200 కరువు మండలాలు!
* సంఖ్యపై తుది కసరత్తు
* వెంటనే తేల్చాలని సీఎం కేసీఆర్ ఆదేశం
* నాలుగు రోజుల్లో కేంద్రానికి నివేదిక
* కరువు మండలాలపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 కరువు మండలాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ అంచనాకు వచ్చింది. ఈ నివేదికలను మరోసారి పరిశీలించి కరువు మండలాల సంఖ్యను పక్కాగా తేల్చి చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాలను గుర్తించాలని సూచించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేసి తగినంత ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి పంపాలని నిర్దేశించారు.
రాష్ట్రస్థాయి కరువు నిర్ధారణ కమిటీ నివేదికతో పాటు జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికలపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనా, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరువు మండలాల గుర్తింపులో పక్కాగా నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 150కి మించే ప్రసక్తే లేదని, కొంతమేరకు సడలిస్తే 194 మండలాలు దీని పరిధిలోకి వస్తాయని అధికారులు సీఎంకు చెప్పారు. విమర్శలకు తావివ్వకుండా వాస్తవ పరిస్థితుల మేరకు తుది సంఖ్యను ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ సంఖ్యపైనే జాప్యం
కేంద్రం నిర్దేశించిన కరువు కొలమానాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే మొదటగా 66 మండలాల్లోనే కరువు ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ, కలెక్టర్ల నివేదికలను పరిశీలిస్తే కరువు తీవ్రత అంచనాలు దాటింది. కరువు నిర్ధారణకు కేంద్ర నిబంధనల ప్రకారం వర్షాభావ పరిస్థితులు, వర్షానికి వర్షానికి మధ్య అంతరం, తేమ సమగ్ర సూచిక, నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్, నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్, సాగు విస్తీర్ణం, దిగుబడులను లెక్కలోకి తీసుకోవాలి. వీటిలో ఐదింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య భారీగా తగ్గిపోయింది. దిగుబడులు రాకముందే తేల్చిన లెక్క కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుగింటిని గీటురాయిగా తీసుకొని మరోసారి అధికారులు కసరత్తు చేశారు. దీంతో కరువు మండలాల సంఖ్య దాదాపు 200కు చేరింది.
మరోవైపు కరువు మండలాల లెక్కతేల్చడంలో ఆలస్యమవుతున్న కొద్దీ కేంద్రం నుంచి అందే సాయం ప్రశ్నార్థకంగా మారనుంది. కేంద్రానికి నివేదిక పంపాక దాదాపు నెల రోజుల తర్వాతే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. అప్పటికీ నష్టపోయిన పంటలను చూపించే అవకాశం లేకపోతే.. పంట నష్టం అంచనా తూతూమంత్రంగా మిగిలిపోతుంది. ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కరువు ప్రాంతాలను ప్రకటించి కేంద్ర సాయం కోరడంలో ముందున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఈ నివేదికను కేంద్రానికి పంపితే ఆశించినంత ఆర్థిక సాయం అందే అవకాశం ఉండేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.