైపు మా జిల్లా చుట్టూ మూడువైపులా నీళ్లు, ఒక వైపు గోదావరి మరోవైపు ప్రాణహిత, మరో వైపు ఆదిలాబాద్ నుండి వస్తున్న పెన్‌గంగా, వాగులకు, వంకలకు కొదువే లేదు. కట్టక కట్టక కట్టిన చిన్న చిన్న ప్రాజెక్టులు, ఆఖరుకు ‘కొమురం భీం’ పేరుతో కట్టిన ప్రాజెకులోకూడా నిండుగా నీళ్లు ఉన్నాయి. కానీ కాలు వలు పూర్తి కాక అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. అన్ని విధాలా అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మీ ద్వారానైనా అభివృద్ధి చెందుతుందని ఆశించినాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో కాసిన్ని నీళ్లు లభిస్తాయనుకుంటే అవి కూడా దక్కకుండా ఆ ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గర నిర్మిస్తామంటున్నారు. ఇది ఇతర జిల్లాలకు న్యాయం, మా జిల్లాకు అన్యాయం కాక మరేమవుతుందని మేము భావించాలో చెప్పండి.

 ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలకు న్యాయం చేయాలి కానీ, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయ వద్దని కోరుతున్నాం. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికేతరులే పదవుల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులు అయిన మిమ్మల్ని మేము ప్రశ్నించేది ఒక్కటే. మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారా, లేక ఈ ప్రాంత ప్రజల ను ప్రాణహిత నదిలో, ఎస్‌పీఎంలో, ఓపెన్‌కాస్ట్‌ల బొం దలగడ్డలో సమాధి చేస్తారా? కాబట్టి తెలంగాణ ముఖ్య మంత్రి తక్షణమే కల్పించుకొని జాతీయహోదాకు సమీ పంగా వచ్చిన ప్రాణహిత వద్ద వీలైన పద్ధతుల్లో ప్రాజె క్టును నిర్మించి 1,56,000 ఎకరాలకు గానూ మాకు హామీ ఇచ్చిన, మాకు హక్కు ఉన్న నీళ్లను మాకు ఇచ్చి ఎక్కడికైనా నీళ్లను తీసుకెళ్లండి. అంతేకాని మిమ్ములను నమ్ముకున్నటువంటి ఈ ప్రజలకు అన్యాయం చెయ్య వద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం.

 పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే వెనుకబడిన ఈ జిల్లాను మరింత వెనకకు నెట్టవద్దని, అదిలాబాద్ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యవద్దని మిమ్మల్ని మరీమరీ కోరుతూ ఉన్నాం. ప్రాణహితపై మరోసారి పునరాలోచన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.

 - వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ : 9849588825

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement