బలిజిపేట మండలంలో ఎండిపోతున్న వరినారు
సమస్యలున్నాయ్... చర్చించండి
Published Tue, Aug 16 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
జిల్లాలో ప్రస్ఫుటమవుతున్న కరువు ఛాయలు
పథకాల అమలులో పెరుగుతున్న అక్రమాలు
పల్లెలు, పట్టణాల్లో వేధిస్తున్న వ్యాధులు
తీరని వసతి గహాల సమస్యలు
నేటి జడ్పీ సమావేశంలో చర్చిస్తారో లేదో..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో సమస్యలు తాండవిస్తున్నాయి. వర్భాభావ పరిస్థితులు మెట్టప్రాంత రైతుల్ని కలవరపెడుతున్నాయి. ఖరీఫ్‌లో ఇక కరువు ఛాయలు తప్పవేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సీజనల్ వ్యాధులు పెచ్చుమీరుతున్నాయి. ఇక పథకాల అమలులో పచ్చనేతల చేతివాటం... అధికారుల ముడుపుల పర్వం... కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఉండనే ఉంది. అంతేనా... హాస్టళ్లలో అమలు కాని మెనూ... మెరుగుపడని పారిశుద్ధ్యం... మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం... ఇంకా కనబడుతూనే ఉంది. బుధవారం జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలో ఈ అంశాలు చర్చకు వస్తాయో లేదో... జిల్లాలో మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వేసిన పంటను వర్షాభావం కలవరపెడుతోంది. గత కరువు మండలాలకు ఇప్పటికీ సాయం అందలేదు. ఈ సారైనా ఆదుకోకుంటే ఇక వ్యవసాయానికి సెలవు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మునుపెన్నడూలేని విధంగా అవినీతి పెచ్చు మీరిపోతోంది. అభివద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ఆరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోంది. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు. కార్మికుల ఆకలి కేకలను పాలకులు విన్పించుకోవడం లేదు. ఈపాస్ కష్టాలతో ప్రజలు రేషన్‌కు దూరమవుతున్నారు. బుధవారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చకు రావల్సిన అవసరం ఉంది.
కమ్ముకున్న కరువు మేఘాలు
9 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగతా మండలాల్లో అంతంత మాత్రంగా ఉంది. వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాధారణ విస్తీర్ణం 1,19,069హెక్టార్లు కాగా, ఇంతవరకు 47వేల హెక్టార్లలోపే సాగైంది. 9635హెక్టార్ల విస్తీర్ణంలో పండాల్సిన వేరుశనగ 2,584హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. దీన్నిబట్టి జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. గతేడాది ప్రకటించిన కరువు మండలాలకు ఇంతవరకు సాయం అందలేదు. ఇప్పుడా సాయాన్ని మంజూరు చేయడమే కాకుండా బ్యాంకుల ద్వారా కొత్తగా రుణాలు, విత్తనాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినా జిల్లాలో అమలు కావడం లేదు. చాలా మంది వ్యాపారులు పాత ధరకే విక్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో వ్యాపారుల భాగోతం బయటపడింది. జిల్లాలో 94ఎరువుల దుకాణాలుండగా వాటిలో 92దుకాణాల్లో లోపాలున్నట్టు కేసులు నమోదయ్యాయి.
చంద్రన్నబాట, నీరు చెట్టు... అక్రమాల పుట్ట
చంద్రన్నబాటలో భాగంగా వేసిన సిమెంట్ రోడ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. నాసిరకం పనులు చేపట్టి కోట్లాది రూపాయల స్వాహా జరిగింది. ఇప్పుడిప్పుడే అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్‌గా వచ్చిన రూ. 106కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారు. పర్సంటేజీల కారణంగా పనులపై పర్యవేక్షణ లోపించడంతో భారీగా అక్రమాలు జరిగాయి. ఇక, నీరు చెట్టు పనుల్లో అవినీతికి అంతులేదు. రూ. 180కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పూడికతీత, చెరువు గట్టు పనులు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. అరకొర పనులు చేసి కోట్లాది రూపాయలు మింగేసారు. రూ. 144.94కోట్లతో చేపట్టిన స్లూయజ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చివరికీ ఇంజనీరింగ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ ఎంబుక్‌లు తయారు చేసి నిధులు స్వాహా చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్నిచోట్లైతే పనులు చేపట్టకుండా బిల్లులు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.
– జిల్లాలో 19జూట్, ఫెర్రో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో పనిచేస్తున్న 30వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరిపై ఆధారపడి బతుకుతున్న మరో 10వేల మంది రోడ్డున పడ్డారు.
– జిల్లాలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. నాసిరకం బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. దీంతో జిల్లాలో 11 నుంచి 12శాతం మంది విద్యార్థులు భోజనం చేసేందుకు ఇష్టపడటం లేదు. మెనూ కూడా సరిగా ఉండటం లేదు. పెరిగిన ధరలకు తగ్గట్టుగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో మెనూ భారమై ఏజెన్సీలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. జిల్లాలోని 1577పాఠశాలలకు వంట గదుల్లేవు. సుమారు 450పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొంది.
– డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు విద్యా వ్యవస్థను విస్తరించాల్సింది పోయి ప్రభుత్వమే డ్రాపౌట్స్ పెరిగేలా వ్యవహరిస్తోంది. వసతి గహాలను మూసేస్తోంది. అందులోని పిల్లల్ని సమీపంలో ఉన్న వసతి గహాల్లో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో 30శాతం మందే అందులో చేరారు. మిగిలినవారు డ్రాపౌట్స్‌గా ఉండిపోయారు.
– జిల్లాలో వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. డెంగీ కేసులు ఎక్కువయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా వ్యాప్తి కూడా అధికంగా ఉంది. గిరిజన ప్రాంతాలకు దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉన్నా రెండేళ్లుగా విస్మరించారు.
– ఫింగర్ ప్రింట్స్ పడక ప్రతీ నెలా 40వేల మంది లబ్ధిదారులు రేషన్‌కు దూరమవుతున్నారు. ఆన్‌లైన్ సమస్యతో ఆగస్టు రేషన్‌కు సంబంధించి 5,526కార్డులు గల్లంతయ్యాయి. ఇలా ప్రతీ నెలా సరాసరి 15వేల కార్డుదారులు రేషన్ కోల్పోతున్నారు.
Advertisement