‘మూడో’ ముచ్చట
పట్టిసీమ ఎత్తిపోతలను మూడోసారి ప్రారంభించిన చంద్రబాబు
- ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసిన రెండు గంటలకే మోటార్ల నిలిపివేత
- పోలవరం కుడికాలువ పనులు పూర్తి కాకపోవడమే కారణం
- మీడియాలో వార్తలతో 2 మోటార్లను పాక్షికంగా ఆన్ చేసిన అధికారులు
- దశలవారీగా నీటిని వదులుతామని ముఖ్యమంత్రి ప్రకటన
- గతంలో రెండుసార్లు పట్టిసీమను ప్రారంభించిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మూడోసారి నీటి విడుదల రెండుగంటల ముచ్చటగానే ముగిసింది. ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేయడం తనకు కిక్కు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన కొద్దిసేపటికే ఆ కిక్కు దిగిపోయేలా అధికారులు మోటార్లు నిలిపివేశారు. ముఖ్యమంత్రి లాంఛనంగా 24 మోటార్లను ఆన్‌చేసి, ఇటుకులకుంట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, గోదావరి జలాల్లో పూలు చల్లి వెళ్లిన కొద్దిసేపటికే మోటార్లను అధికారులు ఆపివేశారు. ఆయన పోలవరంలో సమీక్షలో ఉండగానే పట్టిసీమ నీటి విడుదల ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ పనులు పూర్తికాకపోయినా గోదావరిలోకి వరద నీరు రావడంతో పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలోని ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 24 మోటార్లను ఆన్ చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఇటుకులకుంట వద్ద పోలవరం కుడి కాలువలో గోదావరి జలాలు కలిసే పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటిప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం పూజలు చేసి కాలువలో పూలు చల్లారు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వెళ్లిన కొద్దిసేపటికే అధికారులు ఎత్తిపోతల పథకం మోటార్ల స్విచ్ ఆఫ్ చేశారు. ముచ్చటగా మూడోసారి బుధవారం నిర్వహించిన ట్రయల్ రన్ కూడా రెండు గంటలకే ఆగిపోయిందని మీడియాలో వార్తలు రావడంతో రాత్రి పొద్దుపోయిన తరువాత రెండు మోటార్లను పాక్షికంగా ఆన్ చేశారు. గతేడాది ఆగస్టు 15న పట్టిసీమను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఏడాది మార్చి 28న పట్టిసీమ పంపులకు ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
పూర్తికాని పనులు
పట్టిసీమ నీరు తీసుకెళ్లాల్సిన పోలవరం కుడి కాలువ పనులు పూర్తికాలేదు. జానంపేట వద్ద అక్విడెక్ట్‌తోపాటు కృష్ణా జిల్లాలో రామిలేరుపై అక్విడెక్ట్ పనులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం వస్తే అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది కూడా జానంపేట వద్ద అక్విడెక్ట్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాంఛనంగా నీటి విడుదలను ప్రారంభించిన కొద్దిసేపటికే కట్టివేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటన ముగించుకుని వచ్చేనాటికి పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజి వరకూ చేరుకుంటే అక్కడ పవిత్ర నదీ సంగమం పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిదానంగా నీటిని వదలాలని నిర్ణయించారు. కాలువ కొత్తగా కట్టిందని, దానిపై కట్టడాలు కూడా కొత్తవి కావడంతో క్రమపద్ధతిలో నీటిని విడుదల చేస్తామని, దీన్ని వివాదం చేయకుండా ఉండేందుకు ముందుగానే చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పట్టిసీమ పూర్తవడం కిక్ ఇచ్చింది: సీఎం
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఏడాది కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం తనకు కిక్ ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ స్ఫూర్తితోనే త్వరలో పోలవరం ఎడమ కాలువపైనా ఎత్తిపోతల పథకం నిర్మించే విషయమై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పట్టిసీమ మోటార్లు ప్రారంభించాక గోదావరి జలాలు పోలవరం కుడి కాలువలో కలిసే ఇటుకులకుంట వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల కల నేడు సాకారమవుతోందన్నారు. ఏడాదిలోనే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గిన్నిస్ రికార్డు అని తెలిపారు. గోదావరి డెల్టాకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వకుండా ఈ ఏడాది 85 టీఎంసీల నీటిని కృష్ణాడె ల్టాకు తీసుకువెళ్తామని చెప్పారు.
అక్కడినుంచి కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమకు తీసుకువెళ్లే విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా, అనంతరం సోమశిల ఇలా నదులను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రజల సాగు, తాగు అవసరాలు తీర్చడంతోపాటు చెన్నై వాసులకు కృష్ణా జలాలతోపాటు గోదావరి జలాలను సరఫరా చేస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రానికే మణిహారమని, దీనిని కూడా పట్టిసీమ మాదిరిగానే పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. 2018 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు.