పోలవరానికి ‘చంద్ర’గ్రహణం! | Polavaraniki 'candragrahanam! | Sakshi
Sakshi News home page

పోలవరానికి ‘చంద్ర’గ్రహణం!

Published Tue, Mar 17 2015 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Polavaraniki 'candragrahanam!

  • ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డుపుల్లలు వేస్తున్న రాష్ట్ర సర్కారు
  • సాక్షి, హైదరాబాద్: పోలవరం.. ఎన్నో దశాబ్దాల కల.. వృథాగా కడలిలో కలిసిపోతున్న నీటిని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు కురిపించేందుకు తలపెట్టిన మహాయజ్ఞం..! ఒక్కమాటలో చెప్పాలంటే ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయని!! అలాంటి ప్రాజెక్టుకు ఇప్పుడు రాష్ట్ర సర్కారు రూపంలోనే విఘ్నం ఎదురవుతోంది. ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం ముందుకు వచ్చినా ప్రభుత్వమే కొర్రీలు పెడుతోంది. మొత్తమ్మీద రాష్ట్ర ప్రభుత్వం తీరు అసలుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది.

    ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కని ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రాన్ని కాదని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ చేతుల్లోనే  పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు ప్రకటించిన తర్వాత దాని నిర్మాణం చేపట్టడానికి ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అథారిటీకి సహకరిస్తూ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయించుకునేలా చూడాలి.

    కానీ  నిర్మాణాన్ని తమకే అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తుండడం విస్తుగొలుపుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు తమ ద్వారానే సాగాలని, పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.
     
    అసలు మీకు ఇష్టం ఉందా.. లేదా..?

    ‘అసలు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం మీకు ఇష్టముందా... లేదా..?’ అని పోలవరం అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిందంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మేరకు పనులు చేశారు? ప్రాజెక్టు సైట్ వద్ద అన్నీ పాత పరిక రాలే ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన పనులేంటి? గడిచిన రెండేళ్ల కాలంలో ఎన్ని పనులు చేశారని అని సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు. అసలు మీకు ప్రాజెక్టు పూర్తి చేయడం ఇష్టముందా లేదా..?’ అంటూ పోలవరం అథారిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఆ లేఖకు సమాధానమివ్వలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అథారిటీని కూడా ఏర్పాటు చేసినందున ఇక నుంచి పనులను కేంద్రమే చేపడుతుందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్మాణ పనులు తమకే ఇవ్వాలని వాదించడంలో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
     
    కాంట్రాక్టర్ల కోసమే..

    కాంట్రాక్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం చేతుల్లోకి వెళ్తే నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అవకాశాలుంటాయి. పనుల్లో జాప్యం జరిగితే కేంద్రం ఏమాత్రం సహించదు. తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన సంస్థే ప్రస్తుతం పోలవరం కాంట్రాక్టు పనులు చేస్తోంది. ఆ కారణంగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా గత కొద్ది నెలలుగా అడ్డుపుల్లలు వేస్తున్నట్టు సమాచారం. ప్రాజెక్టును తామే నిర్మిస్తామని, కేవలం బిల్లును ఆమోదించడానికే పరిమితం కావాలంటే కుదరదని అథారిటీ అధికారులు అంటున్నారు.
     
    పట్టిసీమకు బాబు మినహాయింపు

    పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ‘ఐదు శాతం ఎక్కువ’ నిబంధన వర్తించదంటూ మినహాయింపు ఇచ్చారు. ఈపీసీ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో ఐదు శాతం ఎక్కువగా వచ్చిన టెండర్లను అనుమతించకూడదని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిబంధనలు ఖరారు చేస్తూ సాగునీటి శాఖ మోమో జారీ చేసింది. అయితే ఆ నిబంధన పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌కు అడ్డు వస్తున్నదని భావించిన సీఎం చంద్రబాబు... ఇది ప్రత్యేక ప్రాజెక్టు అయినందున ఐదు శాతం ఎక్కువ నిబంధన వర్తించదంటూ మినహాయింపు ఇచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ నిబంధనలో కూడా ఐదు శాతం ఎక్కువగా ఎవరైనా టెండర్ వేస్తే రద్దు చేయాలనే నిబంధనలను తొలగించారు.
     
    పోలవరం కోసం తపించిన వైఎస్..

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతో తపించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని అనుమతులు తేవడమే కాకుండా అప్పట్లోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేయడానికి రంగం సిద్ధం చేయించారు. వైఎస్ హయాంలోనే 25-02-2009న కేంద్రం పోలవరానికి పెట్టుబడి అనుమతులు మంజూరు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ముందుకు పంపింది. హైపవర్ కమిటీ 2009, ఆగస్టులో ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 16న ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి మరణించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన నాయకులెవ్వరూ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణం చేపడతామంటే రాష్ట్ర సర్కారు అభ్యంతరం చెబుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement