సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రబీ మొదలైన అక్టోబర్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ర్టంలో సాధారణంగా 108.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 24.1 మిల్లీమీటర్లు మాత్రమే (78% లోటు) నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 91 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 87 శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కరువు తాండవం చేస్తోంది. సాగునీరు లేక పంటల సాగు ముందుకు సాగ ట్లేదు.
తాగునీటికీ కటకట ఏర్పడింది. కాగా, పంటల సాగు కేవలం 19 శాతానికి పరిమితమైంది. రబీలో 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు మొదలైంది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3.30 లక్షల ఎకరాల్లో (13%) మాత్రమే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి 16.12 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు పరిమితమైంది.