గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే, గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.
జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.
గుండెపోటు
గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు
వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు.
►గుండెల్లో మంట లేదా అజీర్ణం
►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం
►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు
►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం
► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం
ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది.
► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి
లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి
►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి.
► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి.
►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.
► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.
►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment