నీళ్లు లేవు, పెళ్లి వాయిదా | Marriages Pending For Water Problems in Karnataka | Sakshi
Sakshi News home page

నీళ్లు లేవు, పెళ్లి వాయిదా

Published Tue, May 14 2019 11:57 AM | Last Updated on Tue, May 14 2019 11:57 AM

Marriages Pending For Water Problems in Karnataka - Sakshi

బాగల్‌కోట జిల్లా బాదామి వద్ద తాగునీటి కోసం వెళ్తున్న యువకుడు

సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భయంకరమైన కరువు పీడిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల వాసులు వలస పోతున్నారు. పశువులు, గొర్రెలను సంతలో అమ్ముకుని బెంగళూరు, మైసూరు తదితర నగరాలకు వచ్చి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. వేసవి ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకూ తాగునీటి సమస్య ఎక్కువ కావడంతో జనాలు వలస వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,122 ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాగా పలు తోటల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో పంటలు కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గృహప్రవేశాలు, వివాహాలు కూడా వాయిదా దాఖలాలు అక్కడక్కడా చూడవచ్చు.

అన్నింటికీ సమస్యే  
ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల్లో జరగాల్సిన జాతరల హడావుడి నీటికొరతతో తగ్గిపోయింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు బం ధువుల ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బళ్లారిలో 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో బోర్లు ఎండిపోయాయి. కుళాయిల్లో నీళ్లు బంద్‌ అయ్యా యి. హోటళ్లు, హాస్టళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తే కానీ గొంతు తడవని పరిస్థితి నెలకొంది. ఉత్తర, మధ్య కర్ణాటకలోనే సమస్య అధికంగా ఉంది. 

అన్ని జిల్లాల్లో దాహాకారాలు  
ఆలమట్టి జలాశయం నుంచి విజయపుర జిల్లాకు నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ట్యాంకర్‌ నీటిపైనే ఆధారపడ్డారు.
భాగల్‌కోటె జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
బెళగావి జిల్లా చిక్కోడిలో ఈ ఏడాది మార్చి ఆరంభం నాటి నుంచి నీటి సమస్య ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 1,330 వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.  
దావణగెరె జిల్లాలో 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. దీంతో ట్యాంకర్‌లను అద్దెకు తీసుకుని నీళ్లు తరలిస్తున్నారు. ఈక్రమం లో నెలకు రూ.2.16 కోట్లు బాడుగ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
రాయచూరు జిల్లాలో తుంగ, కృష్ణా నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య వేధిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవల నాలుగు గ్రామాలకు మాత్రమే ట్యాంకర్‌ల ద్వారా నీటిని అందజేస్తున్నారు.  
తుమకూరు జిల్లాలో నీటి సమస్య నివారణ నిమిత్తం 505 బోరుబావులను ప్రక్షాళన చేశారు. అయితే 192 బావుల్లో నీళ్లు లభించలేదు. మిగతా వాటిలో నీళ్లు రావడంతో మోటార్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు.
బళ్లారి జిల్లాలో 10 రోజులకు ఒకసారి నీళ్లు లభిస్తున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నీటి సమస్య వేధిస్తోంది. నీటి కోసం వేసిన బోర్లలో 65 సఫలం కాగా.. 177 విఫలమయ్యాయి.  
దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు గత 2016 తరహాలో కరువు ఏర్పడింది. నగదు వెచ్చించినా నీళ్లు దొరకని పరిస్థితి. అంతేకాకుండా ట్యాంకర్‌ను ఉదయం బుక్‌ చేస్తే సాయంత్రానికి వస్తుంది. మూడు ట్యాంకర్లు ఆర్డర్‌ చేస్తే ఒక ట్యాంకర్‌ నీటిని పొందవచ్చు. గత 2016లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
శివమొగ్గ జిల్లాలో గాజనూరు, భద్ర, వరాహి, చక్ర, సావేహక్లు, లింగనమక్కి, తలకళలె ఆనకట్టలు ఉన్నా.. నీటి సమస్య ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 216 గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది.
ఉత్తర కన్నడ జిల్లాలో మూడు దశాబ్దాల తర్వాత నీటి కొరత అధికమైంది. అంకోలా, కారవార నగరాలకు గంగావళి నది నుంచి నీళ్లు వస్తాయి. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ నగరాలకు తొలిసారిగా నీటి సమస్య ఏర్పడింది.  
చిత్రదుర్గ జిల్లాలో నీటి కోసం నిత్యం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సమస్య మరింత తీవ్రం అవుతోంది తప్ప తగ్గుముఖం పట్టలేదు.  
కొప్పళ జిల్లాలో బహద్దూర్‌ బండి గ్రామంలో నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి. నిత్యం జగడం పడితే కానీ నీరు సంపాదించలేని పరిస్థితి. కొప్పళ నగరంలో 10 – 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.  
మైసూరు జిల్లాలో కావేరి, కబిని నదులు ఉన్నప్పటికీ నీటి సమస్య ఉంది. మైసూరు నగరంలో తాగునీటి సమస్య లేకున్నా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేధిస్తోంది.  
పనులు లేక వలసలు వెళ్లడం చూశాం.. కానీ నీళ్లు లేక వలస వెళ్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగిపోతోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు పది కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నదుల పక్కనున్న జిల్లాల్లోనూ కటకట నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement