symtoms
-
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఇంకా కోలుకోలేదా?... ఆందోళన వద్దు!
కరోనా వచ్చి... ఐదు, ఆరు, ఏడు నెలలు గడుస్తున్నా ఇంకా కోలుకోలేదా? తీవ్రమైన నీరసం ఏపనీ చేసుకోనివ్వడం లేదా? ఇంకా ఒళ్లునొప్పులు వేధిస్తున్నాయా? తీవ్రమైన నిద్రలేమి వెంటాడుతోందా? అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెబుతున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. సాధారణంగా కరోనా వచ్చి తగ్గాక నాలుగు వారాల నుంచి పన్నెండు వారాల్లో సాధారణంగా లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. కానీ కొందరిలో ఏడాది గడిచాక కూడా తీవ్రమైన నిస్సత్తువ, అలసట, కండరాల నొప్పులు, ఒళ్లంతా నొప్పులు, రాత్రంతా ఏమాత్రం నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలను బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లెయిసెస్టర్ అనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మరీ ముఖ్యంగా మహిళల్లో, స్థూలకాయం ఉన్నవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉండిపోవడాన్ని గమనించారు. అందునా వెంటిలేటర్‌పైకి వెళ్లిన రోగుల్లో ఈ లక్షణాలు మరింత సుదీర్ఘకాలం పాటు ఉండిపోవడాన్నీ గుర్తించారు. లక్షణాలు అలాగే ఉండటంతో కరోనా ప్రభావం ఇంకా ఉందా అనే ఆందోళన బాధితుల్లో వ్యక్తం కావడం సహజం. కానీ దీన్ని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అయితే నిద్రలేమి, గుండెజబ్బుల వంటి మరికొన్ని సంబంధిత సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ఈ అనుబంధ సమస్యలకు చికిత్స తీసుకుంటే చాలని సూచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి, 2020 నుంచి మొదలుకొని మార్చి 2021 వరకు ఇంగ్లండ్ వ్యాప్తంగా 53 ఇన్స్టిట్యూషన్స్లో, 83 హాస్పిటల్స్‌లో కరోనా కారణంగా హాస్పిటల్లో చేరాల్సి వచ్చిన 2,320 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రముఖ శ్వాసకోశ సమస్యల వైద్య నిపుణుడు ప్రొఫెసర్ క్రిస్ బ్రిట్లింగ్ మాట్లాడుతూ ‘‘కొందరు ఐదు నెలలు గడిచాక కూడా పూర్తిగా కోలుకోకపోవడాన్ని మేం చూశాం. అంతేకాదు... దాదాపు మూడింట రెండొంతుల మంది పూర్తిగా కోలుకున్నప్పటికీ... మూడో వంతు మందిలో మాత్రం ఏడాది గడిచాక కూడా ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి. పైన పేర్కొన్న సమస్యలతో పాటు కొందరిలో కదలికలు మందగించడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, బ్రెయిన్‌ఫాగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)తోనూ బాధపడుతున్నారు. వారిలో చాలా తక్కువ మందిలో మాత్రమే వెంటనే సానుకూల మార్పులను చూడగలుగుతున్నాం. ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకపోయినా... లక్షణాలు పూర్తిగా తగ్గని వారిలో... ఇప్పటికి లభ్యమవుతున్న ఫలితాల ప్రకారం... 25.5 శాతం మందిలో ఐదు నెలల తర్వాత 28.9 శాతం మందిలో ఏడాది తర్వాత లక్షణాలన్నీ పూర్తిగా తగ్గుపోతున్నా’’యని ఆయన తెలిపారు. ఇంకా తగ్గనివారు ఏమాత్రం ఆందోళన చెందకుండా... సంబంధిత సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటే చాలని భరోసా ఇస్తున్నారు. -
కరోనా పాజిటివ్ వచ్చినా బయట తిరిగేస్తున్నారు
మహబూబ్‌నగర్ క్రైం: కరోనా రెండోదశ రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం దీనికి నిదర్శనం. ప్రజల్లో, ప్రధానంగా యువతలో ఉన్న నిర్లిప్తతతో పాటు కొందరు పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్నా తమకేమీ పట్టనట్లుగా బయట తిరుగుతున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షించేవారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రమైతే ఐసోలేషన్ కేంద్రంలో, లేకపోతే హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం.. వైరస్ బారిన పడినవారు విధిగా 14 రోజుల పాటు తగిన జాగ్రత్తలతో ఏకాంతంగా ఉంటే వైరస్‌ను అదుపు చేయగలుగుతాం. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఫోన్ చేసి తెలుసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదు. పెద్దసంఖ్యలో బాధితులుండటంతో అధికారులు సైతం వివరాలు వెల్లడించే పరిస్థితి లేకుండాపోతుంది. దీంతో కొందరు వ్యక్తులు తమ అవసరాల కోసం స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రదేశాల్లో ఎప్పటిలాగే తిరుగుతున్నారు. ఫలితంగా ఇతరులు వైరస్ బారిన పడేందుకు అవకాశాలను కల్పించినట్లవుతోంది. దీనికి తోడు ప్రజల్లోనూ ఉన్న కాసింత నిర్లక్ష్యం బాధితుల సంఖ్యను గణనీయంగా పెంచేస్తోంది. ఈ కారణంగానే గత పక్షం రోజులుగా నిత్యం వందల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. సమాచారం ఇవ్వడం లేదు గతంలో కాలనీలు, గ్రామాల వారీగా పేర్లతో వైద్య సిబ్బంది కరోనా రోగుల సమాచారం పంపించేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో అధికారికంగా రసాయన ద్రావణాన్ని పిచికారీ చేసేవారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే కంటైన్మెంట్ జోన్లు, ఐసోలేషన్ కేంద్రాలు తదితర వాటిని ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడేవారు. బాధితులు బయటకు రాకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఆయా వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు ఇతర వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు. అయితే ప్రస్తుతం ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవడంతో ఇటువంటివేవి జరగడం లేదు. చాలాచోట్ల బాధితులు బయట తిరుగుతున్నారు. 3,025 మందికి టీకాలు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేంద్రాల్లో ఇస్తున్న కరోనా టీకాలకు విశేష స్పందన లభిస్తోంది. నిత్యం వేల మంది వ్యాక్సినేషన్ చేసుకోవడానికి వస్తున్నారు. జిల్లాలో శుక్రవారం 3,025మందికి టీకాలు ఇచ్చారు. మొదటి డోస్ కింద హెల్త్‌కేర్ వర్కర్స్ 11, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 61మందికి, 60ఏళ్లుపైబడిన వారిలో 809మందికి, 45–59ఏళ్ల దీర్ఘకాలిక రోగులతో పాటు 45ఏళ్లుపైబడిన వారిలో 1804మందికి టీకాలు ఇచ్చారు. ఇక సెకెండ్ డోస్‌లో ఈ నాలుగు విభాగాలకు కలిపి 340మందికి టీకాలు ఇచ్చారు. -
కరోనా: నెలలు గడిచినా నీరసమే
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో ఆసుపత్రులపాలై డిశ్చార్జి అయిన తర్వాత కూడా పలువురు నెలల కొద్దీ నీరసంతో బాధపడుతున్నారు. చికిత్సలో స్టెరాయిడ్స్ వాడటం, ఐసీయూల్లో రోజుల తరబడి ఉండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తదితర కారణాలతో కోలుకోవడానికి బాగా సమయం పడుతోంది. అంతేగాకుండా కొందరు 2 నెలల తర్వాత కూడా నాలుగు అడుగులూ వేయలేకపోతున్నారు. కాస్తంత నడిచినా ఆయాసం, శ్వాసతీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయి. అలాగే కరోనాతో హోంఐసోలేషన్లో వైద్యం పొందిన వారిలోనూ ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నాక... ఆయాసం, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇద్దరిలో ఒకరు.. కరోనాతో ఆసుపత్రిపాలై చివరకు నయమై బయటకు వచ్చే వారిలో ప్రతీ ఇద్దరిలో ఒకరు 60 రోజుల వరకు బలహీనంగానే ఉంటున్నారు. ఇక వెంటిలేటర్ల మీది వరకు వెళ్లి బయటకు వచ్చిన ప్రతీ నలుగురిలో ఒకరిని అత్యంత తీవ్రమైన బలహీనత పట్టి పీడిస్తోంది. కనీసం బెడ్‌పై నుంచి దిగలేరు. దుస్తులు కూడా వేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వెంటిలేటర్ మీద ఉండటం వల్ల తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ఎముకలు బలహీనత తదితర కారణాల వల్ల చాలా బలహీనంగా ఉంటారు. మరీ ముఖ్యంగా వెంటిలేటర్ మీద, ఆక్సిజన్ మీద ఉండి వచ్చినవారు, వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు బలహీనత, నీరసంతో బాధపడతారు. త్వరగా అలసిపోతారు. ఎవరైనా 60 రోజుల్లో సాధారణ పరిస్థితికి రాకుంటే వారిని గుర్తించి, డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఆయన పేరు రాజీవ్... హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మూడు నెలల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చివరకు ఆక్సిజన్ బెడ్‌పై కూడా ఉన్నారు. 15 రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. ఇన్నాళ్లైనా అతనిలో నీరసం ఇంకా ఉంది. ఆమె పేరు రామలక్ష్మి... వరంగల్‌కు చెందిన 50 ఏళ్ల ఈమె ఐదు నెలల కిందట హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాతో చేరారు. వెంటిలేటర్‌పైకి కూడా వెళ్లారు. నెలన్నర ఆసుపత్రిలో ఉన్నాక, చివరకు డిశ్చార్జి అయ్యారు. కానీ ఇప్పటికీ ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉన్నారు. నీరసంతో బాధపడుతున్నారు. వ్యాయామమే పరిష్కారం కరోనా నుంచి కోలుకున్నవారు దమ్ముతో బాధపడతారు. కొందరైతే మాట్లాడినప్పుడు తడబడతారు. తినేటప్పుడు, తాగేటప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. ఒత్తిడి, మానసిక వేదనకు గురవుతారు. నరాల మీద ప్రభావం పడి, ఏ పనినీ సక్రమంగా చేయలేరు. దమ్మును నియంత్రించాలంటే పడుకునేప్పుడు తలకింద తలగడను పెట్టుకొని, ఏదో ఒక పక్కకు పడుకోవాలి. ఒక కాలును మడవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు టేబుల్ ఉంటే దాని మీద తలగడ వేసుకొని తలభాగాన్ని టేబుల్‌పై పెట్టాలి. చేతులు కూడా టేబుల్ మీద పెట్టాలి. కుర్చీ మీద కూర్చుంటే, చేతులు మోకాళ్ల మీద వాల్చాలి. తల నేలవైపు చూడాలి. నిలబడి ఉన్నప్పుడు గోడకు ఆనాలి. కాళ్లు కొద్దిగా ముందుగా వంచాలి. ప్రాణాయామం చేయాలి. గాలిని ముక్కుతో తీసుకోవాలి. నోటితో వదిలేయాలి. మెట్లు ఎక్కడం, నడవడం లేదా ఇతరత్రా ఏదైనా శారీరక శ్రమ చేయాల్సి వచ్చినప్పుడు దీర్ఘశ్వాస తీసుకోవాలి. అప్పుడు దమ్ము తగ్గుతుంది. ఆక్సిజన్ మీద ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి నడవడం వంటివి చేయాలి. ప్రతీ ఎక్సర్సైజ్కు ముందు వార్మప్ చేయాలి. తిన్న తర్వాత గంట వరకు ఎటువంటి వ్యాయామం చేయకూడదు. వేడి, చలి వాతావరణంలో వ్యాయామం వద్దు. బాగా ఆయాసం వచ్చినా, ఛాతీలో నొప్పి, తల తిరిగినట్లు ఉన్నా వ్యాయామం ఆపాలి. ఆక్సిజన్ మీద ఉండి రికవరీ అయినవారు శ్యాచురేషన్ లెవల్స్ చూసుకోవాలి. చెమట, తల తిరగడం, శ్యాచురేషన్స్ పడిపోవడం వంటివి ఉన్నప్పుడు వ్యాయామాలు ఆపాలి. వారంలో ఐదు రోజుల వ్యాయామం ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు ఎంతో విలువైనవి. వ్యాయామం చేసేప్పుడు కనీసం ఒక పదం కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటే, అప్పటితో వ్యాయామం ఆపాలి. వ్యాయామం చేసేప్పుడు రెండు మూడు సార్లు దమ్ము తీసుకుంటూ చేయగలగడం సరైన పద్దతి. వారంలో ఐదు రోజులు రోజుకు 30 నిముషాలలోపు ఎక్సర్సైజ్ చేయాలి.-- డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ నేటి నుంచి రెండో డోస్! సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వారందరికీ, రెండో డోస్ శనివారం నుంచి ఇవ్వనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. సరిగ్గా గత 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి డోస్ వేసుకున్న 28 రోజులకు రెండో డోస్ పొందాల్సి ఉంది. ఆ నియమం ప్రకారం ఇప్పటివరకు మొదటి డోస్ వేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ వేసే ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాటికి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లంతా కలిపి 2,77,825 మం ది మొదటి డోస్ టీకా పొందారు. వారిలో సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వచ్చిన వారిని మినహాయించి అందరికీ రెండో డోస్ వేస్తారు. మొ దటి డోస్‌లో ఏవైనా అలర్జీలు వస్తే ఈసారి టీకా వేయబోమని వైద్య యంత్రాంగం తెలిపింది. వచ్చే నెల మొదటి వారం నుంచి 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ కరోనా టీకా వేస్తారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు 33 శాతమే.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది 58 శాతం మంది టీకా వేయించుకుంటే, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మాత్రం కేవలం 33 శాతమే టీకా వేయించుకోవడం గమనార్హం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది 1,93,485 మంది టీకా వేసుకోగా, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 2,56,895 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 84,340 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. కాగా, శుక్రవారం రాష్ట్రంలో 30 జిల్లాల్లో 415 టీకా కేంద్రాల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. -
అన్ని జిల్లాల్లోనూ కరువు ఛాయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రబీ మొదలైన అక్టోబర్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ర్టంలో సాధారణంగా 108.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 24.1 మిల్లీమీటర్లు మాత్రమే (78% లోటు) నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 91 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 87 శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కరువు తాండవం చేస్తోంది. సాగునీరు లేక పంటల సాగు ముందుకు సాగ ట్లేదు. తాగునీటికీ కటకట ఏర్పడింది. కాగా, పంటల సాగు కేవలం 19 శాతానికి పరిమితమైంది. రబీలో 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు మొదలైంది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3.30 లక్షల ఎకరాల్లో (13%) మాత్రమే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి 16.12 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు పరిమితమైంది.