విస్సన్నపేట(తిరువూరు): మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని రాజీవ్‌కాలనీవాసులు మంగళవారం సత్తుపల్లి– విస్సన్నపేట ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీబిందెలతో రాస్తారోకో చేశారు. తమ కాలనీకి గత నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒహెచ్‌ఆర్ ద్వారా పంచాయతీ ఆధ్వర్యంలో నీరు సరఫరా కావటం లేదని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే వేసవి ఎండలు అధికంగా ఉన్నాయని, తాగేందుకు నీరు దొరక్క దాహార్తితో అలమటిస్తున్నామని ఆవేదన చెందారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు.
పంచాయతీ ఈవో సరోజిని దృష్టికి సమస్య తీసుకెళ్లినా తగిన రీతిలో స్పందించలేదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు. మహిళలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఎస్‌ఐ బి.తులసీధర్ రాస్తారోకో ప్రదేశానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి విరమింపజేశారు. అధికారులను పిలిపించి మాట్లాడారు. ఈవోపిఆర్డీ శంకరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ చక్రధర్ స్థానికులతో సంప్రదింపులు చేశారు. త్రీపేజ్ కరెంట్‌తో మోటారు నడుస్తున్నందున తగిన విధంగా విద్యుతు సరఫరా లేకపోవటంతో ఓహెచ్‌ఆర్ నిండటం లేదని వారు చెప్పారు. రాజీవ్‌కాలనీలో ఉన్న చేతి పంపునకు సింగిల్‌పేజ్ మోటారు అమర్చి తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment