వేసవి ప్రారంభానికి ముందే మన్యంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. నీటి వనరులు రోజురోజుకూ అడుగంటుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్ముం దు ఎలా ఉంటుందోనని కలవరపడుతున్నారు. వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఊట బావుల్లో కొన్ని ఇప్పటికే అడుగంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో 150కి పైగా గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ప్రమాదం పొంచిఉందని గిరి పుత్రులు చెబుతుండగా.. మండువేసవిలో కూడా నీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులంటున్నారు.
సీతంపేట: రానున్న వేసవిలో ఏజెన్సీ గ్రామాల వాసులకు నీటి కష్టాలు వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల గిరిజనులు గుక్కెడు నీటి కోసం ఆపసోపాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఊటబావులు (గ్రావిటేషన్ ఫ్లో) అడుగంటడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కురసింగి, బర్నగూడ, ఎగువదరబ, గుడ్డిమీదగూడ, మండదీసరిగూడ తదితర గ్రామాల్లో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత పెరిగితే ఎగువ లోవగూడ, గాలికుప్పగూడ, దబరగూడ, రామానగరం, చింతలగూడ, నాయుడుగూడ, పెద్దగూడ, వెంకటిగూడ, పెద్దగూడ, కారిమానుగూడ, చింతమానుకాలనీ, జగ్గడుగూడ తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీపీఎంయూ మండలాలైన భామిని, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు తదితర మండలాల్లోని గిరిజన గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఇప్పటికే గిరిజన దర్బార్‌లో పలువురు వినతులు అందించారు.
150 గ్రామాలపైనే...
ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 1250కి పైగా గ్రామాలుండగా.. వీటిలో సగానికి పైగా కొండపైనే ఉన్నాయి. 4 వేలకు పైగా బోర్లు, 2 వేల బావులు, 200 గ్రావిటేషన్ ఫ్లో (ఊటబావుల ట్యాంకులు), 250 వరకూ రక్షిత పథకాలతోపాటు 48 సోలార్ రక్షిత పథకాలు ఉన్నాయి. వీటిలో చాలా నీటి వనరులు ఇప్పటికే అడుగంటడంతో ప్రస్తుతం వీరంతా గెడల్డపై ఆధారపడుతున్నారు. మరికొద్దిగా ఎండలు తీవ్రమైతే 150కు పైగా గ్రామాల్లో నీటి కష్టాలు ప్రజలను వెంటాడే అవకాశాలున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన నీటి ఎద్దడి ఇప్పటినుంచే ఆరంభమవ్వడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఎత్తైన కొండలపై ఉన్న గ్రామాల గిరిజనులు గుక్కెడు నీటికోసం తహతహ లాడుతున్నారు. కారణం ఆయా గ్రామాలకు బోర్లు వేయడానికి రిగ్గులు వెళ్లకపోవడం, ఏదో ఒకలా వెళ్లినా నీరు పడక పోవడం, నీటి ఊటలు అడుగంటడం వంటి కారణాలతో నీటి ఎద్దడి ఉంటుంది. నీరు లభ్యంకాక.. ఊటగెడ్డల్లోని కలుషిత జలాలను గిరిజనులు తెచ్చుకొని వ్యాధులబారిన పడిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈసారి ముందే జల వనరులు అడుగంటుతుండడంతో గిరిజనులు పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోతున్నారు. వేసవికి ముందే నీటి ఎద్దడి ప్రారంభం కావడానికి ఈ సంవత్సరం మన్యంలో సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటడమే కారణంగా అధికారులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment