ఎనీటైమ్‌ వాటర్‌ నిల్‌! | Sakshi Field survey on water problems in hyderabad | Sakshi
Sakshi News home page

పొద్దంతా ఇదేంటీ!

Published Wed, Feb 28 2018 8:13 AM | Last Updated on Wed, Feb 28 2018 8:13 AM

Sakshi Field survey on water problems in hyderabad

ఉప్పల్‌లోని వాటర్‌ ఏటీఎం (ఫైల్‌)

నగర ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ‘వాటర్‌ ఏటీఎంలు’ నిరుపయోగంగా మారాయి. ఏ టైంలోనూ ఈ మిషన్లలో నీరు నింపడం లేదు. ప్రజల దాహార్తి తీరడం లేదు. నగరం నలుమూలలా 92 ఎనీటైం వాటర్‌ మిషన్ల ఏర్పాటులో శ్రద్ధ చూపిన జీహెచ్‌ఎంసీ...నిర్వహణ తీరును పర్యవేక్షించడం మరిచిపోయింది. దీంతో మినరల్‌ వాటర్‌ లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చాలా చోట్ల వాటర్‌ ఏటీఎంల వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని సంస్థలకు ప్రత్యేకంగా ఈ కియోస్క్‌ల ఏర్పాటుకు అనుమతినివ్వడంతోపాటు...స్థలం కూడా జీహెచ్‌ఎంసీ కేటాయించింది. జలమండలి ఉచితంగా నీరు సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. అయినా ఫలితం లేకుండా పోయింది.   

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు శ్రద్ధ చూపిన జీహెచ్‌ఎంసీ.. వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. నిర్వహణ గురించి తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది. తాము వాటర్‌ ఏటీడబ్లు్య(ఎనీటైమ్‌ వాటర్‌) కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామంటూ కొన్ని సంస్థలు జీహెచ్‌ఎంసీని సంప్రదించాయి. ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసే నీరు శ్రేయస్కరం కాదని, తమ సాంకేతిక పరిజ్ఞానంతో మినరల్‌ వాటర్‌ వస్తుందంటూ ప్రచారం చేయడంతో వాటి ఏర్పాటుకు అంగీకరించారు. ఆమేరకు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌(ఈఓఐ)ఆహ్వానించారు. వచ్చిన సంస్థల్లో రెండింటిని ఎంపిక చేశారు. ఎంత నీటికి ఎంత ధర వసూలు చేయాలో నిర్ణయించారు. అంతే తప్ప రెగ్యులర్‌గా వాటిని నిర్వహిస్తారా.. నిర్వహించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవేవీ లేకుండానే ఏటీడబ్లు్యల ఏర్పాటుకు అనుమతించారు. ఒప్పందం మేరకు, జీహెచ్‌ంఎసీ పరిధిలో 300 చదరపు అడుగుల స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అప్పగిస్తే.. జలమండలి నుంచి నీటిని ఉచితంగా సేకరించి, తమ సాంకేతికతతో మినరల్‌ వాటర్‌గా మార్చి ప్రజలకు తక్కువ ధరకు అందజేస్తామన్నారు. అలా గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో 92 వాటర్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. వాటిల్లో చాలా చోట్ల పనిచేయడం లేదు.

కొన్ని చోట్ల వాటి చుట్టూ చెత్తాచెదారం చేరినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రజల సదుపాయం కోసమని కోరినంత స్థలాన్నిచ్చిన జీహెచ్‌ఎంసీ అవి పనిచేస్తున్నాయా, లేదా..అనేవాటిని పట్టించుకోలేదు. వాటి నిర్వహణపై తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. జలమండలి నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ, రవాణా మాత్రం నిర్వాహకులే చూసుకోవాలని తెలిపినట్లు సమాచారం. దాంతో చాలాచోట్ల నిర్వాహకులు నిర్వహణను వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు సదుపాయం కల్పించాల్సిన  రెండు ప్రభుత్వ విభాగాలు ఈ వ్యవహారంలో వేటికవిగా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. తరచూ సిటీ కన్జర్వెన్స్‌ సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు ఈ అంశంపై తగిన నిర్ణయం కోవాలని.. వస్తున్నది వేసవి అయినందున ప్రజల దాహం తీర్చేందుకు వాటర్‌ కియోస్క్‌లు ఎల్లవేళలా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  అధికారుల సమాచారం మేరకు కూకట్‌పల్లి రైతుబజార్, ఎన్టీఆర్‌ గార్డెన్,  ఇందిరాపార్కు, మౌలాలి, చక్రిపురం, చర్లపల్లి, రామంతాపూర్‌లోని గాంధీనగర్, సత్యనారాయణస్వామిగుడి, ఇండిరానగర్, వివేక్‌నగర్‌ డిమార్ట్‌ దగ్గర, మున్సిపల్‌ ఆఫీస్‌(ఆనంద్‌నగర్‌), నాగోల్‌ గవర్నమెంట్‌ స్కూల్, డెయిరీ, ఎన్జీఓస్‌ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌(ఆంధ్రాబ్యాంక్‌), మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో కియోస్కీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement