పెద్దలకే నీళ్లు | water problems in Hyderabad | Sakshi
Sakshi News home page

పెద్దలకే నీళ్లు

Published Sat, Apr 16 2016 4:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పెద్దలకే నీళ్లు - Sakshi

పెద్దలకే నీళ్లు

పేదల గోడు పట్టించుకోని జలమండలి  నీటి సరఫరాలో అసమానతలు
సంపన్న ప్రాంతాలకు కావాల్సినన్ని నీళ్లు
పేదలుండే ప్రాంతాలకు అరకొరగా సరఫరా
గచ్చిబౌలిలో నెలకు 71 వేల లీటర్లు..
సైదాబాద్‌లో మాత్రం 13వేల లీటర్లే
హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లకు చేరుతున్న ‘ఉచిత’ నీరు
బస్తీలకు సరఫరా చేస్తున్నట్లుగా రికార్డులు
కోలా, బీరు కంపెనీలకు పెరిగిన నీటి సరఫరా

 
సాక్షి, హైదరాబాద్: పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు.. వట్టిపోయిన బోర్లు.. మండుతున్న ఎండలు.. ఓవైపు చుక్క నీటి కోసం తండ్లాడుతుంటే... జలమండలి నీటి పంపిణీ తీరు.. పేదలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. జలమండలి వివక్ష కారణంగా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల గొంతెండుతోంది. సంపన్నులు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు కోట్ల వ్యాపారం చేసే కోలా, బీరు కంపెనీలకు కావాల్సినన్ని నీళ్లు సరఫరా చేస్తున్న జలమండలి.. బస్తీలు,  పేదలుండే ప్రాంతాలకు అరకొరగా నీటిని సరఫరా చేస్తోంది. ఉదాహరణకు సంపన్నులు నివాసముండే గచ్చిబౌలి ప్రాంతంలో ప్రతి కుళాయికి నెలకు సగటున 71 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తుండగా... అల్పాదాయ వర్గాలు, పేదలు ఎక్కువగా ఉండే సైదాబాద్‌ప్రాంతంలో ప్రతి కుళాయికి కేవలం 13 వేల లీటర్లు మాత్రమే అందిస్తోంది. అంటే సంపన్నుల నల్లాలకు రోజూ 2,366 లీటర్లు ఇస్తూ.. పేదలకు మాత్రం 433 లీటర్లనే అందిస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కంపెనీలకు ఫుల్లుగా నీళ్లు
పేదలకు మంచినీళ్లు దొరక్క ఇబ్బందిపడుతోంటే... జలమండలి మాత్రం పెప్సీ, కోలా తదితర బేవరేజెస్, బ్రూవరీస్ కంపెనీలకు నీటిసరఫరాను మరింతగా పెంచడం గమనార్హం. ఇలాంటి ఏడు కంపెనీలకు నెలకు 17 కోట్ల లీటర్లను అందజేస్తున్నారు. వీటితోపాటు మొత్తంగా పరిశ్రమలకు కలిపి 50 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజూ 39.69 కోట్ల లీటర్లను అందిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 6.74 లక్షల గృహ వినియోగ కనెక్షన్లకు 75.60 కోట్ల లీటర్లు, 1,470 మురికివాడల్లోని సుమారు 1.50 లక్షల నల్లా కనెక్షన్లకు కేవలం 18.90 కోట్లలీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.

శివార్లపై చిన్నచూపు
శివారు ప్రాంతాలపైనా జలమండలి శీతకన్ను వేసింది. ప్రధాన నగరంలో రోజు విడిచి రోజు సరఫరా జరుగుతుండగా... శివారు ప్రాంతాల్లో నాలుగైదు రోజులకోసారి నీళ్లిస్తున్నారు. మల్కాజ్‌గిరి, కాప్రా ప్రాంతాల్లోని కొన్ని బస్తీలకైతే ఏకంగా పదిరోజులకోసారి నీరు అందుతుండడం ఆందోళనకరం. ఇక మంచినీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణ విషయంలోనూ శివారు ప్రాంతాలపై జలమండలి నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రధాన నగరంలో 98 శాతం మందికి నల్లా కనెక్షన్లుండగా... శివార్లలోని కూకట్‌పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 60 శాతం మందికే నల్లా కనెక్షన్లున్నట్లు జలమండలి తాజా నివేదిక స్పష్టం చేసింది. అసలు మహానగరం పరిధిలో నల్లా కనెక్షన్లున్నది 8.74 లక్షల ఇళ్లకైతే... సుమారు 13.26 లక్షల నివాసాలకు కనెక్షన్లు లేకపోవడం గమనార్హం. వారంతా బోరుబావులు, ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.

ట్యాంకర్ల విషయంలోనూ వివక్షే!
జలమండలి పరిధిలో వాణిజ్య, గృహావసరాలకు నీటిని తరలించే ట్యాంకర్లు 751 ఉన్నాయి. అదే నిరుపేదలు నివసించే బస్తీలు, కాలనీలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు 199 మాత్రమే. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు జలమండలి 200 కమర్షియల్ ట్యాంకర్లను నడుపుతోంది. నారాయణగూడ డివిజన్‌లో కేవలం 2, మారేడ్‌పల్లి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో బస్తీలకు ఉచితంగా నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు ఐదు మాత్రమే ఉన్నాయి.

‘దారి’ తప్పుతున్న నీళ్లు..
శివారు ప్రాంతాల్లోని బస్తీలకు చేరుకోవాల్సిన ఉచిత ట్యాంకర్ల నీళ్లు వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లకు చేరుతున్నాయి. అధికారులు ట్యాంకర్ యజమానులతో కుమ్మక్కై బస్తీలకు సరఫరా చేస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతూ గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నారు. దీంతో బస్తీల ప్రజలు నీళ్లు అందక నానా ఇబ్బందులూ పడుతున్నారు. నీటి కోసం కూలిపనులకు వెళ్లడం కూడా మానుకుని చూస్తున్నవారు ఎందరో ఉన్నారు.

 ============
 ఇది మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట ఫిల్లింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఎంఏనగర్, మక్తా మహబూబ్‌పేట్, సుభా, చంద్రబోస్‌నగర్, గోకుల్ ప్లాట్స్, పీఏనగర్, ఆదిత్యానగర్, హఫీజ్‌పేట, సాయినగర్‌యూత్ కాలనీ, న్యూ కాలనీ, నడిగడ తండా ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేస్తోంది. గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు హఫీజ్‌పేట ఫిల్లింగ్ పాయింట్‌లో ఓ ట్యాంకర్ నీళ్లు నింపుకొని వెళ్లి.. ఆల్విన్ కాలనీ చౌరస్తా సమీపంలోని అతిథి హోటల్‌కు సరఫరా చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది

 
 షాపూర్‌నగర్ రిజర్వాయర్ నుంచి బయలు దేరిన ట్యాంకర్ దేవేందర్‌నగర్‌లో ప్రజలకు ఉచితంగా నీటిని అందించాలి. కానీ డ్రైవర్ డ్రమ్ము నీటికి రూ.15 చొప్పున వసూలు చేస్తుండటం ‘సాక్షి’ కంటపడింది. ట్యాంకర్ల డ్రైవర్లు డబ్బులిచ్చినవారికే నీళ్లు పోస్తున్నారు. ఇళ్ల ముందున్న డ్రమ్ములను లెక్కిస్తూ డబ్బులు వసూలు చేస్తుండటం గమనార్హం.

 
 నీళ్ల ఖర్చు రూ.2వేలు దాటుతోంది
 ‘‘నీటి కోసం ప్రతినెలా రూ.2,500 ఖర్చు చేయాల్సి వస్తోంది. జలమండలి నుంచి రెండు, మూడు రోజులకోసారి, అదీ కొద్దిమొత్తంలోనే నీళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది..’’
 - విశాల్, గౌతమీ ఎన్‌క్లేవ్


 సరఫరా వ్యవస్థ లేకనే..
 ‘‘పలు శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాంతాలకు నీటిసరఫరాలో అంతరం పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ, స్టోరేజీ రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాక నీటి సమాన పంపిణీ వీలవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం..’’
 - దానకిషోర్, జలమండలి ఎండీ
 
 ‘ఖరీదైన’ ప్రాంతాలకు నీటి సరఫరా తీరు..   (నెలకు.. వేల లీటర్లలో)
 ప్రాంతం    నీటి సరఫరా
 గచ్చిబౌలి        71
 మాదాపూర్    62
 మియాపూర్    51
 బంజారాహిల్స్    50
 తార్నాక        50
 గన్‌ఫౌండ్రీ        50
 నారాయణగూడ    49
 జూబ్లీహిల్స్    40
 
 నిరుపేదలుండే బస్తీల్లో నీటి సరఫరా తీరు (నెలకు.. వేల లీటర్లలో)
 ప్రాంతం        నీటి సరఫరా
 సైదాబాద్        13
 ఎస్పీఆర్‌హిల్స్    14
 జియాగూడ    15  
 ఆలియాబాద్    15
 గౌలిపురా        15
 ఆళ్లబండ        15
 యాకుత్‌పురా    15
 ఫాదర్‌బాలయ్యనగర్    15
 రాధిక(కాప్రా)    16
 మెట్టుగూడ    17
 
 లిక్కర్, కూల్‌డ్రింక్ కంపెనీలకు పెరిగిన నీటి సరఫరా (లీటర్లలో)
 కంపెనీ    జనవరి    ఫిబ్రవరి    మార్చి
 క్రౌన్‌బీర్    1,48,80,000    1,52,44,000    2,02,61,000
 సౌత్ ఏసియా బ్రూవరీస్    1,86,00,000    2,27,00,000    2,30,00,000
 యునెటైడ్ బ్రూవరీస్-1    1,11,60,000    1,04,40,000    1,11,60,000
 యునెటైడ్ బ్రూవరీస్-2    2,79,00,000    2,61,00,000    2,79,00,000
 పెప్సికోలా    3,72,00,000    3,13,20,000    3,72,00,000
 కోకాకోలా-1    3,34,80,000    3,13,20,000    3,34,80,000
 కోకాకోలా-2    1,39,50,000    1,30,50,000    1,39,50,000
 
 గ్రేటర్ క‘న్నీటి’ చిత్రం..
 విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు
 జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు:
 355 ఎంజీడీలు (134.19 కోట్ల లీటర్లు)
 మొత్తం నల్లా కనెక్షన్లు: 8.74 లక్షలు
 మొత్తం నివాసాలు: సుమారు 22 లక్షలు
 నల్లా కనెక్షన్లు లేనివి: సుమారు 13.26 లక్షల నివాసాలు
 (బోరుబావులు, ఫిల్టర్‌ప్లాంట్లు, ప్రైవేటు ట్యాంకర్లే వీరికి ఆధారం)
 జలమండలి నీటి సరఫరా వ్యవస్థ లేని కాలనీలు: సుమారు వెయ్యి
 బోరు బావులు:     25 లక్షలు (15 లక్షలు ఈ వేసవిలో వట్టిపోయాయి)
 జలమండలి ట్యాంకర్లు: 950
 ప్రైవేటు ట్యాంకర్లు: సుమారు 3,000
 బోరు నీళ్లను శుద్ధిచేసి విక్రయిస్తున్న వాటర్ ప్లాంట్లు:
 సుమారు 5,600
 శివార్లలో ప్రైవేటు ట్యాంకర్లు, వాటర్ ప్లాంట్ల వ్యాపారం:
 నెలకు సుమారు రూ.100 కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement