gurijala Ravinder Rao
-
ప్రజాకేంద్రక రాజకీయాలకు పట్టం కడదాం..!
పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం. పోరాటానికి అనన్యమైన త్యాగాలకు తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ మన తెలంగాణ. అందుకే మన మూలాలను పాలకులు మర్చిపోతున్న నేపథ్యంలో కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరముంది. వ్యక్తులు, కుటుంబాలు కాకుండా ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్ నిర్వహించాలి. చాలా మంది తెలంగాణలో ఇన్ని పార్టీలు వుండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని అడుగుతున్నారు. నిజానికి దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు వందల సంఖ్యలో వున్నాయి. ఇన్ని పార్టీలు ఉండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని ప్రజలు అడుగుతున్న ప్రశ్న సహేతుకమైనదే. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్‌డబ్బా పెట్టడం కాదని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నట్లు నిజమే కాని, రాజకీయ పార్టీ అంటే అమ్మడం, కొనడం, దోచుకోవడం, కమీషన్లు దండుకోవడం కూడా కాదు.కాని 71 ఏళ్ళ భారత స్వాతంత్య్ర చరిత్రలో రాజకీయ పార్టీలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మాట నిజం. ప్రజాధనాన్ని దోచుకోవడమే రాజకీయాల పరమావధిగా మారిపోయింది. కార్ల్ మార్క్స్, పూలే, అంబేడ్కర్ భావించినట్లు ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామిక విలువలను, చైతన్యాన్ని ప్రజలలో పాదుకొల్పడంలో పార్లమెంటరీ రాజకీయాలు విఫలమైనాయి, ప్రజలలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది. పార్లమెంటరీ రాజకీయ పార్టీల విధానాలు ఏ రంగంలోని ప్రజానీకాన్ని కూడా సంతృప్తి పరచకపోగా దేశం మొత్తాన్ని కార్పొరేటీకరణ వైపుగా పరుగులు తీయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై అసంతృప్తి బయట పడటానికి 20 ఏళ్ళ కాలం పట్టింది. బిజేపీపై అసంతృప్తి బయట పడటానికి పదేళ్ళ కాలం కూడా పట్టలేదు. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కానీ, 20 ఏండ్లు పాలించిన తెలుగుదేశం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోవడంవల్లనే 1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం మళ్లీ ముందుకొచ్చింది. చివరకు 1600 మంది బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 2014లో సాకారమైంది.అభివృద్ధి నినాదం నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక ఆకాంక్షల అమలు కోసం సాగిందే ప్రత్యేక తెలంగాణ పోరాటం. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన నేటి పాలకులు తెలంగాణ అస్థిత్వ కోణంలోంచి పాలనా విధానాలను రూపొందించకుండా గత పాలకుల విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు పర్చుతున్నారు. సమస్యలపై పోరాడుతున్న అన్ని ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతూ సెక్షన్ 30, సెక్షన్ 156, సెక్షన్ 144 అమలు చేస్తూ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టిస్తూన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడమే కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులైన ప్రొ‘‘ కోదండరాం ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అక్రమ అరెస్టు చేయడమే కాకుండా ఎన్కౌంటర్లను కొనసాగిస్తూ రాచరికపు పాలన సాగిస్తున్నారు.రాజకీయాలంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటిలో సామూహిక అభివృద్ధిని సాధించడమే తప్ప వ్యక్తుల ఎదుగుదల కాదు. తెలంగాణ సంపదను తెలం గాణ సమగ్రాభివృద్ధికి వినియోగించే ప్రణాళికలు రూపొందించకుండా ఉద్యమ ఆకాంక్షలను పక్కకు నెట్టి కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేసే విధానాలను రూపొందిం చారు. తెలంగాణలోని సహజ సంపద బొగ్గు, నీళ్ళు, ఇసుక ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం దోచి పెడుతూ కమీషన్లను దండుకొంటున్నది. ఈ నాలుగేళ్లు బడ్జెట్ రూపంలో లక్షల కోట్ల రూపాయలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) పేరుతో వెచ్చిస్తూ మౌలిక రంగాలను నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నది. సాధించిన తెలంగాణ అడవికాచిన వెన్నెల కాకూడదంటే ప్రొ‘‘ జయశంకర్ చెప్పినట్లు తెలంగాణలో మళ్ళీ నిరంతరాయంగా భావవ్యాప్తి, ఉద్యమం, రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రజా రాజకీయాలు పటిష్టపరచాలి. ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్ నిర్వహిం చాలి. జవాబుదారీతనం, ప్రజల సంక్షేమం, సమష్టి వనరులు సమష్టి ప్రయోజనాలకే అన్న ఆలోచనతో కార్యాచరణ సాగాలి. వ్యక్తుల సమష్టి ప్రయోజనాలు ఆశిస్తూ మనిషి కేంద్రంగా కులాల అంతరాలను తొలగిస్తూ, అన్ని రంగాలలో వెనుకబాటుకు గురిచేసిన పాలనకు భిన్నంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీలదే. రాజకీయ పార్టీలు కుళ్ళి కంపుకొడుతూ భరింపరానివిగా తయారయ్యాయని ప్రజలు ముఖ్యంగా మేధావులు భావిస్తున్నారు. కానీ రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే అవి మనల్ని ఈరకంగా అణగదొక్కి 70 ఏండ్లుగా శాసిస్తున్నాయి. ప్రజలు మేధావులు రాజకీయాలను పట్టించుకోకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న రాజకీయాలే మనల్ని చుట్టుముడతాయి. పైగా మన జీవితాలు మనకు కాకుండా విద్య, వైద్యంతోసహా అన్ని రకాల అభివృద్ధి రంగాలను మనకు ఇష్టంలేకపోయినా కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ జన సమితి ప్రకటించుకుంటున్న లక్ష్యాలు సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణతో పాటు సమస్త సంపదలు ప్రజలందరికి చేరే విధంగా టీజేఎస్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ముఖ్యంగా మేధావులు, విద్యార్థి యువజనులతో పాటు అన్ని ప్రజా సంఘాలపై వున్నది. ఈ బాధ్యతను గుర్తించే గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి ఇతర ప్రజా సంఘాలతో కలిసి టీజేఎస్ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించింది.తెలంగాణ సమాజం సమ్మక్క, సారక్క, కొమురంభీం, రాంజీగోండు, తుర్రే బాజ్‌ఖాన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మగ్దుం మోహియుద్దీన్‌లతో పాటు పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం. పోరాటానికీ, త్యాగాలకూ తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ ఈ తెలంగాణ. అందుకే ఆయా సమాజాలలోని ప్రజల చైతన్యాన్ని బట్టి పాలకుల పాలన వుంటుందని రాజకీయ తత్వవేత్త బ్లంట్స్లీ చెప్పిన మాటలను ఈ తెలంగాణ గడ్డ తిరగరాస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకున్నదని రుజువు చేయాల్సిన సమయమిది. ఎంతదూరపు ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న సత్యాన్ని సమస్త ప్రజానీకం గుర్తించవలసి వుంది. అందరం కలిసి ఆశావహ దృక్పథంతో కలిసి ముందుకు సాగుతాం.(నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ) గురిజాల రవీందర్ వ్యాసకర్త తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షులు మొబైల్ : 98495 88825 -
తెలంగాణ నిరంతర స్ఫూర్తి
సందర్భం ఆగస్టు 6న ప్రొఫెసర్ జయ శంకర్ జయంతిని జరుపు కోవడం తెలంగాణ చారిత్రక కర్తవ్యం. గాంధీ, అంబేడ్కర్ జయంతులకు కేంద్రం సెల వులు ప్రకటించి ఉత్సవాలను నిర్వహిస్తుంది. తెలంగాణ సమాజానికీ తెలంగాణ ఆవి ర్భావానికీ అంతే స్ఫూర్తిని కలిగించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆకాంక్షిస్తున్నాయి. సంపూర్ణంగా కాకపోయినా దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష ఆకృతి దాల్చి రెండేళ్లు దాటింది. ప్రభుత్వం తన విజయాలను చెప్పుకుంటున్నది. అనేక ప్రజా సంఘాలు, పౌర వేదికలు దశాబ్దాల పోరాటాల ప్రస్థానాన్ని, త్యాగాలను, నిర్వేదంలో కూరుకుపోయిన క్షణాలను త్రవ్విపోసుకుంటున్నాయి. సాధించుకున్న తెలంగాణను సారంలో ప్రజాపక్షం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నదనే అంశాన్ని గుర్తుచేసుకోవడమే జయశంకర్ జయంతిని నిర్వహించుకోవడం వెనుక ఉన్న అసలు ఆశయం.తెలంగాణ ప్రజలందరి సంఘటిత పోరాట ఫలితం. ఆ ప్రజా ఉద్యమానికి తాత్విక పునాదిని, సైద్ధాంతిక భూమికను అందించిన వారిలో అగ్రస్థానం జయశంకర్ సార్‌దే. జీవితకాలం తెలంగాణను స్వప్నించిన వారాయన. సీమాంధ్ర పాలనలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యో గాలను దోచుకున్న కుట్రలను బహిర్గతపరిచి స్వరా ష్ట్రంలో నిరుద్యోగులైన యువజనులకు ఉపాధి లభించే విధంగా తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో జయశంకర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన స్వప్నం సాకారం కావాలని నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అర కొర ఉద్యోగాల ప్రకటనలతో సగం రోజులు గడిపేి సింది. కానీ పదివేల ఉద్యోగాలు కూడా కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి నుండి పీహెచ్.డీ. వరకు చదువుకున్న యువకులు (18 నుండి 40 సంవత్సరాలలోపు) సుమారుగా 50 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యో గాలు ఇచ్చినా ఇంకా మిగిలి ఉండే 49 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది. జయశంకర్ సార్ చెప్పినట్లు అభివృద్ధి అంటే వనరులు (బొగ్గు, ఖనిజాలు, నీళ్లు, భూమి వంటివి), పరిశ్రమలు కొద్దిమంది కంట్రాక్టర్లు, కార్పొరేట్ల చేతిలోకి వెళ్లడం కాదు. హైదరాబాద్ అభివృద్ధే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ (జిల్లాలు) జరిగినపుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆయనను స్మరించుకోవడమంటే సమ న్యాయంతో కూడిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవడం కూడా. జయశంకర్ సార్ జయంతి వారోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలపైన, కేజీ టు పీజీ విద్యపైన సమగ్ర విధానం ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రజా ప్రయోజనాల కోణం నుంచి విశ్లేషించాలని పిలుపునిస్తున్నది. (ఆగస్టు 6 ప్రొ॥జయశంకర్ జయంతి) ( వ్యాసకర్త:గురిజాల రవీందర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక మొబైల్ః 9949994509 ) -
మా సింగరేణి ఉద్యోగాలు మాకే కావాలి..!
సింగరేణి భూమిపుత్రులమైన మాకు, హక్కు ఉన్న అన్ని ఖాళీలకు అర్హులైన మాకు తొలి ప్రాధాన్యతగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, ఇప్పటికే సింగరేణిలో మెడికల్ ఫిట్ అయి అండర్‌గ్రౌండ్ ట్రైనింగ్ కూడా చేసిన, మా 2,700 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు మీ పద్ధతిలో భర్తీ చేసుకోవాలి. అది 1997వ సంవత్సరం. ప్రపంచ బ్యాంకు విధానాలను దేశంలో అందరికన్నా ముందు ండి అమలు పరుస్తున్న సీఎం చంద్రబాబు హయాం. 1988 లో ఆఖరి పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ముగిసిపోయి సింగరేణిలో అప్పటికే దశాబ్దం గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వ లేదు. కాని ఉత్పత్తి పది రెట్లు పెరిగి 52 మిలియన్ల టార్గె ట్ను కూడా పూర్తి చేసుకుంది. 1997లో వీఆర్ఎస్ అప్లై చేసుకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని సింగరేణి మేనేజ్మెంట్, అప్పటి సీఎం చంద్రబాబు చెప్పిన మాట లు నమ్మి 5 నుండి పదేళ్ల సర్వీసు ఉన్నా కూడా సుమారు 2700 మంది కార్మికులు వీఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. కానీ 18 ఏళ్లు పూర్తయినా సింగరేణి మేనేజ్మెంట్, అప్పటి వలస ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పి నాటి ఉద్యోగుల పిల్లలకు కొలువులివ్వటం కుదరదనీ, అవకా శమన్న రోజు ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకు న్నారు. 1997లో యువకులుగా ఉన్న ఆ పిల్లలు.. నేడు 45 ఏళ్ల వయస్సుకు చేరుకొని నిరుద్యోగులు గానే ఉన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్, క్యాతన్ పల్లి సర్పంచ్ (ఆర్కెపీ కోల్‌మైన్స్ ఏరియా) ఎన్నికల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాధించుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ చదువులు చదువుకొని బాధలను అనుభవిస్తూనే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించారు ఈ నిరుద్యోగ యువకులు. 2014 జూన్ 2 తెలంగాణ కల సాకారమైన రోజు నుండి నిరుద్యోగ వీఆర్ఎస్ డిపెండెంట్లు నిరాహార దీక్షలు, పాదయాత్రలు, వినతులు, విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నారు. వీరి ఉద్యమానికి ఎంపీ సుమన్ , విప్ నల్లాల ఓదెలుతోపాటు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులతోపాటు టీబీజీకే ఎస్ నాయకులు మద్దతు పలుకుతూ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చాలా హామీలను అమలు పరుస్తున్నారు. ఉద్యమంలో పాల్గొ న్న 550 మంది ధూంధాం కళాకారులకు నిన్నగాక మొ న్న ఉద్యోగాలను ఇచ్చారు. సింగరేణిలో 5,500 మందికి ఉద్యోగాలను కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. సింగ రేణి మేనేజ్మెంట్ జారీ చేసిన అన్ని రకాల ఉద్యోగాలకు మేము సంపూర్ణంగా అర్హత కలిగి ఉన్నాము. దురదృష్ట మేమిటంటే 1997 నాటికి మా వయస్సు 25 నుండి 30 సంవత్సరాలు. ఇప్పుడు మేం 40 నుండి 45 ఏళ్లు కలిగి ఉండి మీ ఉద్యోగ ప్రకటనకు వయస్సు అర్హతలు కూడా కోల్పోయాము. 1988లో ఆఖరు రన్నింగ్ వరకు సింగరేణి ఉద్యోగా ల్లో చేరిన వారు ఏ ఒక్కరు కూడా భూమి పుత్రులు కారు. ఆనాటికి సింగరేణిలో ఉన్న ఒక లక్షా పదహారు వేల మంది కానీ, అంతకు ముందు రిటైర్డ్ అయిన వేల మంది కానీ వీరంతా తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు ఆంధ్రా ప్రాంతం నుండి వలస వచ్చి ఉద్యోగాలు చేసిన వారే. కానీ ఈ వీఆర్ఎస్ కార్మికుల పిల్లలమైన మేము 2,700 మందిమీ, ఈ సింగరేణి నేల భూమిపుత్రులం. మేమంతా సింగరేణిలో పని చేస్తున్న మా తల్లిదండ్రుల నివాస ప్రాంతాలైన గోలేటి, బెల్లంపల్లి, మందమర్రి, రామక్రిష్టాపూర్, శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపా ల్‌పల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సింగరేణి ప్రాంతానికి చెందిన పిల్లలం. 1997లో, 2003లో సింగ రేణి మేనేజ్మెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకొని కూడా ఇవ్వకుండా పోవడంతో మోసపోయిన వీఆర్ఎస్ కార్మికుల పిల్లలం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూ డు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 5,500 మంది ఉద్యోగాలకు సింగరేణి మేనేజ్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా సింగరేణి భూమిపుత్రులుగా అన్ని ఖాళీలకు అర్హత కలిగిన మాకు, మొట్టమొదటి ప్రాధాన్య తగా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఇప్పటికే సింగరేణిలో మెడికల్ ఫిట్ అయి అండర్‌గ్రౌండ్ ట్రైనింగ్ కూడా చేసిన, మా 2,700 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు మీ పద్ధతిలో భర్తీ చేసుకోవాలి. మీరు తీసుకొనే నిర్ణయం ద్వారా అన్ని రకాలుగా హక్కు లు, అర్హతలు కలిగిన మా పిల్లలకు, మా కుటుంబ సభ్యు లకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడతారనే విశ్వాసంతోనే మీ సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్ కార్మికులు, సింగరేణి భూమి పుత్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా, సహజ న్యాయసూత్రాల ప్రకారం 100 శాతం నిజమైన సింగరేణి భూమి పుత్రుల మైన మా 2,700 మందికి ముందుగా ఉద్యోగాలిచ్చి మిగతా ఖాళీలను మీ సెలెక్షన్ ద్వారా ఇచ్చుకోండి. ‘మీరు తీసుకునే నిర్ణయం ద్వారా మా జీవితాల్లో చీకటి తొలగించి వెలుగులు నింపాలని’ కోరుతున్నాము. - గురిజాల రవీందర్రావు వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక సెల్ : 9849588825 -
మా నీళ్లు మాకే కావాలి
సందర్భం ప్రాణహితను కాళేశ్వరంలో నిర్మించినా... ఎస్.పీ.ఎం(సిర్పూర్ కాగజ్‌నగర్)ను మూసేసినా... ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో గ్రామాలను మాయం చేసినా... అవి పుట్టిన పేర్లే అస్తిత్వం కోల్పోతాయి. ఇది నవ తెలంగాణలో జరగడానికి వీల్లేదు. ఇందుకేనా తెలంగాణను తెచ్చుకున్నది? తెలంగాణలో పలు జిల్లాలకు ఎన్నో వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు. శతాబ్దాలుగా.. వెనుకబడిన ఆదివాసీలకు నిల యమైన మా జిల్లాకు కొత్తవి రావాల్సినవి రాకపోగా, ఉన్న వే పోతాయంటూ పిడుగులాం టి వార్తను ప్రజలనెత్తి మీద వేస్తున్నారు. దశాబ్దాల తరువాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో పనులు చేపట్టి న తర్వాత ఈ జిల్లాలో ఇప్పటికే రూ.5వేల కోట్లను ఖర్చు చేశారు, కొద్ది రోజుల లోపలే జాతీయ హోదా వస్తుందని ఎంపీ కవిత ప్రకటన చేసిన విషయం తెలిసిం దే. కానీ మా జిల్లాలోని ప్రాణహిత నీళ్లను మాకు ఇవ్వ కుండా చేవెళ్ల వరకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించడం ఆదిలాబాద్ ప్రజలకు పిడుగులాంటి వార్తే అవుతుంది. తెలంగాణలో అధికారపార్టీకి ఏ జిల్లాలోనూ లేనంత ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీలను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చింది. ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. జిల్లాలోని చెన్నూర్, సిర్పూర్, పెద్దపల్లి నియోజకవర్గాల ప్రజలు స్థానికేతరులను దాదాపు 7 నుండి 8 సార్లు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. కానీ నైజాం దగ్గర నుండి నిన్నటి దాకా పాలకులుగా ఉన్నవారు వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీరం అని వర్ణించిన కేసీఆర్, లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత నది ద్వారా వచ్చేటటువంటి ఈ నీళ్లను ఇతర జిల్లాలకు పందేరం పెట్టి, ఆదిలాబాద్ పొట్ట కొట్టడానికి పథకాలు సిద్ధం చేయడం న్యాయమా? ఇతర జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ఆ తర్వాతే ఈ జిల్లాకు దక్కా ల్సినవి ఇస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వారు సెలవివ్వాలి. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌కు 5 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌కు 3 లక్షల ఎకరాలు, రంగా రెడ్డికి 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌కు లక్షా 71 వేల ఎక రాలు, నల్గగొండకు 2లక్షల 29 వేల ఎకరాలకు నీటి కేటాయింపు చేస్తూ ఆదిలాబాద్‌కు మాత్రం లక్షా 56 వేల ఎకరాలకు మాత్రమే నీటి కేటాయింపులు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించిన మేరకు, ఈ జిల్లాలోని లక్షా 50 వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నీరు దక్కకుండా పోయే ప్రమాదం పొంచుకుని ఉంది. ఏ న్యాయం ప్రకారం చూసినా సరే.. ఏ జిల్లాలో ఉన్న టువంటి నీళ్లు ముందు ఈ జిల్లాకే రావాలి. రాజ్యాంగం ప్రకారమైనా, సహజ న్యాయసూత్రాల ప్రకారమైనా ఇదే సరైనది. ఈ విషయమై గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం ఇక జరగదని ఆశిస్తున్న తరుణంలో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాకు తీరని నష్టం జరుగుతూ ఉన్నది. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు పరిశ్రమల మూసివేత, మరోవైపు మా జిల్లా చుట్టూ మూడువైపులా నీళ్లు, ఒక వైపు గోదావరి మరోవైపు ప్రాణహిత, మరో వైపు ఆదిలాబాద్ నుండి వస్తున్న పెన్‌గంగా, వాగులకు, వంకలకు కొదువే లేదు. కట్టక కట్టక కట్టిన చిన్న చిన్న ప్రాజెక్టులు, ఆఖరుకు ‘కొమురం భీం’ పేరుతో కట్టిన ప్రాజెకులోకూడా నిండుగా నీళ్లు ఉన్నాయి. కానీ కాలు వలు పూర్తి కాక అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. అన్ని విధాలా అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మీ ద్వారానైనా అభివృద్ధి చెందుతుందని ఆశించినాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో కాసిన్ని నీళ్లు లభిస్తాయనుకుంటే అవి కూడా దక్కకుండా ఆ ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గర నిర్మిస్తామంటున్నారు. ఇది ఇతర జిల్లాలకు న్యాయం, మా జిల్లాకు అన్యాయం కాక మరేమవుతుందని మేము భావించాలో చెప్పండి. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలకు న్యాయం చేయాలి కానీ, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయ వద్దని కోరుతున్నాం. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికేతరులే పదవుల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులు అయిన మిమ్మల్ని మేము ప్రశ్నించేది ఒక్కటే. మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారా, లేక ఈ ప్రాంత ప్రజల ను ప్రాణహిత నదిలో, ఎస్పీఎంలో, ఓపెన్‌కాస్ట్‌ల బొం దలగడ్డలో సమాధి చేస్తారా? కాబట్టి తెలంగాణ ముఖ్య మంత్రి తక్షణమే కల్పించుకొని జాతీయహోదాకు సమీ పంగా వచ్చిన ప్రాణహిత వద్ద వీలైన పద్ధతుల్లో ప్రాజె క్టును నిర్మించి 1,56,000 ఎకరాలకు గానూ మాకు హామీ ఇచ్చిన, మాకు హక్కు ఉన్న నీళ్లను మాకు ఇచ్చి ఎక్కడికైనా నీళ్లను తీసుకెళ్లండి. అంతేకాని మిమ్ములను నమ్ముకున్నటువంటి ఈ ప్రజలకు అన్యాయం చెయ్య వద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే వెనుకబడిన ఈ జిల్లాను మరింత వెనకకు నెట్టవద్దని, అదిలాబాద్ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యవద్దని మిమ్మల్ని మరీమరీ కోరుతూ ఉన్నాం. ప్రాణహితపై మరోసారి పునరాలోచన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. - వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ : 9849588825 -
తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదవ రాష్ట్ర మహాసభలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలన్న దశాబ్దాల కలను సాకారం చేయడంలో ఒక ముఖ్య పాత్రధారిగా నిలిచిన తెలంగాణ విద్యావంతుల వేదికకు పది వసంతాలు. ఆ సందర్భంగా ఐదవ రాష్ట్ర మహాసభలను జరుపుకుంటోంది. హైదరాబా ద్లో ‘వట్టికోట ఆళ్వార్‌స్వామి ప్రాంగణం’లో (పబ్లిక్ గార్డెన్స్), ఈ నెల 10, 11 తేదీలలో ‘భాగ్య రెడ్డి వేదిక’లో (ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం) జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక పుట్టుకకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. 1953లో మొదలైన ‘నాన్‌ముల్కీ గో బ్యాక్’ ఉద్యమం నుండి 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమం వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటాలన్నిట్లోనూ తెలంగాణ ప్రజ లు పాలకుల అణచివేతకు గురయ్యారు, నాయక త్వపు నమ్మకద్రోహంతో దగాపడ్డారు. నక్సల్బరీ తదుపరి జగిత్యాల, సిరిసిల్ల జైత్రయాత్రతో మొదలై విప్లవోద్యమం దేశాన్ని చుట్టుముడుతున్న తరు ణంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా సాగించిన అణచివేతకు తెలంగాణ మరోసారి నలిగిపోయింది. 1996లో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం రూపంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ముందుకు వచ్చిం ది కానీ చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రజాసంఘం పనిచేయలేని స్థితి నెలకొంది. ప్రజాసమస్యలపై నిలదీసినా నక్సలైట్ల ముద్రవేసి అణచివేశారు. ‘తెలంగాణ’ పదాన్ని అసెంబ్లీలో నిషేధించే దుర్మార్గమూ సాగింది. ఫాసిస్టు అణచివే తకు విప్లవోద్యమం వెనుకపట్టు పట్టిన నేపథ్యంలో 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఒక రాజకీయపార్టీ ఏర్పడింది. అది స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టాయి. 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భం గా తెలంగాణ విద్యావంతులు, ప్రొఫెసర్లు, మేధా వులు జరిపిన సమాలోచన నుండి, అమరుడు ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ విద్యావంతుల వేదిక పురుడుపోసుకుంది. వేదిక ఊరూరూ తిరిగి తెలం గాణ దోపిడీకి గురవుతున్న తీరును విప్పిచెప్పి, బుద్ధి జీవులను మేల్కొల్పింది. తెలంగాణ సమస్య లను ప్రజల ఎజెండా మీదికి తెచ్చింది. పదేళ్ల ప్రస్థా నంలో లక్షలాది కరపత్రాలను ప్రచురించింది. వేలా దిగా సదస్సులను సమావేశాలను నిర్వహించింది. సుమారు 20 పుస్తకాలను ప్రచురించి భావవ్యాప్తిని సాగించింది. ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన పాటను తెలంగాణ విద్యావంతుల వేదిక బొగ్గు పోరాటాల నిలయం శ్రీరాంపూర్‌కు, కరీంనగర్‌కు మోసుకొచ్చింది. (తెలంగాణ ధూం ధాం). ప్రజా సమస్యలను సైతం వెలుగులోకి తెస్తూ వేదిక తెలం గాణ రాష్ట్రం కోసం నిర్విరామ కృషి సాగించింది. తెలంగాణ ఉద్యమం ప్రచార దశ దాటి పోరా ట దశకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ విద్యా వంతుల వేదిక ముందు నిలిచి, జేఏసీలో ముఖ్య పాత్రను పోషించింది. తెలంగాణ రాష్ట్ర జేఏసీకి, జిల్లా జేఏసీలకు 90 శాతం విద్యావంతుల వేదిక కార్యకర్తలే నాయకత్వం వహించారు. రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో వేదిక నిర్వర్తించాల్సిన పాత్ర గురించి నాగార్జునసాగర్‌లో ‘సాగర్ సమాలోచన’ జరిపి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలను చర్చించింది. ప్రజలు కోరుకున్నది దోపిడీ తెలంగాణ కాదు, అన్నపూర్ణ తెలంగాణ, సుభిక్ష తెలంగాణ, సామాజిక తెలం గాణ, ప్రజాస్వామ్య విలువలుగల తెలంగాణ సాధన కోసం తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజల తరపున నిలబడుతుంది. ప్రజల ఆకాంక్షల కోసం ముందు ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ‘ప్రగతి కోసం, ప్రజాస్వామ్యం కోసం, పైసలో భాగం, పాలనలో భాగం’ అనే నినాదాలతో వేదిక తన ఐదవ మహాసభలను నిర్వహిస్తోంది. తెలం గాణ రాష్ట్రం దేశానికే చుక్కాని కావాలని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభలను విజయ వంతం చేయాలని కోరుతున్నాం. - గురిజాల రవీందర్రావు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర 5వ మహాసభల కన్వీనర్