♦ రోజురోజుకూ పడిపోతున్న నీటి మట్టాలు
♦ రెండు నెలలకు ముందే తాగు నీటి ఎద్దడి
♦ 25 మండలాల్లో పరిస్థితి తీవ్రం
♦ చోద్యం చూస్తున్న నీటి సరఫరా విభాగం
వరంగల్ : వేసవిలో ఎండ తీవ్రతలు పెరగక ముందే జిల్లాలో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గత వర్షాకాలంలో వర్షాలు పడినా పెద్దగా నీటి మట్టాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. నీరు మాత్రం పాతాళంలోనే ఉంది. కొన్ని మండలాల్లో ఇంకా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 20 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. పైగా నీటి వినియోగం అధికం కావడంతో ఈ వేసవిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రఘునాథపల్లిలో రికార్డు స్థాయిలో 36మీటర్లకు జలమట్టం పడిపోవడం అందోళన కలిగిస్తోంది.
చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, రఘునాథపల్లి, కొడకండ్ల, పాలకుర్తి, పర్వతగిరి, తొర్రూరు, ములుగు ప్రాంతాల్లో జలం ఇప్పటికే పాతాళానికి చేరింది. ఈ మండలాల్లో 15 నుంచి 36 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. మార్చి నెలాఖరులోనే ఈ నీటి మట్టాలు నమోదు కావడం... ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత మరింత పెరుగుతుండడాన్ని బట్టి నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నీటి కష్టాలు...
భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లా అంతటా నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో నమో దు అయిన నీటి మట్టాలు ఈ ఏడాది మార్చిలోనే దాటి పోయాయి. గత ఏడాది కంటే ఈ సారి మరింత నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయానికి గతం లో 7.98 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు... ఈసారి ఏకంగా 11.76 కి పడిపోయాయి. దీంతో గ్రామాలు, తండాల్లో నీరు దొరకడమే కష్టంగా మారింది. వ్యవసాయ బావులన్నీ ఎండిపోతున్నాయి.
మూడు నెలల కిందటి వరకు నీటితో నిండిన వ్యవసాయ బావులు... ఒక్కసారిగా అడుగంటిపోతున్నాయి.దాదాపు 400కు పైగా గ్రామాల్లో తాగునీటి సరఫరా చేసే బావులు ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతున్న తండాలు, గిరిజన గూడేల్లోని ప్రజలు... ఇక నుంచి మరింత ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. అయితే ఈనెలలో మరింత కిందకు దిగజారుతాయని అధికారులు భావిస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం...
గత ఏడాది కంటే రెండు నెలల ముందే నీళ్లు పాతాళానికి చేరాయి. ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్లితే జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో సైతం మంచినీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. మొన్నటి వరకూ కురిసిన వానలతో జిల్లాలోని ఆయా చెరువులు నిండినా... ఇప్పుడు ఎండిపోతున్నాయి. దీనికి తోడుగా మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ పనుల కోసం నీటిని వదిలివేయడం కూడా అందోళన కల్గించే విషయం. భూగర్భజలాలు పడిపోతున్నాయని, ఈ దశలో మూడో పంటలు వేస్తే ప్రమాదంటూ చెబుతున్నారు.
వాగులు, వంకలు ఎండిపోయాయని, భూములు నై బారి పోవడంవల్ల ఇప్పుడు పంటలకు సాగునీరు ఎంత పారించినా... లాభం ఉండదంటున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో భూగర్భ జలమట్టం 10 మీటర్ల లోతు నుంచి 36 మీటర్ల వరకు పడిపోయింది. మిగిలిన మండలాల్లో సగటున 10 మీటర్లలో నీరు లభ్యత ఉంటోంది. ఇక జలమట్టం గణనీయంగా పడిపోవడంతో కొత్త బావుల తవ్వకానికి బ్రేక్ వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. బోర్లు వేసేందుకు కూడా అనుమతివ్వడం లేదు.
నిర్లక్ష్యంలో నీటి సరఫరా విభాగం...
జిల్లాలో తాగు నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తున్నా...జిల్లా నీటి సరఫరా విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ తాగు నీటి కార్యక్రమం కింద జిల్లాలకు కోట్లాది రుపాయాలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రతిపాదించిన పనులన్నీ నత్తనడకన సాగుతున్నా పట్టించుకున్న అధికారి లేడు. జిల్లాలోని మండలాల్లో పనిచేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు రోజూ అప్‌అండ్‌డౌన్ చేయడం వల్ల పనులపై పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగుతున్నాయి. 2012లో మంజూరైన పనులు కూడా పూర్తి కాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
ఏజెన్సీలో తీవ్రరూపం
కొత్తగూడ : ఏజెన్సీలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగు నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పదేళ్లుగా ఏకధాటిగా పోసిన బోరు బావులు అడుగంటాయి. మండలంలో 402 బోర్లు ఉండగా... అన్నింటిలో నీటి నిల్వలు పడిపోయాయి. 150 ఫీట్ల లోతు నుండి నీటిని అందించే బోర్లు 300 ఫీట్లు దించినా నీరందని పరిస్థితి నెలకొంది. ఎదుళ్లపల్లి గ్రామంలో నాలుగు బోర్లలో నీరు రాకపోవడంతో 2 కి.మీ దూరంలో బోరువేసి పైపులైన్ వేశారు. అరుునా... నీరు అందకపోవడంతో కొద్దికొద్దిగా వస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రెండు నెలలు ఎలా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
13 బోర్లు వేయించా..
గ్రామంలో తాగు నీటి కోసం 13 బోర్లు వేయించా. ఒక్కదాంట్లో నీళ్లు రాలేదు. సర్పంచ్‌గా గెలిచినందుకు కనీసం తాగు నీరందించాలని ఎంత ప్రయత్నించినా ఇబ్బందే ఎదురవుతోంది. భూగర్భ జలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి.
- బానోతు భద్రమ్మ, పొగుళ్లపల్లి సర్పంచ్
జలం..పాతాళం
Published Sun, Apr 12 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM
Advertisement