కరువు కాదు కొత్త అనుభవం
(అక్షర తూణీరం)
సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారుచేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని అధినేత విప్పి ప్రదర్శించినప్పుడల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాప పుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి.
వెనకటికి సంక్రాంతి పండు గ రోజుల్లో కాశీ కావడితో ఒకాయన మా ఊరు వచ్చే వాడు. కాశీ బ్రాహ్మడు వచ్చా డంటూ మర్యాదగా కూచో బెట్టే వారు. కావడి పొడుగు నా ఒక రేకు గొట్టం జతకట్టి ఉండేది. అందులోంచి పెద్ద పటం విప్పి చేరిన వారి ముందు పరిచేవాడు. హిందీ యాసలో మంత్రాలేవో చదువుతూ, పటంలో బొమ్మ ల్ని వివరిస్తూ కాసేపు అనర్గళంగా ఉపన్యసించేవాడు. అది పాపపుణ్యాలకు, వాటి శిక్షాస్మృతులకు సంబం ధించిన చిత్రపటం. ఏఏ తప్పులకు యములాడు నూనెలో వేపుతాడు, కొరడా దెబ్బలెందుకు పడతాయి లాంటి చిత్రాలు భయపెట్టేవి. పుణ్యాలు, దానధర్మాల వల్ల దొరికే అప్సరసల నాట్యాలు, వారుణివాహిని, పుష్పక విమానం మరో వైపు అలరించేవి. చూస్తున్నం త సేపూ చూపరులు రకరకాల భావోద్వేగాలకు లోన య్యేవారు.
కాశీగారు దాన్ని చుట్టచుట్టగానే వారి మనో భావాలు కూడా పూర్వస్థితికి వచ్చేసేవి. క్షణభంగుర మైన వైరాగ్యంలో కలిగిన ఆవేశపు పొంగులు చల్లారేవి. పుట్టెడు ధాన్యం ధారపోద్దామనుకున్న వారు చిట్టె డుతో సరిపెట్టేవారు. తను చూపిన కట్టు కథలకి, వారి ఔదార్యానికి సరికిసరి అనుకుంటూ కాశీ కావడి మరో ఇంటికి కదిలేది. సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారు చేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని (తప్పు కాదు కదా! ఏమో, బ్లూ ఫిలిం లాగే బ్లూప్రింట్ కూడా ఏమైనా గూడార్థాలు కలిగి ఉంటుం దేమోనని భయం) అధినేత విప్పి ప్రదర్శించినప్పు డల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాపపుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి.
ఇక క్షేత్రస్థాయి నిజాలకు వద్దాం. ఆకాశం ఎండి పోయింది. వాన చినుకు లేదు. కార్తెలు కదలి వెళ్లిపోతు న్నాయి. సస్య క్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా మారిపో యాయి. గోదావరి, కృష్ణా డెల్టాలలో ఖరీఫ్ నాటు ఏమిచేద్దాం? తాగునీరు కూడా ఇవ్వలేనంటున్న నాగా ర్జున సాగరాన్ని ఏమందాం? గడ్డపారలకు పదును పెడదామా? రాజధానిలో వరుణయాగానికి హోమ కుండాలు సిద్ధం చేద్దామా?
బిహార్ ఎన్నికల ఎరగా ప్రధాని భారీ ప్యాకేజీని ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ నేతల ముఖాలు ‘చింకి చాటంత’ అయినాయి. బిహార్‌కే అంతిస్తే, ఇక మన కెంత ఇవ్వాలి? మనమెంత అడగాలి? అనుకుంటూ అంకెలకి కొత్త సున్నాలు కలుపుకుని ఢిల్లీ వెళ్లే ప్రయ త్నంలో ఉన్నారు. ఇది ప్రత్యేక హోదాకు అదనంగా వచ్చే నిధి. అవతలి పెద్దమనిషి సామాన్యుడు కాదు. ‘‘నువ్వు పాడిందానికి నేను తలూపాను. దానికీ దానికీ చెల్లు. విన్నందుకు తంబూరా ఇచ్చి వెళ్ల’’మనే రకం. అదలా ఉండగా వర్షాభావ, దుర్భిక్ష భిక్ష కోసం ఫొటో ల సహితంగా మళ్లీ వెళతారు. మళ్లీ కొత్త ఆశలు, కొత్త చిగుళ్లు చూపిస్తారు.
ఆశాభావాలు, ఊహాగానాలు దం డిగా మోసుకుని తిరిగివస్తారు. ఇకపై ఇది వ్యవసాయ శాఖ కాదుట. రైతు సంక్షేమ శాఖట! ‘‘పేరు ఏదైనా దరిద్రం ఒకటేలెండి’’ అని ఒక రైతు నిట్టూర్చాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో కొంతైనా ఊరట నివ్వగల ప్రత్యామ్నాయ పంటల గురించి ఏ విశ్వవి ద్యాలయమైనా సూచించగలదా! ఇన్నేళ్ల పరిశోధన ఫలితాలెక్కడ? ఇది దుర్భిక్షం కాదు, కరువు కానేకాదు. ఇదొక ‘‘కొత్త అనుభవం’’అని పేరు మార్చుకుంటే ఆకలి తీరుతుందా? ఈ విపరీత పరిస్థితికి ఒకే ఒక ఫలశ్రుతి ఉంది. ఈ మహా కష్టకాలంలో సామాన్యుడికి ఓదార్పుని ఇవ్వ గలిగింది చీప్ లిక్కర్ ఒక్కటే. నీళ్ల కొరత కారణంగా నీట్ పుచ్చుకుంటారు కాబట్టి అబ్కారీ టార్గెట్‌లు ముందే పూర్తవుతాయి.
(వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)