పొరుగు రాష్ట్రాలతో నీటి సమస్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పొరుగు రాష్ట్రాలతో నీటి సమస్య ఉన్నందువల్లే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను ఆరా తీశారు. తర్వాత ఎన్‌ఎస్ గేటు సమీపంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. తర్వాత రామగిరి మండలంలోని కుంటిమద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మూడు కార్యక్రమాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. పట్టిసీమను చేపట్టాలని పదేళ్ల కిందట కాంగ్రెస్‌కు ఆలోచన వచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రస్తుతం రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని సీఎం అన్నారు. అప్పట్లో వారికి ముడుపులపైనే ధ్యాస ఉండేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో నీటి సమస్య ఉందని, అందుకే పట్టిసీమను చేపట్టామని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి రాయలసీమలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు నీరు మళ్లించి రాయలసీమ నీటికష్టాలు తీరుస్తామని పునరుద్ఘాటించారు. గంగ-కావేరి నదులను అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోందని, అలాగే రాష్ట్రంలో గోదావరి-కృష్ణా, గోదావరి-వంశధార, కృష్ణా-పెన్నాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా తర్వాత ‘అనంత’లోనే తమకు ఓట్లు బాగా వచ్చాయని, ‘సీమ’లో తక్కిన మూడు జిల్లాలో కాస్త తగ్గాయని చెప్పారు.
కలలో కూడా అనంతపురమే..
గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల సమక్షంలో భారీ కేక్‌కట్ చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఏసీగదుల్లో జన్మదినాన్ని జరుపుకోవచ్చునని, కానీ చైనా నుంచి వస్తుంటే హాంకాంగ్‌లో ఉన్నపుడు ‘అనంత’కు వెళ్లాలని అనిపించిందని, అందుకే వచ్చానన్నారు.