సాక్షి, హైదరాబాద్ : కరోనాతో ఆసుపత్రులపాలై డిశ్చార్జి అయిన తర్వాత కూడా పలువురు నెలల కొద్దీ నీరసంతో బాధపడుతున్నారు. చికిత్సలో స్టెరాయిడ్స్ వాడటం, ఐసీయూల్లో రోజుల తరబడి ఉండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తదితర కారణాలతో కోలుకోవడానికి బాగా సమయం పడుతోంది. అంతేగాకుండా కొందరు 2 నెలల తర్వాత కూడా నాలుగు అడుగులూ వేయలేకపోతున్నారు. కాస్తంత నడిచినా ఆయాసం, శ్వాసతీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయి. అలాగే కరోనాతో హోంఐసోలేషన్‌లో వైద్యం పొందిన వారిలోనూ ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నాక... ఆయాసం, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇద్దరిలో ఒకరు..
కరోనాతో ఆసుపత్రిపాలై చివరకు నయమై బయటకు వచ్చే వారిలో ప్రతీ ఇద్దరిలో ఒకరు 60 రోజుల వరకు బలహీనంగానే ఉంటున్నారు. ఇక వెంటిలేటర్ల మీది వరకు వెళ్లి బయటకు వచ్చిన ప్రతీ నలుగురిలో ఒకరిని అత్యంత తీవ్రమైన బలహీనత పట్టి పీడిస్తోంది. కనీసం బెడ్‌పై నుంచి దిగలేరు. దుస్తులు కూడా వేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వెంటిలేటర్ మీద ఉండటం వల్ల తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ఎముకలు బలహీనత తదితర కారణాల వల్ల చాలా బలహీనంగా ఉంటారు. మరీ ముఖ్యంగా వెంటిలేటర్ మీద, ఆక్సిజన్ మీద ఉండి వచ్చినవారు, వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు బలహీనత, నీరసంతో బాధపడతారు. త్వరగా అలసిపోతారు. ఎవరైనా 60 రోజుల్లో సాధారణ పరిస్థితికి రాకుంటే వారిని గుర్తించి, డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.
- ఆయన పేరు రాజీవ్... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మూడు నెలల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చివరకు ఆక్సిజన్ బెడ్‌పై కూడా ఉన్నారు. 15 రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. ఇన్నాళ్లైనా అతనిలో నీరసం ఇంకా ఉంది.
- ఆమె పేరు రామలక్ష్మి... వరంగల్‌కు చెందిన 50 ఏళ్ల ఈమె ఐదు నెలల కిందట హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాతో చేరారు. వెంటిలేటర్‌పైకి కూడా వెళ్లారు. నెలన్నర ఆసుపత్రిలో ఉన్నాక, చివరకు డిశ్చార్జి అయ్యారు. కానీ ఇప్పటికీ ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉన్నారు. నీరసంతో బాధపడుతున్నారు.
వ్యాయామమే పరిష్కారం
- కరోనా నుంచి కోలుకున్నవారు దమ్ముతో బాధపడతారు. కొందరైతే మాట్లాడినప్పుడు తడబడతారు. తినేటప్పుడు, తాగేటప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. ఒత్తిడి, మానసిక వేదనకు గురవుతారు. నరాల మీద ప్రభావం పడి, ఏ పనినీ సక్రమంగా చేయలేరు.
- దమ్మును నియంత్రించాలంటే పడుకునేప్పుడు తలకింద తలగడను పెట్టుకొని, ఏదో ఒక పక్కకు పడుకోవాలి. ఒక కాలును మడవాలి.
- కుర్చీలో కూర్చున్నప్పుడు టేబుల్ ఉంటే దాని మీద తలగడ వేసుకొని తలభాగాన్ని టేబుల్‌పై పెట్టాలి. చేతులు కూడా టేబుల్ మీద పెట్టాలి.
- కుర్చీ మీద కూర్చుంటే, చేతులు మోకాళ్ల మీద వాల్చాలి. తల నేలవైపు చూడాలి.
- నిలబడి ఉన్నప్పుడు గోడకు ఆనాలి. కాళ్లు కొద్దిగా ముందుగా వంచాలి.
- ప్రాణాయామం చేయాలి. గాలిని ముక్కుతో తీసుకోవాలి. నోటితో వదిలేయాలి.
- మెట్లు ఎక్కడం, నడవడం లేదా ఇతరత్రా ఏదైనా శారీరక శ్రమ చేయాల్సి వచ్చినప్పుడు దీర్ఘశ్వాస తీసుకోవాలి. అప్పుడు దమ్ము తగ్గుతుంది.
- ఆక్సిజన్ మీద ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి నడవడం వంటివి చేయాలి.
- ప్రతీ ఎక్సర్‌సైజ్‌కు ముందు వార్మప్ చేయాలి.
- తిన్న తర్వాత గంట వరకు ఎటువంటి వ్యాయామం చేయకూడదు.
- వేడి, చలి వాతావరణంలో వ్యాయామం వద్దు.
- బాగా ఆయాసం వచ్చినా, ఛాతీలో నొప్పి, తల తిరిగినట్లు ఉన్నా వ్యాయామం ఆపాలి.
- ఆక్సిజన్ మీద ఉండి రికవరీ అయినవారు శ్యాచురేషన్ లెవల్స్ చూసుకోవాలి. చెమట, తల తిరగడం, శ్యాచురేషన్స్ పడిపోవడం వంటివి ఉన్నప్పుడు వ్యాయామాలు ఆపాలి.
- వారంలో ఐదు రోజుల వ్యాయామం
- ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు ఎంతో విలువైనవి. వ్యాయామం చేసేప్పుడు కనీసం ఒక పదం కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటే, అప్పటితో వ్యాయామం ఆపాలి. వ్యాయామం చేసేప్పుడు రెండు మూడు సార్లు దమ్ము తీసుకుంటూ చేయగలగడం సరైన పద్దతి. వారంలో ఐదు రోజులు రోజుకు 30 నిముషాలలోపు ఎక్సర్‌సైజ్ చేయాలి.-- డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
నేటి నుంచి రెండో డోస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వారందరికీ, రెండో డోస్ శనివారం నుంచి ఇవ్వనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. సరిగ్గా గత 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి డోస్ వేసుకున్న 28 రోజులకు రెండో డోస్ పొందాల్సి ఉంది. ఆ నియమం ప్రకారం ఇప్పటివరకు మొదటి డోస్ వేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ వేసే ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాటికి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లంతా కలిపి 2,77,825 మం ది మొదటి డోస్ టీకా పొందారు. వారిలో సీరియస్ సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చిన వారిని మినహాయించి అందరికీ రెండో డోస్ వేస్తారు. మొ దటి డోస్‌లో ఏవైనా అలర్జీలు వస్తే ఈసారి టీకా వేయబోమని వైద్య యంత్రాంగం తెలిపింది. వచ్చే నెల మొదటి వారం నుంచి 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ కరోనా టీకా వేస్తారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్లు 33 శాతమే..
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది 58 శాతం మంది టీకా వేయించుకుంటే, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మాత్రం కేవలం 33 శాతమే టీకా వేయించుకోవడం గమనార్హం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది 1,93,485 మంది టీకా వేసుకోగా, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 2,56,895 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 84,340 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. కాగా, శుక్రవారం రాష్ట్రంలో 30 జిల్లాల్లో 415 టీకా కేంద్రాల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment