సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు జాతీయ స్కాంలా తయారైందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమార్జనకు ఈ ప్రాజెక్ట్ సంజీవనిలా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం పనులు 39 శాతం పూర్తయ్యాయని, కానీ ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు తనఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని స్కామ్‌ల ప్రాజెక్టులా చంద్రబాబు మార్చివేశారని, ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు.
మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో గమనిస్తే కర్ణాటకలో ఆలమట్టి లాంటి ఎన్నో ప్రాజెక్టులొచ్చాయని, కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రాజెక్టులు, నీటి ఆవశ్యకత గురించి చంద్రబాబు ఉపన్యాసాలు దంచి కొడతారని.. కానీ పని మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడం తన జీవిత ఆశయమని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. 2018 నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏంతో సాధించానని చంద్రబాబు చెబుతారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పునాది వేసిన స్థలంలో నిలబడి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని, అయితే భూగర్భంలో ఉన్నందున కనిపిస్తలేదని చంద్రబాబు చెప్పడం సబబు కాదన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని నీటిని సరఫరా చేస్తామంటున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్టణం ప్రాజెక్టులకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశారు. అందులో 350 కోట్లు అవినీతి జరిగిందని కాగ నివేదిక ఇవ్వడం నిజం కాదా అని ఈ సందర్భంగా సజ్జల ప్రశ్నించారు. తన అవినీతి కోసమే చంద్రబాబు శాశ్వత ప్రాజెక్టులను ఎప్పుడూ పూర్తి చేయరని.. కేవలం కమీషన్ల కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు కడుతున్నాడరంటూ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులకు, పోలవరం అంచనాలకు సంబంధమే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment