draught
-
ఈసారి వానలు తక్కువే.. కరువుకు 20 శాతం ఛాన్స్! ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. చదవండి: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్ -
నీళ్లు లేవు, పెళ్లి వాయిదా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భయంకరమైన కరువు పీడిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల వాసులు వలస పోతున్నారు. పశువులు, గొర్రెలను సంతలో అమ్ముకుని బెంగళూరు, మైసూరు తదితర నగరాలకు వచ్చి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. వేసవి ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకూ తాగునీటి సమస్య ఎక్కువ కావడంతో జనాలు వలస వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,122 ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాగా పలు తోటల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో పంటలు కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గృహప్రవేశాలు, వివాహాలు కూడా వాయిదా దాఖలాలు అక్కడక్కడా చూడవచ్చు. అన్నింటికీ సమస్యే ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల్లో జరగాల్సిన జాతరల హడావుడి నీటికొరతతో తగ్గిపోయింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు బం ధువుల ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బళ్లారిలో 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో బోర్లు ఎండిపోయాయి. కుళాయిల్లో నీళ్లు బంద్ అయ్యా యి. హోటళ్లు, హాస్టళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తే కానీ గొంతు తడవని పరిస్థితి నెలకొంది. ఉత్తర, మధ్య కర్ణాటకలోనే సమస్య అధికంగా ఉంది. అన్ని జిల్లాల్లో దాహాకారాలు ♦ ఆలమట్టి జలాశయం నుంచి విజయపుర జిల్లాకు నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ట్యాంకర్ నీటిపైనే ఆధారపడ్డారు. ♦ భాగల్కోటె జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ♦ బెళగావి జిల్లా చిక్కోడిలో ఈ ఏడాది మార్చి ఆరంభం నాటి నుంచి నీటి సమస్య ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 1,330 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ♦ దావణగెరె జిల్లాలో 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. దీంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకుని నీళ్లు తరలిస్తున్నారు. ఈక్రమం లో నెలకు రూ.2.16 కోట్లు బాడుగ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ♦ రాయచూరు జిల్లాలో తుంగ, కృష్ణా నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య వేధిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవల నాలుగు గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నారు. ♦ తుమకూరు జిల్లాలో నీటి సమస్య నివారణ నిమిత్తం 505 బోరుబావులను ప్రక్షాళన చేశారు. అయితే 192 బావుల్లో నీళ్లు లభించలేదు. మిగతా వాటిలో నీళ్లు రావడంతో మోటార్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు. ♦ బళ్లారి జిల్లాలో 10 రోజులకు ఒకసారి నీళ్లు లభిస్తున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నీటి సమస్య వేధిస్తోంది. నీటి కోసం వేసిన బోర్లలో 65 సఫలం కాగా.. 177 విఫలమయ్యాయి. ♦ దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు గత 2016 తరహాలో కరువు ఏర్పడింది. నగదు వెచ్చించినా నీళ్లు దొరకని పరిస్థితి. అంతేకాకుండా ట్యాంకర్‌ను ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి వస్తుంది. మూడు ట్యాంకర్లు ఆర్డర్ చేస్తే ఒక ట్యాంకర్ నీటిని పొందవచ్చు. గత 2016లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ♦ శివమొగ్గ జిల్లాలో గాజనూరు, భద్ర, వరాహి, చక్ర, సావేహక్లు, లింగనమక్కి, తలకళలె ఆనకట్టలు ఉన్నా.. నీటి సమస్య ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 216 గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. ♦ ఉత్తర కన్నడ జిల్లాలో మూడు దశాబ్దాల తర్వాత నీటి కొరత అధికమైంది. అంకోలా, కారవార నగరాలకు గంగావళి నది నుంచి నీళ్లు వస్తాయి. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ నగరాలకు తొలిసారిగా నీటి సమస్య ఏర్పడింది. ♦ చిత్రదుర్గ జిల్లాలో నీటి కోసం నిత్యం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సమస్య మరింత తీవ్రం అవుతోంది తప్ప తగ్గుముఖం పట్టలేదు. ♦ కొప్పళ జిల్లాలో బహద్దూర్ బండి గ్రామంలో నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి. నిత్యం జగడం పడితే కానీ నీరు సంపాదించలేని పరిస్థితి. కొప్పళ నగరంలో 10 – 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ♦ మైసూరు జిల్లాలో కావేరి, కబిని నదులు ఉన్నప్పటికీ నీటి సమస్య ఉంది. మైసూరు నగరంలో తాగునీటి సమస్య లేకున్నా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేధిస్తోంది. ♦ పనులు లేక వలసలు వెళ్లడం చూశాం.. కానీ నీళ్లు లేక వలస వెళ్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగిపోతోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు పది కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నదుల పక్కనున్న జిల్లాల్లోనూ కటకట నెలకొంది. -
అనంతలో ఆకలి చావు
-
అన్నంలేక మన్ను తిన్న చిన్నారి మృతి
కదిరి మండలంలో ఆకలిచావు నమోదైంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యంపాలై కన్నుమూసింది. మూడు రోజుల క్రితం జరిగిన హృదయవిదారకర ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కదిరి అర్బన్: కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. కూలినాలి చేసుకుని జీవించే వీరికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. నీలవేణి అక్క కూతురును కూడా తమవద్దే పెంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లలోపు వయసు కలిగిన శ్రీను,, అంజలి, వనిత, ఇంకా పేరు పెట్టని ఏడాది వయసుపాప ఉన్నారు. ఏడాది కిందట ఒక పాప అనారోగ్యంతో చనిపోయింది. మూడు రోజుల క్రితం రెండేళ్ల వయసు కలిగిన మరో పాప (నీలవేణి అక్క కూతురు) ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై మృతి చెందింది. వీరున్న గుడారం పక్కనే పాపను పూడ్చారు. దయనీయం.. మహేష్‌కు ఎప్పుడో ఓసారి మాత్రమే కూలి పని దొరుకుతోంది. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఇల్లు లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట వీధుల్లో పడుకుంటున్నారు. పగలు ఎండవేడిమికి తట్టుకోలేక చెట్ల కింద ఉంటున్నారు. ఆకలి తీర్చేవారి కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఏడాది పాపకు ఏడవడానికి కూడా శక్తిలేదు. బాలల హక్కులను కాపాడడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అందరూ చెపుతుంటారు. ప్రభుత్వం బాలల హక్కుల చట్టాలను అమలు చేస్తోందా అన్న ప్రశ్న ఈ పిల్లలను చూస్తే కలుగుతుంది. స్పందించిన ఎస్ఐ, చైల్ట్‌లైన్ సిబ్బంది మహేష్ కుటుంబ దీనావస్థను స్థానికుల ద్వారా తెలుసుకున్న కదిరి రూరల్ ఎస్ఐ వెంకటస్వామి చలించిపోయారు. ఆ కుటుంబానికి ఉండడానికి ఒక గదిని తన స్వంత డబ్బులతో నిర్మిస్తానని ముందుకు వచ్చారు. అలాగే చైల్డ్‌లైన్ 1098 కో ఆర్డీనేటర్ శ్రీనివాసులునాయుడు కూడా స్పందించారు. మహేష్ పిల్లల్లో ముగ్గురు ఆరోగ్యరీత్యా ప్రమాదపుటంచున్న ఉన్నారని, వీరిని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి సురక్షితమైన వసతిగృహంలో ఉంచి మెరుగున వైద్యం, విద్య అందించే ఏర్పాటు చేస్తానన్నారు. దాతలు ముందుకు వస్తే ఇలాంటి పిల్లలను ఆదుకున్నట్లవుతుందన్నారు. -
భోజనం కరువు
అవగాహన లేమి.. అధికారుల అత్యుత్సాహం.. పాలకుల నిర్లక్ష్యం వెరసి మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలైంది. కరువు మండలాల్లో ప్రారంభమైన రెండో రోజే పాఠశాలలన్నీ వెలవెలబోయాయి. ఎండదెబ్బకు పిల్లల హాజరు శాతం తక్కువగా కనిపించింది. దీనికితోడు 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు బియ్యం సరఫరా చేయలేదు. ఏం చేయాలో దిక్కుతోచక భోజన కార్మికులు చేతులెత్తేశారు. ఉపాధ్యాయులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు పస్తులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో 2016–17లో కరువు మండలాలన్నింటిలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అప్పుడు చాలామంది విద్యార్థులు హాజరుకాలేదు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులుఆదేశించారు. ఈ నెల 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించిన తర్వాత మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ పథకానికి ఆదరణ లేకుండా పోయింది. ఏ పాఠశాలలో చూసినా పదుల సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో అయితే ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 15 శాతం దాటని హాజరు జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో 15 శాతం కూడా హాజరుకావడం లేదని సమాచారం. గంగాధరనెల్లూరు మండలంలో శుక్రవారం 107 స్కూళ్లకు 67 స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు. ఆయా పాఠశాలల్లో 175 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 18 మోడల్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోనూ అదే పరిస్థితి. మధ్యాహ్న భోజనం అమలవుతున్న మండలాల్లో పాఠశాలల వారీగా చూస్తే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఒకటి, రెండు సంఖ్యల్లో వస్తున్నారు. ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో అసలు విద్యార్థులే రావడం లేదని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకంపై గ్రామాల్లోని ఎస్ఎంసీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సంబంధిత ఎంఈఓలు అవగాహన కల్పిస్తే గానీ హాజరుశాతం పెరిగే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది బియ్యం సరఫరా గత విద్యా సంవత్సరంలో వేసవి సెలవుల్లో మధాహ్న భోజనాన్ని పెట్టకుండా విద్యార్థులకు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ ఏడాది అలా చేయలేదు. మధ్యాహ్న భోజనాన్ని కచ్చితంగా పెట్టాలని నిర్ణయించారు. ఒకవైపు శ్రమ, మరో వైపు నిధుల దుబారా తప్పితే ఒరిగేదేమీ లేదని విద్యావేత్తలు అంటున్నారు. గత ఏడాదిలాగే బియ్యం, కోడిగుడ్లను సరఫరా చేసి ఉంటే, ఇళ్లలో చేసుకుని తినేవారని చెబుతున్నారు. పాఠశాలలకు సరఫరాకాని బియ్యం జిల్లాలోని 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు ఇప్పటికీ బియ్యం సరఫరా చేయలేదు. ఆయా పాఠశాలల్లో భోజన పథకం అమలు కావడం లేదు. జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయం నుంచి కరువు మండలాలుగా నిర్ణయించిన పాఠశాలలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. 2016–17లో వేసవిలో పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యానికి విద్యాశాఖ నుంచి ఇప్పటికీ నిధులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ సారి చాలా పాఠశాలలకు బియ్యం సరఫరా చేయకుండా అలసత్వం చూపిస్తున్నట్లు సమాచారం. బియ్యం, పప్పు పిల్లలకు ఇచ్చేస్తే మేలు కరువు మండలాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు బియ్యం, పప్పు, కోడిగుడ్డు ఇచ్చేస్తే మేలు. 2016 వేసవి సెలవుల్లో అలా చేశారు. ఈసారేమో మధ్యాహ్న భోజనం పెట్టే పద్ధతిని అమలు చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు హాజరుకావడం లేదు. ఇలా చేస్తే ఎవరికి లాభం. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు పునరాలోచించి మరో నిర్ణయం తీసుకుంటే మేలు కలుగుతుంది.– గిరిప్రసాద్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దూరం నుంచి విద్యార్థులు రాలేకపోతున్నారు మండలాల్లో విద్యార్థులు హైస్కూల్‌కు రావాలంటే సమీపంలోని 5 కి.మీల నుంచి రావాల్సి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోతున్నారు. ఎండల తీవ్రత వల్ల వేసవి సెలవులు ఇచ్చారు. ఇప్పుడేమో పాఠశాలలకు వచ్చి భోజనం చేసి వెళ్లమంటే ఎలా. విద్యార్థులు స్కూళ్లకు సైకిళ్లు తొక్కుకొని, నడిచి రావాల్సి ఉంటుంది. వారిని ఎండలో ఇబ్బంది పెట్టడం సరికాదు. పర్యవేక్షణ చేసే టీచర్లకు గౌరవవేతనం రూ.2 వేలు ఇస్తామన్నారు. అలా కాకుండా నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో పనిచేసే టీచర్లకు ఈఏలు ఇవ్వాలి. – జీవీ రమణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఓటా.. నోటా!
సాక్షి , అనంతపురం : కరువు కోరల్లో చిక్కుకొని.. ఏళ్ల తరబడి కష్టాల ఊబిలో కూరుకుపోయిన జిల్లా అనంతపురం. ఇక్కడి పేదరికాన్ని, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని కొందరు నేతలు వేల కోట్లకు పడగలెత్తారు. కానీ ఈ నేతల రాజకీయ ఆరంభంలో ఓటేసిన ప్రజలు ఆ రోజు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉండిపోయారు. కారణం మోసం. పాతికేళ్ల కిందట కమ్యూనిస్టుల పేరు చెప్పి, ఉద్యమం పేరుతో అడవుల్లో ఉండి, రాజకీయ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేతలు, వారి కుటుంబాలు, బంధువులు తరతరాలు బతికేందుకు సరిపడా ఆస్తుల్ని సంపాదించారు. వారి నియోజకవర్గంలోని పేదప్రజలు మాత్రం మూడుపూటల మూడువేళ్లూ నోట్లోకి వెళ్లలేక అర్ధాకలితో బతుకీడిస్తున్నారు. దీనిపై ఓటర్లు ఆలోచించాలి. రంగుల ప్రపంచంలో ఉంటూ, తండ్రి పేరుతో పదవులు దక్కించుకుని, అధికారం దక్కిన తర్వాత నమ్ముకున్న ప్రజల బాగోగులను గాలికి వదిలి అదే రంగుల ప్రపంచలో కోట్లు సంపాదిస్తూ, ఇక్కడ తన తరఫున పీఏలను పెట్టి పాలిస్తున్న పాలకులూ ఉన్నారు. ఇలాంటి నేతలకు ఓటుతో బుద్ధిచెప్పాలి. భూస్వామ్య పాలన, పెత్తందారీ వ్యవస్థను కొనసాగిస్తున్న కుటుంబాలు.. అధికారం వస్తే మనుషులను నరికేందుకు అనుమతి ఇస్తామనే అరాచకశక్తులు.. ఓ ప్రాంతానికి నియంతలుగా, రౌడీలుగా చెప్పుకుని, చికెన్ నుంచి ఫ్యాక్టరీల వరకు ఏది నడవాలన్నా కప్పం కట్టాల్సిందే అని వేలకోట్లకు పడగలెత్తి వారు, వారి వారసులే రాజకీయాల్లో ఉండాలనుకునే నేతలు.. సామాన్యులు వారి కాళ్లకింద చెప్పుల్లా.. చేతిలో వేటకొడవళ్లలాగానే ఉండాలని ఆలోచించే మనుషులు.. ఇలా ఎవరికి వారు స్వలాభం మినహా ప్రజల బాగోగులు పట్టని పాలకులు. వీరందరి పాలనను ఒక్కసారి ఆలోచించాలి. ఐదేళ్లు ఏంచేశారనేది గుర్తెరగాలి. ఏం చేశారని మనసును ప్రశ్నించు: కరువు జిల్లాలో బంగారు పంటలు పండించేందుకు ఓ మహానుభావుడు కృష్ణాజలాలను 2012లో జీడిపల్లికి తీసుకొస్తే ఐదేళ్లుగా ఆయకట్టుకు ఇవ్వకుండా కొందరు మోసం చేశారు. రైతుల బతుకులపై నీళ్లు చల్లారు. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల, ఛాగళ్లు, పెండేకల్లు, పేరూరు, బీటీపీ చెప్పుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా.. దేనికింద పది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. జిల్లాలోని ఎస్కేయూ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలో ఏటా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని పట్టాలు చేతిలో పట్టుకుని వస్తున్నారు. వీరందరికీ ఉద్యోగాలు లేవు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ చేదోడుగా నిలుస్తామని మాట ఇచ్చిన వారు ఐదేళ్లు కన్పించకుండా పోయారు. కష్టాల్లో ఉన్నాం.. డ్వాక్రా రుణాలు మాఫీ అయితే కాస్త ఉపశమనం ఉంటుంది అని ఆశపడిన ఆడబిడ్డలను మోసం చేశారు. పదిమందికి అన్నం పెట్టె రైతులకు ‘బంగారు’ మాటలు చెప్పి, రుణాలు మాఫీ చేస్తామని, చేయకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టి ఉరికొయ్యల వరకూ తీసుకెళ్లిన ఘటన రైతుల మనసుల్లో మెదలుతూనే ఉంది. 274 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు, కుటుంబాలు వీధినపడ్డాయి. ఇలా మోసపు మాటలతో దగా పడ్డారు. జిల్లా అభివృద్ధికి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఎన్నికల ముందు, తర్వాత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చేయని వైనంపై రగిలిపోతున్నారు. భూములు కబ్జా చేసిన అక్రమార్కులు.. రక్తపాతాన్ని పెంచి పోషించే రౌడీలు.. అవినీతి సొమ్ముతో జల్సా చేసే అసమర్థులు.. స్వార్థచింతన మినహా ప్రజా శ్రేయస్సు పట్టని నేతలు అందరినీ ‘అనంత’ ప్రజానీకం చూసింది. అలాగే ప్రజాసేవ కోసం ఉద్యోగాలు త్యాగం చేసిన వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులనూ చూస్తోంది. రెండు వర్గాల్లో దేనికి ఓటేస్తారో.. మంచేదో, చెడేదో ఓటర్లు నిర్ణయించుకోవాలి. మాయా ప్రపంచమా? మాట ఇస్తే తప్పకుండా ప్రజల కోసం వెన్నుచూపని ధీరత్వ నాయకత్వమా? ఓటర్లే తేల్చుకోవాలి. ఇంటి నుంచి కదిలి.. పోలింగ్ బూత్‌కు వెళ్లి.. తీర్పు ఇవ్వాలి. మీరిచ్చే తీర్పు మీ బిడ్డ భవిష్యత్తు కోసం.. నీ ఇంటి ఆర్థిక స్వావలంబన కోసం.. మీ పల్లె, మీ మండలం, మీ జిల్లా.. ఏకంగా రాష్ట్ర భవిష్యత్ కోసం.. వెలుగుల సూరీడికి అండగా నిలువు. నీ భవిష్యత్తులో కాంతిరేఖను కాంక్షించు. -
కరువు బంద్‌పై కాఠిన్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/కల్లూరు(రూరల్): బంద్ అంటేనే భయపడే స్థితికొచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ తమ లోపాలు, అవకతవకలు, అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలుస్తాయోనని అప్రమత్తమవుతోంది. ఎవరు రోడ్డుమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసినా అరెస్టులకు పూనుకోంటోంది. రాయలసీమలో నెలకొన్న కరువుతో అల్లాడిపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని వామపక్షాలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపును పోలీసులను ప్రయోగించి విఫలం చేసేందుకు ప్రయత్నించింది. ఉదయం ఐదు గంటల నుంచే బస్సు డిపోల ఎదుట ఆందోళనలకు దిగిన నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించిన ఆందోళనలలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా, వ్యాపార, వాణిజ్య సమూదాలు మూతపడడంతో బంద్ విజయవంతమైందని వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. రహదారుల దిగ్బంధం.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ,సీపీఎం, జనసేన వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వారికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ, ఐద్వా, పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కంగాటి శ్రీదేవి మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె దూదేకొండ, హోసూరులో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. దూదేకొండలో ఎద్దుల బండ్లను రోడ్డుకు అడ్డంగా ఉంచి దిగ్బంధం చేయగా హోసూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదోనిలో తెల్లవారుజామునే డిపోల నుంచి వచ్చే బస్సులను అడ్డుకోవడంతో సీపీఐ, సీపీఎం నాయకులను అరెస్టు చేశారు. డోన్, బనగానిపల్లెలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. కర్నూలులో తొమ్మిది గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ, సీపీఎ జిల్లా కార్యదర్శులు కె.గిడ్డయ్య, ప్రభాకరరెడ్డిలతోపాటు 30 మంది అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లావ్యాప్తంగా 270 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో జరిగిన ఆందోళనలలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం... కరువు రైతు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఇచ్చిన కరువు బంద్ విజయవంతమైందని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి, గిడ్డయ్య ప్రకటించారు. పోలీసులతో బంద్‌ను విఫలం చేసేందుకు సర్కార్ యత్నించిన ఎక్కడికక్కడే రైతులు, గ్రామీణ పేదలు రోడ్లమీదకు వచ్చి ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను అడ్డుగా పెట్టి నిరసన తెలిపారన్నారు. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఎకరాకు రూ.25 వేలు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కన్నీళ్లు పెట్టించిన కరువు
అనంతపురం అగ్రికల్చర్: ఎండిపోయిన పొలాలు.... నెర్రలు చీలిన భూములు...నీళ్లు లేని బావులు చూసి జిల్లాలో కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర బృందం) సభ్యులు అమితవ్చక్రవరి, ముఖేష్‌కుమార్ చలించిపోయారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల వాస్తవ నివేదికలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. వర్షాభావంతో ఖరీఫ్ దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం 63 మండలాలను కరువు జాబితాలో ప్రకటించిన నేపథ్యంలో కరువు పరిస్థితులు, రైతుల స్థితిగతులు తెలుసుకునే నిమిత్తం కేంద్ర బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు ఉదయం 11.20 గంటలకు గోరంట్ల చేరుకుని అక్కడి నుంచి పెనుకొండ, రాప్తాడు, అనంతపురం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించి రాత్రి చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. అంతకుముందు కేంద్ర బృందం సభ్యులు వేరుశనగ, పండ్లతోటలు, పప్పుశనగ, పాడి, పశుపోషణ, తాగునీరు, సాగునీరు అంశాల గురించి అధికారులు, రైతులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరువు నివారణను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యామ్నాయ వ్యవసాయం ఏమిటి, పశుశిబిరాలు ఏర్పాటు చేశారా...? తాగునీటి కొరతను ఎలా అధిగమిస్తారు... సాగునీటి పరిస్థితేంటి...? రైతులకు ఏఏ రూపంలో పరిహారం ఇస్తున్నారు...? తదితర అంశాలపై ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. జేసీ–2 హెచ్.సుబ్బరా>జు, వ్యవసాయశాఖ జేడీ ఎస్కే హబీబ్‌బాషా, పశుశాఖ జేడీ సన్యాసీరావు, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, హిందూపురం ఏడీ ఎం.రవి ఇతరశాఖల అధికారులు బృందం వెంట ఉన్నారు. కేంద్ర బృందం పర్యటన సాగిందిలా... ♦ ఉదయం 11.20 గంటలకు గోరంట్ల మండలం మల్లాపురం, కొత్తపల్లి గ్రామాలకు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు స్థానిక రైతు గంగప్పతో మాట్లాడారు. నాలుగు ఎకరాల్లో నాలుగు పళ్లాలు విత్తనాలు వేసి రూ.70 వేలు ఖర్చు చేసినా చివరకు నాలుగు బస్తాలు వేరుశనగ పండిందని, అంతా కలిపినా రూ.5 వేలు కూడా వెనక్కిరావడం లేదని రైతు వాపోయాడు. అలాగే బోరులో నీళ్లు రాక మల్లెతోట కూడా ఎండిపోయిందన్నాడు. ఈ ప్రాంతంలో 800 అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావడం లేదని నరసింహప్ప, గోవిందరెడ్డి తదితరులు బృందం దృష్టికి తీసుకెళ్లారు. ♦ మధ్యాహ్నం 12.30 గంటలకు పెనుకొండ విద్యుత్‌సబ్‌స్టేషన్‌కు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు అక్కడున్న ఫిజోమీటర్ను పరిశీలించి భూగర్భజలాల స్థితిగతులు ఆ శాఖ డీడీ పురుషోత్తమరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత నీటి మట్టం రూ.49 మీటర్లు ఉండగా... గతేడాది ఇదే సమయంలో 27 మీటర్లు ఉండటంపై ప్రశ్నించారు. గతేడాది మంచి వర్షాలు పడటం, గొల్లపల్లి రిజర్వాయర్‌లో నీటిమట్టం ఉన్నందున గతేడాది పరిస్థితి బాగానే ఉందన్నారు. ♦ మధ్యాహ్నం 1 గంటకు పెనుకొండ మండలం అడదాకులపల్లి సమీపంలో ఎండిపోయిన పప్పుశనగ పంటను చూశారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధికూలీలు, రైతులతో మాట్లాడారు. ఉపాధి పనిదినాలు 250 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ రూ.300 ప్రకారం చెల్లించాలని శ్రీనివాసులు, కొండారెడ్డి మరికొందరు కూలీలు కోరారు. ఉపాధిహామీ పథకం తీరుతెన్నుల గురించి డ్వామా పీడీ జ్యోతిబసు తెలిపారు. ♦ అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పెనుకొండ మండలం అమ్మవారుపల్లికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు.. అక్కడ తాగునీటి సమస్యను తెలుసుకున్నారు. మూడేళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వ్యవసాయ తోటల దగ్గరకెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ నారాయణస్వామి వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. గ్రామజనాభా ఎంత..? ఎన్ని లీటర్లు అవసరం... ఎన్ని ట్యాంకులు సరఫరా చేస్తున్నారనే వాటిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్నాయక్ను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి సరైనా సమాధానాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ♦ మధ్యాహ్నం 3.15 గంటలకు రాప్తాడు మండలం రామినేపల్లిలో అంగన్వాడీ సెంటరును కేంద్ర బృందం పరిశీలించింది. ♦ 3.30 గంటలకు రాప్తాడు మండలం బొమ్మేపర్తి క్రాస్‌లో రైతు రవికి చెందిన వేరుశనగ పొలాన్ని పరిశీలించారు. వేరుశనగ మొక్కలు పెరికి చూడగా చెట్టుకు ఒక కాయ కూడా కనిపించకపోవడంతో చలించిపోయారు. పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర బృందం సభ్యులు అంగీకరించారు. ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేసి ఐదెకరాల్లో వేరుశనగ వేయగా పరిస్థితి ఇలా ఉండటంతో తొలగించడానికి కూడా ఇబ్బందిగా ఉందని రైతు రవి తెలిపాడు. ♦ సాయంత్రం 4.30 గంటలకు అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులకు 6.15 గంటల వరకు కలెక్టర్ వీరపాండియన్, జేసీ ఢిల్లీరావు తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కరువు పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కాసేపు సమావేశం నిర్వహించారు. జిల్లాకు తక్షణ సాయంగా రూ.1,622.72 కోట్లుసాయంప్రకటించాలని కరువు నివేదిక సమర్పించారు. అందులో ఖరీఫ్ పంట నష్టానికిరూ.967.14 కోట్లు ఇన్పుట్ ఇవ్వాలని కోరారు. మొత్తమ్మీద వ్యవసాయశాఖకు రూ.1,042.92 కోట్లు, ఉద్యానశాఖకు రూ.46.78 కోట్లు, పట్టుశాఖకు రూ.1.65 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.99.93 కోట్లు, డ్వామాకు రూ.352.76 కోట్లు, మైనర్‌ఇరిగేషన్‌కు రూ.36.12 కోట్లు, పట్టణ తాగునీటి పథకానికి రూ.10.56 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.31.99 కోట్లు అవసరమని నివేదించారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ూ రాత్రి 7 గంటలకు బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లైట్ల వెలుగుల్లో ఎండిన వేరుశనగ పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు అక్కడే రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న హార్సిలీహిల్స్‌కు పయనమయ్యారు. -
జలం జాడేది?
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి నీటి కరువు ముంచుకొస్తోంది. భూగర్భ జలాలు శరవేగంగా పడిపోతున్నాయి. శీతాకాలంలోనే ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుండడం గమనార్హం. ఈ సారి నైరుతి రుతుపవన సీజన్లో నగరంలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం.. కురిసిన అరకొర వర్షపు నీరు సైతం భూగర్భంలోకి ఇంకే అవకాశం లేకపోవడంతో అక్టోబర్ మాసంలోనే పాతాళగంగ అథఃపాతాళంలోకి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వేసవిలో భూగర్భజలాల లభ్యతపై ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా గ్రేటర్లో అక్టోబర్ నాటికి సరాసరిన 3.28 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ కనిపిస్తుంది. కానీ ఈసారి ఏకంగా 7.39 మీటర్ల లోతునకు వెళితేగాని నీటి ధారల జాడ కనిపించని పరిస్థితి. అంటే సాధారణం కంటే 4.11 మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో గతేడాది 10.28 మీటర్ల లోతున నీరు ధారలు టిలభించగా.. ఈసారి 17.12 మీటర్ల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ జిల్లాలోనూ సరాసరిన 6.84 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడంగమనార్హం. పాతాళంలోకి భూగర్భజలాలు గ్రేటర్ పరిధిలో పలు మండలాల్లో గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో నీటిమట్టాలు అనూహ్యంగా తగ్గిపోయాయి. ప్రధానంగా నైరుతి సీజన్లో నమోదు కావాల్సిన వర్షపాతంలో 31 శాతం మేర తగ్గిపోవడం.. కురిసిన అరకొర వర్షం నీరు సైతం నేలలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి చేరడానికి ప్రధాన కారణమని భూగర్భ జలశాఖ నిపుణులు ‘సాక్షి’కి తెలిపారు. మహానగరం పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 14 లక్షలుకాగా.. ఇంకుడు గుంతలు లక్షకు మించి లేకపోవడం.. మరోవైపు విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను తోడేస్తుండడంతో ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. నిరాశాజనకంగా నైరుతి.. ఈసారి నైరుతి రుతుపవనాలు గ్రేటర్‌ను నిరాశపరిచాయి. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో జూన్–సెప్టెంబర్(నైరుతి రుతుపవనాల కాలం) మధ్యలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు జలాశయాల్లో వర్షపునీరు చేరే దారిలేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా నైరుతి సీజన్లో 580.9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం 401.7 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 31 శాతం తక్కువగా నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 525.9 మిల్లీమీటర్లు కాగా.. ఈ సీజన్లో కేవలం 386.8 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. పెరుగుతోన్న వేడిమి.. నైరుతి రుతుపవనాలను తిరోగమించడంతో ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం నగరంలో 32.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండవేడి ప్రభావం కనిపించింది. మరోవైపు గాలిలో తేమశాతం 65 శాతం నుంచి 50–55 శాతానికి పడిపోయింది. దీంతో వాతావరణంలో వేడిమి పెరిగి చర్మం, కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో గ్రేటర్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
రైతు గోడు పట్టాదా?
అనంతపురం సిటీ: అధికార పార్టీకి చెందిన వారైనా సరే..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాల్సి వచ్చింది. జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తున్నా..ప్రభుత్వం 44 మండలాలనే కరువు జాబితాలో చేర్చడంతో సందిగ్ధంలో పడిన అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గురువారం జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. సమావేశంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి పాల్గొనగా...వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్యుత్, పశుసంవర్థకశాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమయం లేకపోవడంతో విద్య, వైద్యం, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ, అటవీశాఖలపై చర్చ జరలేదు. రైతుల జీవితాలతో ఆడుకుంటారా..? తీవ్ర వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ బీళ్లుగా మారాయని....అక్కడక్కడా విత్తనాలు వేసినా..అవి మొలకెత్తలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 44 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చడంపై సభ్యులు మండిపడ్డారు. ఇలా నివేదికలు ఎలా పంపారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిలు వ్యవసాయశాఖ జేడీపై మండిపడ్డారు. గతేడాది రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నేటికీ రైతులకు అందలేదనీ... తక్షణం వారికి ఈ డబ్బు చేతికందితే కొంత భరోసా ఉంటుందన్నారు. స్పందించిన జేడీ మాట్లాడుతూ, జూన్‌లో కొంతమేర వర్షాలు కురవడంతో నివేదిక ఇలా పంపామనీ, ప్రస్తుతం 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నివేదిక సిద్ధం చేశామన్నారు. విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి వందశాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని సభ్యులు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. వాతావరణ బీమా ‘అనంత’ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కాలువ స్పందిస్తూ.. ఈ పథకంపై సీఎంకు అవగాహన ఉందనీ, త్వరలోనే ఆయన వాతావరణ బీమాలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే యోచనలో ఉన్నారన్నారు. ఇక పశుక్రాంతి పథకం ద్వారా ఈ వాతావరణానికి అలవాటు లేని పశువులను అధికారులు తీసుకువస్తున్నారనీ, దీంతో అవి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతోందని సభ్యులు అన్నారు. అలా కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పశువులను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. స్పందించిన మంత్రి కాలవ..సభ్యుల కోరిక మేరకు తప్పకుండా మార్పు చేస్తామన్నారు. కల్తీ జరుగుతున్నా..కట్టడి చేయలేకపోతున్నారు మార్కెట్లో పాలు, నెయ్యి, చివరికి నీరు కూడా కల్తీ చేస్తున్నా...అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని సభ్యులు ధ్వజమెత్తారు. తక్షణం కల్తీలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు.. ..ఆహారకల్తీ విభాగానికి ఒకే అధికారి ఉన్న కారణంగా కేసులు ఎక్కువగా నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇకపై కల్తీలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్లు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపాజిట్లు చేస్తేనే రుణాలిస్తారా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు రుణాల మంజూరులో పలు బ్యాంకుల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తేనే రుణాలిస్తామంటూ మొండిగా వాదిస్తున్నారన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్...వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే అనంతపురం శివారుల్లో జాతీయ రహదారి నిర్మాణంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ అన్నారు. స్పందించిన జేసీ..తానే స్వయంగా గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పార్థసార థి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయ చౌదరి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. కరుణానిధి మృతికి నివాళి సమావేశం ప్రారంభం కాగానే అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తీర్మానాలివీ... ♦ జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి. ♦ జిల్లాలోని 1,468 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఆయా పాఠశాలల్లో మొక్కలు పెంచి..సంరక్షణ అటవీశాఖ చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాలోని అన్ని చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేయాలి. ♦ అనంతపురం, గుత్తి, రాయదుర్గంలోని జెడ్పీ స్థలాల్లో రూ.61 లక్షలతో గదులు నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వాలి. ♦ రాయదుర్గం మండలం, వీరాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా విభజించాలని తీర్మాణాలు చేశారు. -
వానమ్మా.. వచ్చిపోమ్మా!
ఒంగోలు సబర్బన్: జిల్లా రైతన్న కంటతడి పెడుతున్నాడు. ఆకుపచ్చని చీరకట్టినట్టు పచ్చదనం పరుచుకోవాల్సిన పంట పొలాలు బోసిపోయి బీటలు వారి చినుకు కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక వైపు ప్రకృతి, మరో వైపు పాలకులు రైతన్న జీవితాలతో పరిహాసమాడుతున్నారు. గతేడాది సాగును సగానికి తగ్గించుకొని ఆత్మస్థైర్యం కోల్పోయిన కొంతమంది రైతులు ఆత్మహత్యల వైపు అడుగులేశారు. ఇంకొంత మంది వలసబాట పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. జూన్ 15 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతాంగం చినుకు కోసం ఆకాశం వైపు మోరెత్తుకొని చూస్తున్నారు. ఆకాశంలో మేఘాలు అలా కమ్ముకుంటున్నాయి.. రెప్పపాటులో తిరిగి మాయమవుతున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నప్పుడల్లా రైతాంగం ముఖాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతలోనే నిరాశమిగిలుతోంది. వెంటనే ఎండలు మంటలు రేపుతున్నాయి. ఇది జిల్లాలోని రైతాంగం పరిస్థితి. చినుకు రాలుతుందో లేదోనన్న ఆందోళనలో రైతాంగం సతమతమవుతోంది. దానికి తోడు నకిలీ విత్తనాలు ఎక్కడ కొంపముంచుతాయోనన్న బెంగ రైతన్నను వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు లేకపోవడంతో పంటలు వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా వాటిని కొనుగోలు చేసి ఏం చేసుకోవాలని రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాగానే సాధారణంగా జూన్, జూలై మాసాల్లో పొలాలను సాగుకు సిద్ధం చేసుకునేందుకు ఉపక్రమిస్తారు. దుక్కులు దున్నటం, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం చేసుకోవటం, విత్తనాలు, ఎరువులు సేకరించటం, కొత్త రుణాలతో ఊపిరి సలపని పనుల్లో సతమతమవ్వాల్సిన రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లుగా దుర్భిక్షమే జిల్లాను నాలుగేళ్లుగా దుర్భిక్షం వెంటాడుతూనే ఉంది. ఏటా జిల్లా మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతూనే ఉంది. గతేడాదిలో జిల్లాలోని 56 మండలాల్లో చీరాల మండలం మినహా 55 మండలాలూ కరువు మండలాలే. తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతూ వచ్చాయి. భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. అటు సాగు, ఇటు తాగు నీటికి కొరత ఏర్పడింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి పోయాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కూడా వచ్చి జిల్లాలో పర్యటించి వెళ్లింది. జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కరువు బృందానికి ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిస్థితిని కళ్లకు గట్టారు. ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్లిన కరువు బృందం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి మరీ జిల్లా నుంచి వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రస్తుత ఖరీఫ్ సాధ్యం కాదన్న భయం రైతుల్లో ఏర్పడింది. అయినా గత బాధలు...కష్టాలు ఎలా ఉన్నా...ప్రతి సీజన్‌కు సమాయత్తం కావటం హలదారునికి కొత్తేమీ కాదు. ఖరీఫ్‌లో వరి పంట విస్తీర్ణం చాలా తక్కువ. మెట్ట పంటలు అధికంగా వేస్తారు. గతేడాది ఖరీఫ్ లక్ష్యంలో 50 శాతం కూడా విస్తీర్ణం సాగులోకి రాలేదు. వేసిన పంటలు కూడా వర్షాలు లేక దిగుబడి కూడా 30 శాతం కూడా రాలేదు. ఈ సంవత్సరం ఖరీఫ్ లక్ష్యం 2.28 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం. ఖరీఫ్‌లో ప్రధానంగా 70 వేల హెక్టార్లలో కందులు, 40 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. వాటితో పాటు వరి, జొన్న, సజ్జ, మినుము, పెసరతో పాటు పలురకాల మెట్ట పైరులు వేస్తారు. ఇప్పటికే భూసార పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 3.61 లక్షల మట్టి నమూనాల పరీక్షల ఫలితాల పత్రాలను రైతులకు అందించారు. మరో 3.61 లక్షల మట్టి నమూనా ఫలితాలు అందించాల్సి ఉంది. 75 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను అందించేందుకు 6,500 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. మూడు వేల క్వింటాళ్ల కంది, వేరుసెనగ, మినుము, పెసర విత్తనాలు కూడా సిద్ధం చేశారు. -
డెడ్ స్టోరేజ్..!
మోపాడు (పామూరు): కరువు తరుముతోంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకోని నీళ్ల కోసం దీనంగా నోరు తెరిచి ఎదురుచూస్తున్నాయి. వీటి పరిధిలోని వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక బీడు భూములుగా మారడంతో అన్నదాతకు పూట గడవటం కష్టంగా మారి కూలీలుగా మారుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండల పరిధిలోని మోపాడు రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ఏడేళ్లుగా సాగుకు నోచుకోని ఆయకట్టు భూములు.. మండలంలోని మోపాడు రిజర్వాయర్ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు అడుగంటింది. గత 7 ఏళ్లుగా ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక రైతన్నకు ఈ రిజర్వార్ దన్నుగా నిలవలేకపోతోంది. ఈ ప్రాంతంలో కరువును పారదోలేందుకు స్వాతంత్య్రానికి పూర్వం అప్పటి బ్రిటీష్ పాలకులు మోపాడు 1906లో రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించి 1921 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి నీటిని ఆయకట్టుకు వదిలారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మోపాడు రిజర్వాయర్‌కు ప్రధానంగా నీరుచేరాలంటే కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం భైరవకోన అటవీప్రాంతంతో పాటు అదే మండలంలోని పిల్లిపల్లి, బోయమడుగుల గ్రామాల పైతట్టున ఉన్న అటవీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే డొక్కలవాగు, మన్నేరు ద్వారా, పామూరు మండలంలోని వర్షపు నీరు నాచవాగుద్వారా మోపాడు రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. పూర్తిగా వర్షాధానంపై ఆధారపడిన మోపాడు మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్ తొట్టిప్రాతం సుమారు 4,500 ఎకరాలు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 2.1 టీఎంసీలు. రిజర్వాయర్ పరిధిలో 12,719 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో ప్రకాశం జిల్లా పామూరు మండలంలో 8,174 ఎకరాలు, పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలు ఉంది. వర్షాలు కురిసి మోపాడు రిజర్వాయరుకు సంవృద్ధిగా నీరు చేరి పూర్తిగా నిండితే 29 అడుగుల వద్ద రిజర్వాయర్ అలుగుపారి ఆయకట్టు పరిధిలో అధికారికంగా 12,719 ఎకరాలు, అనధికారికంగా 18 వేల ఎకరాల వరకు వరి పండటంతోపాటు ఆరుతడి పంటలుగా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నూగు, శనగ పంటలు పండుతాయి. 2015 డిసెంబర్లో రిజర్వాయర్‌కు 13.6 అడుగులమేర నీరుచేరగా వరిపంట సాగుకు నీరు సరిపోవని ఆయకట్టుకు విడుదల చేయచేయలేదు. ఈ దశలో 2017లో ఆయకట్టులో ఆరుతడిగా వేసిన జొన్న పైరు ఎండిపోతుండగా విధిలేని పరిస్థితుల్లో రైతుల విజ్ఞప్తితో నీటిని విడుదలచేయగా రిజర్వాయర్‌లోని నీరు 3 అడుగులకు చేరుకుని అడుగంటే స్థితికి వచ్చింది. కాగా 2017 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన కొద్దిపాటి జల్లులకు రిజర్వాయర్‌కు అడుగుల నీరు చేరగా ప్రస్తుతం కొంతనీరు తగ్గి రిజర్వాయర్‌లో నీరు 5.1 అడుగుల్లో డెడ్‌స్టోరోజ్ లెవల్లో ఉంది. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ పరిదిలోనికి చేర్చి తద్వారా రిజర్వాయర్‌కు శాశ్వత నీటి కేటాయింపులతో శాశ్వత ప్రాతిపదికన సాగునీటితో పాటు, తాగునీటి సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితమవుతున్న జైకా నిధులు మండలంలోని మోపాడు రిజర్వాయర్ అలుగు పొడవును 250 మీటర్ల మేర పెంచేందుకు, రిజర్వాయర్ ప్రధాన కాల్వ 22 కిలోమీటర్లు, బొట్లగూడూరు బ్రాంచ్ కెనాల్ 8 కి.మి.ల గ్రావెల్ కాల్వలను సీసీ కాల్వలుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పామూరు కందుకూరు ఆర్అండ్బీ రోడ్డు నుంచి రిజర్వాయర్ వరకు తారురోడ్డు నిర్మాణం, నీరు పొలాల్లోకి వెళ్లేందుకు పిల్లకాల్వల నిర్మాణం, సప్టాల బాగుచేయించేందుకు మొత్తం రు. 32.41 కోట్ల జైకా నిధులకు గత సెప్టెంబర్‌లో ప్రతిపాదనలు పంపగా నేటికి నిధులు విడుదల కాలేదు. -
కన్నీళ్లే మిగిలాయి..
కందుకూరు(మహేశ్వరం): భూగర్భ జలాలు అడుగంటి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. దీంతో పశువులకు మేతగా వేయడం లేదా దున్నేయడమో చేస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈఏడాది వరి సాగు చేసిన రైతన్నలు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్య. ప్రస్తుతం 24 గంటల విద్యుత్‌తోనే భూగర్భ జలాలు అడుగంటాయని, 12 గంటలు పగటి పూట సరఫరా చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు. ♦ నేదునూరుకు చెందిన రైతు సాటు మల్లయ్య తనకున్న రెండు ఎకరాల భూమి అందులో ఒక బోరు ఉంది. కాగా రబీలో అర ఎకరంలో వరి సాగు చేశాడు. తీరా పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోయింది. ♦ కొత్తగూడకు చెందిన అన్నదమ్ములు బాల్‌రాజ్, శంకర్ గ్రామ సమీపంలో ఉన్న ఎకరన్నర భూమిలో రబీ సీజన్లో వరి సాగు చేపట్టారు. వారికున్న మూడు బోర్లలో ప్రస్తుతం ఒకే బోరు నడుస్తుంది. అందులో సైతం భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో తొలుత అర ఎకరంలో వరి ఎండిపోగా పశువుల మేతకు వదిలేశారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పశుపోషణపై ఆధారపడి నెట్టుకొస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సౌడపు శంకర్ సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో నష్టపోయాడు. ఇలా మండల వ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. 24 గంటల కరెంట్‌తోనే... 24 గంటల విద్యుత్‌తో నిరంతరాయంగా బోర్లు నడవడంతో నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో పంటలకు నీరు అందించలేకపోతున్నాం. పగటిపూట విద్యుత్ ఇస్తే ఇంత నష్టం ఉండేది కాదు. ఎకరన్నరలో సాగు చేసిన వరి పంటను ఇప్పటికే సగం పశువులకు మేపాం. ఇప్పుడు మిగతా పంట ఎండిపోతుంది. చాలా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – బాల్‌రాజ్, రైతు, కొత్తగూడ తొమ్మిది గంటలు సరిపోతుంది పగటి పూట 9 గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుంది. 24 గంటలు ఇవ్వడంతో నిరంతరాయంగా బోర్లను ఆన్ చేసి ఉంచడంతో భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోయి పంటలకు నీరు అందడంలేదు. దీంతో కొద్ది విస్తీర్ణంలో సాగు చేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి. – సురేందర్‌రెడ్డి, రైతు, నేదునూరు -
మడకశిరలో వినూత్న నిరసన
మడకశిర: అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తోందని, పశువులు మేత దొరక్క అల్లాడుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మడకశిరలో బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి వినూత్నంగా ధర్నా చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోకి పెద్ద సంఖ్యలో పశువులతో తరలివచ్చారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రఘువీరా.. వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు congress protest, ananthpur, draught , కాంగ్రెస్ నిరసన, అనంతపురం -
‘ఉపాధి’ కరువు
- పనుల్లేక వలస వెళ్తున్న కూలీలు - స్పందించని అధికారులు - పూటగడవకు పేదల అవస్థలు ==================== జిల్లాలో ఉపాధి కూలీలు: 5.26 లక్షల మంది పనులకు వెళ్తున్న వారు: 27,320 మంది ==================== కోవెలకుంట్ల/ఉయ్యాలవాడ వలసలు నివారించేందుకు ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో డిసెంబర్ నెల నుంచి కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చాయి. అయితే ఆచరణలో అది సాధ్యం కావడంలేదు. సంబంధిత అధికారులు గ్రామాల్లో ఉపాధి పనుల కల్పనపై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోతున్నారు. జిల్లాలో 2.88 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. 5.26 లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 27,320 మంది కూలీలకు మాత్రమే పనులు కల్పించారు. వీరిలో ఆదోని మండలంలో అత్యధికంగా 2,531 మంది కూలీలు ఉన్నారు. అతి తక్కువగా వెలుగోడు మండలంలో 18 మందికి మాత్రమే పని కల్పించారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండలంలో 135 మంది, అవుకు మండలంలో 530 మంది, కొలిమిగుండ్ల మండలంలో 535 మంది, సంజామల మండలంలో 79 మంది పనులకు వెళ్తున్నారు. బండిఆత్మకూరు మండలంలో 42 మంది పనులకు వెళుతున్నట్లు రికార్డుల్లో నమోదైంది. వ్యవసాయ పనులకు వలస.. ఉన్న ఊరిలో ఉపాధి కరువవడంతో దూర ప్రాంతాలకు కూలీలు వలస వెళ్తున్నారు. సంజామల మండలంలో పప్పుశనగ, జొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట, గొర్విమానుపల్లె, ఎర్రగుడి అలాగే కర్నూలు, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల నుంచి వందలాది మంది కూలీలు ఇక్కడి వచ్చి పనులు చేస్తున్నారు. దొర్నిపాడు మండలంలో మిరప కోత పనులు అధికంగా ఉండటంతో కోవెలకుంట్ల, బనగానపల్లె తదితర మండలాల నుంచి ఆటోల్లో వలస వచ్చి కూలీలు పనులు చేస్తున్నారు. అధికారుల వైఫల్యం.. ఉపాధి పథకం కింద పనుల కల్పించడమే కాకుండా వేసవి అలవెన్స్ ద్వారా కూలి మొత్తంలో ఫిబ్రవరి నెల నుంచి 20 శాతం అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కూలీలకు ఉపాధి పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉన్నా.. అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదు. జిల్లాలో మరికొంత మంది కూలీలు మిరప కోతలు, వాణిజ్య పనుల నిమిత్తం గుంటూరుకు వలస వెళ్తున్నారు. పూటగడిచేదెట్టా : కంబయ్య, నర్సిపల్లె, ఉయ్యాలవాడ మండలం వ్యవసాయ పనులు ముగిశాయి. కరువు పనుల్లేవు. మేము ఎలా బతకాలి. పనులు చూపిస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు స్పందించి కూలీలను ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి: మాబుసాని, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు, ప్రజల అనుకూలంగా ఉండే పనులు చేపట్టాలి. జాబ్‌కార్డులు కలిగిన కూలీలందరికీ పనులు ఇవ్వాలి. వేసవి కాలంలో పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. అందరికీ పనులు కల్పిస్తాం: మహేష్‌కుమార్, ఎంపిడిఓ, ఉయ్యాలవాడ వచ్చే వారం నుంచి ఉపాధి పథకం ద్వారా శ్రమశక్తి సంఘాల్లో ఉన్న కూలీలందరికీ పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే పనులు ప్రారంభిస్తే కూలీలతో సమస్య ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. -
సమస్యలున్నాయ్... చర్చించండి
జిల్లాలో ప్రస్ఫుటమవుతున్న కరువు ఛాయలు పథకాల అమలులో పెరుగుతున్న అక్రమాలు పల్లెలు, పట్టణాల్లో వేధిస్తున్న వ్యాధులు తీరని వసతి గహాల సమస్యలు నేటి జడ్పీ సమావేశంలో చర్చిస్తారో లేదో.. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో సమస్యలు తాండవిస్తున్నాయి. వర్భాభావ పరిస్థితులు మెట్టప్రాంత రైతుల్ని కలవరపెడుతున్నాయి. ఖరీఫ్‌లో ఇక కరువు ఛాయలు తప్పవేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సీజనల్ వ్యాధులు పెచ్చుమీరుతున్నాయి. ఇక పథకాల అమలులో పచ్చనేతల చేతివాటం... అధికారుల ముడుపుల పర్వం... కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఉండనే ఉంది. అంతేనా... హాస్టళ్లలో అమలు కాని మెనూ... మెరుగుపడని పారిశుద్ధ్యం... మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం... ఇంకా కనబడుతూనే ఉంది. బుధవారం జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలో ఈ అంశాలు చర్చకు వస్తాయో లేదో... జిల్లాలో మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వేసిన పంటను వర్షాభావం కలవరపెడుతోంది. గత కరువు మండలాలకు ఇప్పటికీ సాయం అందలేదు. ఈ సారైనా ఆదుకోకుంటే ఇక వ్యవసాయానికి సెలవు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మునుపెన్నడూలేని విధంగా అవినీతి పెచ్చు మీరిపోతోంది. అభివద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ఆరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోంది. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు. కార్మికుల ఆకలి కేకలను పాలకులు విన్పించుకోవడం లేదు. ఈపాస్ కష్టాలతో ప్రజలు రేషన్‌కు దూరమవుతున్నారు. బుధవారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చకు రావల్సిన అవసరం ఉంది. కమ్ముకున్న కరువు మేఘాలు 9 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగతా మండలాల్లో అంతంత మాత్రంగా ఉంది. వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాధారణ విస్తీర్ణం 1,19,069హెక్టార్లు కాగా, ఇంతవరకు 47వేల హెక్టార్లలోపే సాగైంది. 9635హెక్టార్ల విస్తీర్ణంలో పండాల్సిన వేరుశనగ 2,584హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. దీన్నిబట్టి జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. గతేడాది ప్రకటించిన కరువు మండలాలకు ఇంతవరకు సాయం అందలేదు. ఇప్పుడా సాయాన్ని మంజూరు చేయడమే కాకుండా బ్యాంకుల ద్వారా కొత్తగా రుణాలు, విత్తనాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినా జిల్లాలో అమలు కావడం లేదు. చాలా మంది వ్యాపారులు పాత ధరకే విక్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో వ్యాపారుల భాగోతం బయటపడింది. జిల్లాలో 94ఎరువుల దుకాణాలుండగా వాటిలో 92దుకాణాల్లో లోపాలున్నట్టు కేసులు నమోదయ్యాయి. చంద్రన్నబాట, నీరు చెట్టు... అక్రమాల పుట్ట చంద్రన్నబాటలో భాగంగా వేసిన సిమెంట్ రోడ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. నాసిరకం పనులు చేపట్టి కోట్లాది రూపాయల స్వాహా జరిగింది. ఇప్పుడిప్పుడే అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్గా వచ్చిన రూ. 106కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారు. పర్సంటేజీల కారణంగా పనులపై పర్యవేక్షణ లోపించడంతో భారీగా అక్రమాలు జరిగాయి. ఇక, నీరు చెట్టు పనుల్లో అవినీతికి అంతులేదు. రూ. 180కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పూడికతీత, చెరువు గట్టు పనులు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. అరకొర పనులు చేసి కోట్లాది రూపాయలు మింగేసారు. రూ. 144.94కోట్లతో చేపట్టిన స్లూయజ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చివరికీ ఇంజనీరింగ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ ఎంబుక్‌లు తయారు చేసి నిధులు స్వాహా చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్నిచోట్లైతే పనులు చేపట్టకుండా బిల్లులు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. – జిల్లాలో 19జూట్, ఫెర్రో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో పనిచేస్తున్న 30వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరిపై ఆధారపడి బతుకుతున్న మరో 10వేల మంది రోడ్డున పడ్డారు. – జిల్లాలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. నాసిరకం బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. దీంతో జిల్లాలో 11 నుంచి 12శాతం మంది విద్యార్థులు భోజనం చేసేందుకు ఇష్టపడటం లేదు. మెనూ కూడా సరిగా ఉండటం లేదు. పెరిగిన ధరలకు తగ్గట్టుగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో మెనూ భారమై ఏజెన్సీలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. జిల్లాలోని 1577పాఠశాలలకు వంట గదుల్లేవు. సుమారు 450పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొంది. – డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు విద్యా వ్యవస్థను విస్తరించాల్సింది పోయి ప్రభుత్వమే డ్రాపౌట్స్ పెరిగేలా వ్యవహరిస్తోంది. వసతి గహాలను మూసేస్తోంది. అందులోని పిల్లల్ని సమీపంలో ఉన్న వసతి గహాల్లో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో 30శాతం మందే అందులో చేరారు. మిగిలినవారు డ్రాపౌట్స్‌గా ఉండిపోయారు. – జిల్లాలో వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. డెంగీ కేసులు ఎక్కువయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా వ్యాప్తి కూడా అధికంగా ఉంది. గిరిజన ప్రాంతాలకు దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉన్నా రెండేళ్లుగా విస్మరించారు. – ఫింగర్ ప్రింట్స్ పడక ప్రతీ నెలా 40వేల మంది లబ్ధిదారులు రేషన్‌కు దూరమవుతున్నారు. ఆన్లైన్ సమస్యతో ఆగస్టు రేషన్‌కు సంబంధించి 5,526కార్డులు గల్లంతయ్యాయి. ఇలా ప్రతీ నెలా సరాసరి 15వేల కార్డుదారులు రేషన్ కోల్పోతున్నారు. -
'కరువు అధ్యయనానికి కాంగ్రెస్ బృందాలు'
విజయవాడ: రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున రెండు కరువు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకు ఓ బృందం, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరో బృందం పర్యటిస్తుందని ఆయన వెల్లడించారు. గురువారం కరువుపై కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నేను నెంబర్ వన్ కూలీని అని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో కరువుకు తాళలేక 20 లక్షల మంది కూళీలు వలస బాట పట్టారన్నారు. కరువు పరిస్థితులు ఎదురవుతాయని ముందుగా తెలిసినా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. వేలాది గ్రామాల్లో ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారని, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు అమ్ముకుంటూ రైతన్నలు కన్నీరు కారుస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి కరువు సహాయ నిధి తెచ్చుకోవడంలో ముందు జాగ్రత్తగా వ్యవహరించినా చంద్రబాబు ముందు చూపుతో ఉండలేకపోయారని రఘువీరారెడ్డి విమర్శించారు. తన స్వంత గ్రామంలోనే ఉపాధి హామీ పథకం అమలుకావడం లేదని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేసి వలసలను నివారించిందని రఘువీరా తెలిపారు. -
కేంద్రం నుంచి కరువు నిధులు తీసుకురావాలి
డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సీపీఐ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న నేపథ్యంలో కేంద్రం పై ఒత్తిడి తెచ్చి జాతీయ విపత్తు నిధుల నుంచి రూ.3 వేల కోట్ల నిధులు రాబట్టేందుకు సీఎం కేసీఆర్ కృషిచేయాలని సీపీఐ కోరింది. బడ్జెట్లో ముఖ్యమంత్రి నిధులకింద కేటాయించిన రూ.4,640 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు విడుదలచేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. 3 బృందాలుగా వివిధ జిల్లాల్లోని కరువు పరిస్థితులను పరిశీలించి వచ్చిన సీపీఐ ప్రతినిధులు బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. అజీజ్‌బాషా, పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహ తదితరులు డిప్యూటీ సీఎంను కలసినవారిలో ఉన్నారు. కాగా, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అందుబాటులో ఉన్న నిధులతో సహాయచర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశిస్తామని డిప్యూటీ సీఎం హామీనిచ్చినట్లు సీపీఐ నేతలు తెలిపారు. -
200 కరువు మండలాలు!
* సంఖ్యపై తుది కసరత్తు * వెంటనే తేల్చాలని సీఎం కేసీఆర్ ఆదేశం * నాలుగు రోజుల్లో కేంద్రానికి నివేదిక * కరువు మండలాలపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 కరువు మండలాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ అంచనాకు వచ్చింది. ఈ నివేదికలను మరోసారి పరిశీలించి కరువు మండలాల సంఖ్యను పక్కాగా తేల్చి చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాలను గుర్తించాలని సూచించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేసి తగినంత ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి పంపాలని నిర్దేశించారు. రాష్ట్రస్థాయి కరువు నిర్ధారణ కమిటీ నివేదికతో పాటు జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికలపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనా, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరువు మండలాల గుర్తింపులో పక్కాగా నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 150కి మించే ప్రసక్తే లేదని, కొంతమేరకు సడలిస్తే 194 మండలాలు దీని పరిధిలోకి వస్తాయని అధికారులు సీఎంకు చెప్పారు. విమర్శలకు తావివ్వకుండా వాస్తవ పరిస్థితుల మేరకు తుది సంఖ్యను ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సంఖ్యపైనే జాప్యం కేంద్రం నిర్దేశించిన కరువు కొలమానాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే మొదటగా 66 మండలాల్లోనే కరువు ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ, కలెక్టర్ల నివేదికలను పరిశీలిస్తే కరువు తీవ్రత అంచనాలు దాటింది. కరువు నిర్ధారణకు కేంద్ర నిబంధనల ప్రకారం వర్షాభావ పరిస్థితులు, వర్షానికి వర్షానికి మధ్య అంతరం, తేమ సమగ్ర సూచిక, నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్, నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్, సాగు విస్తీర్ణం, దిగుబడులను లెక్కలోకి తీసుకోవాలి. వీటిలో ఐదింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య భారీగా తగ్గిపోయింది. దిగుబడులు రాకముందే తేల్చిన లెక్క కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుగింటిని గీటురాయిగా తీసుకొని మరోసారి అధికారులు కసరత్తు చేశారు. దీంతో కరువు మండలాల సంఖ్య దాదాపు 200కు చేరింది. మరోవైపు కరువు మండలాల లెక్కతేల్చడంలో ఆలస్యమవుతున్న కొద్దీ కేంద్రం నుంచి అందే సాయం ప్రశ్నార్థకంగా మారనుంది. కేంద్రానికి నివేదిక పంపాక దాదాపు నెల రోజుల తర్వాతే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. అప్పటికీ నష్టపోయిన పంటలను చూపించే అవకాశం లేకపోతే.. పంట నష్టం అంచనా తూతూమంత్రంగా మిగిలిపోతుంది. ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కరువు ప్రాంతాలను ప్రకటించి కేంద్ర సాయం కోరడంలో ముందున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఈ నివేదికను కేంద్రానికి పంపితే ఆశించినంత ఆర్థిక సాయం అందే అవకాశం ఉండేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అన్ని జిల్లాల్లోనూ కరువు ఛాయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రబీ మొదలైన అక్టోబర్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ర్టంలో సాధారణంగా 108.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 24.1 మిల్లీమీటర్లు మాత్రమే (78% లోటు) నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 91 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 87 శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కరువు తాండవం చేస్తోంది. సాగునీరు లేక పంటల సాగు ముందుకు సాగ ట్లేదు. తాగునీటికీ కటకట ఏర్పడింది. కాగా, పంటల సాగు కేవలం 19 శాతానికి పరిమితమైంది. రబీలో 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు మొదలైంది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3.30 లక్షల ఎకరాల్లో (13%) మాత్రమే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి 16.12 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు పరిమితమైంది. -
కరువు కాదు కొత్త అనుభవం
(అక్షర తూణీరం) సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారుచేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని అధినేత విప్పి ప్రదర్శించినప్పుడల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాప పుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి. వెనకటికి సంక్రాంతి పండు గ రోజుల్లో కాశీ కావడితో ఒకాయన మా ఊరు వచ్చే వాడు. కాశీ బ్రాహ్మడు వచ్చా డంటూ మర్యాదగా కూచో బెట్టే వారు. కావడి పొడుగు నా ఒక రేకు గొట్టం జతకట్టి ఉండేది. అందులోంచి పెద్ద పటం విప్పి చేరిన వారి ముందు పరిచేవాడు. హిందీ యాసలో మంత్రాలేవో చదువుతూ, పటంలో బొమ్మ ల్ని వివరిస్తూ కాసేపు అనర్గళంగా ఉపన్యసించేవాడు. అది పాపపుణ్యాలకు, వాటి శిక్షాస్మృతులకు సంబం ధించిన చిత్రపటం. ఏఏ తప్పులకు యములాడు నూనెలో వేపుతాడు, కొరడా దెబ్బలెందుకు పడతాయి లాంటి చిత్రాలు భయపెట్టేవి. పుణ్యాలు, దానధర్మాల వల్ల దొరికే అప్సరసల నాట్యాలు, వారుణివాహిని, పుష్పక విమానం మరో వైపు అలరించేవి. చూస్తున్నం త సేపూ చూపరులు రకరకాల భావోద్వేగాలకు లోన య్యేవారు. కాశీగారు దాన్ని చుట్టచుట్టగానే వారి మనో భావాలు కూడా పూర్వస్థితికి వచ్చేసేవి. క్షణభంగుర మైన వైరాగ్యంలో కలిగిన ఆవేశపు పొంగులు చల్లారేవి. పుట్టెడు ధాన్యం ధారపోద్దామనుకున్న వారు చిట్టె డుతో సరిపెట్టేవారు. తను చూపిన కట్టు కథలకి, వారి ఔదార్యానికి సరికిసరి అనుకుంటూ కాశీ కావడి మరో ఇంటికి కదిలేది. సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారు చేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని (తప్పు కాదు కదా! ఏమో, బ్లూ ఫిలిం లాగే బ్లూప్రింట్ కూడా ఏమైనా గూడార్థాలు కలిగి ఉంటుం దేమోనని భయం) అధినేత విప్పి ప్రదర్శించినప్పు డల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాపపుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి. ఇక క్షేత్రస్థాయి నిజాలకు వద్దాం. ఆకాశం ఎండి పోయింది. వాన చినుకు లేదు. కార్తెలు కదలి వెళ్లిపోతు న్నాయి. సస్య క్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా మారిపో యాయి. గోదావరి, కృష్ణా డెల్టాలలో ఖరీఫ్ నాటు ఏమిచేద్దాం? తాగునీరు కూడా ఇవ్వలేనంటున్న నాగా ర్జున సాగరాన్ని ఏమందాం? గడ్డపారలకు పదును పెడదామా? రాజధానిలో వరుణయాగానికి హోమ కుండాలు సిద్ధం చేద్దామా? బిహార్ ఎన్నికల ఎరగా ప్రధాని భారీ ప్యాకేజీని ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ నేతల ముఖాలు ‘చింకి చాటంత’ అయినాయి. బిహార్‌కే అంతిస్తే, ఇక మన కెంత ఇవ్వాలి? మనమెంత అడగాలి? అనుకుంటూ అంకెలకి కొత్త సున్నాలు కలుపుకుని ఢిల్లీ వెళ్లే ప్రయ త్నంలో ఉన్నారు. ఇది ప్రత్యేక హోదాకు అదనంగా వచ్చే నిధి. అవతలి పెద్దమనిషి సామాన్యుడు కాదు. ‘‘నువ్వు పాడిందానికి నేను తలూపాను. దానికీ దానికీ చెల్లు. విన్నందుకు తంబూరా ఇచ్చి వెళ్ల’’మనే రకం. అదలా ఉండగా వర్షాభావ, దుర్భిక్ష భిక్ష కోసం ఫొటో ల సహితంగా మళ్లీ వెళతారు. మళ్లీ కొత్త ఆశలు, కొత్త చిగుళ్లు చూపిస్తారు. ఆశాభావాలు, ఊహాగానాలు దం డిగా మోసుకుని తిరిగివస్తారు. ఇకపై ఇది వ్యవసాయ శాఖ కాదుట. రైతు సంక్షేమ శాఖట! ‘‘పేరు ఏదైనా దరిద్రం ఒకటేలెండి’’ అని ఒక రైతు నిట్టూర్చాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో కొంతైనా ఊరట నివ్వగల ప్రత్యామ్నాయ పంటల గురించి ఏ విశ్వవి ద్యాలయమైనా సూచించగలదా! ఇన్నేళ్ల పరిశోధన ఫలితాలెక్కడ? ఇది దుర్భిక్షం కాదు, కరువు కానేకాదు. ఇదొక ‘‘కొత్త అనుభవం’’అని పేరు మార్చుకుంటే ఆకలి తీరుతుందా? ఈ విపరీత పరిస్థితికి ఒకే ఒక ఫలశ్రుతి ఉంది. ఈ మహా కష్టకాలంలో సామాన్యుడికి ఓదార్పుని ఇవ్వ గలిగింది చీప్ లిక్కర్ ఒక్కటే. నీళ్ల కొరత కారణంగా నీట్ పుచ్చుకుంటారు కాబట్టి అబ్కారీ టార్గెట్లు ముందే పూర్తవుతాయి. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
సీమకు అన్యాయం చేయొద్దు
నంద్యాల: దేశంలోని అత్యంత కరువు ఎదుర్కొంటున్న రాయలసీమకు అన్యా యం చేయవద్దని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలోని వెనుకబాటు తనాన్ని తాగు, సాగునీటి సమస్యలను రాజకీయ సమస్యలుగా సృష్టించి కరువు సీమకు అన్యాయం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటిని తరలించుకొని పోవడం బాధాకరమన్నారు. ఎంత సేపు రాజకీయ లబ్ధి కోసం సీమను వాడుకుంటున్నారే తప్ప సీమకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చడంలో ప్రభత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదలపై ఉన్న విధానాలను రాయలసీమ హక్కులుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఏడాదీ 500టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా రాయలసీమలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమల కాల్వలకు కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటి కేటాయింపులు మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్‌కు విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 872అడుగులకు పైన నీరు ఉన్నప్పుడే సాగర్‌కు నీటిని విడుదల చేయాలన్నారు. గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ద్వారా ఆదా అయ్యే 45టీఎంసీల కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు కేటాయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు కేటాయించిన 60టీఎంసీల క్యారిఓవర్ నీటిని రాయలసీమ అవసరాలకు కేటాయించాలన్నారు. రాయలసీమ నీటి అవసరాల పరిష్కారం కోసం సీమ సాగునీటి కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా ఎస్సార్బీసీ ప్రధాన కాల్వను పూర్తి చేయాలని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర అసంపూర్తి నిర్మాణాలను, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలుగొండ ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. -
ముంచుకొస్తున్న కరువు
సింగపూర్: భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి. ఈ ఏడాది నుంచి మళ్లీ వర్షాభావంతో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, గోధుమ, చెరకు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న భారత్ ఆ పంటల దిగుబడులు తగ్గి కరువును ఎదుర్కోనుంది. పసిఫిక్ మహా సముద్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితులు ఏర్పడనుండటమే ఈ గడ్డు కాలానికి కారణం కానుంది. ఈ ఏడాది రెండో సగం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్యూరో ఆఫ్ మెటియరాలజీ’, అమెరికాకు చెందిన ‘యూఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ఎల్ నినోతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఆఫ్రికాలోనూ తీవ్ర కరువు ఏర్పడనుంది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, తదితర ప్రాంతాలు, బ్రెజిల్ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయని, దీనిని తీవ్రమైనదిగా నిర్ధారిస్తే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి వివిధ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయని అంటున్నారు. ఇంతకుముందు 2009లో ఏర్పడిన ఎల్ నినో వల్ల.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద కరువును దేశం చవిచూడాల్సి వచ్చింది. చక్కెర ధరలు సైతం 30 ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి. 1990లలో తీవ్ర ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువుకు వివిధ దేశాల్లో 2 వేల మంది మృత్యువాతపడ్డారు. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ప్రస్తుత ఎల్ నినో వల్ల థాయిలాండ్, ఇండోనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో వరి, కాఫీ, మొక్కజొన్న పంటలు కరువుతో ఎండిపోనున్నాయి. వరదలు రావడం లేదా రవాణాకు ఆటంకం కలగడం వల్ల బంగారం, నికెల్, టిన్, కాపర్ (రాగి), బొగ్గు వంటి ఖనిజాల ధరలూ భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఎల్ నినో.. ‘బ్యాడ్’బోయ్! స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్ నినోగా పిలుస్తారు. ఇది ప్రతి 4 నుంచి 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎల్ నినో-దక్షిణ డోలనం అనే సహజ వాతావరణ వలయంలో భాగంగా జరుగుతుంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు ప్రభావితమై ఆయా దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడే ముప్పు ఉంటుంది కాబట్టి.. దీనిని బ్యాడ్ బోయ్‌గా అభివర్ణిస్తారు. ఇది ముఖ్యంగా మనదేశంలో నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గి.. ఎల్ నినోకు వ్యతిరేక ంగా ఏర్పడే వాతావరణ పరిస్థితిని ‘లా నినా’(స్పానిష్‌లో లిటిల్ గర్ల్)గా పిలుస్తారు. దీని వల్ల అమెరికా, తదితర చోట్ల కరువు ఏర్పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి.