
పత్తికొండ మండలం దూదేకొండలో రహదారి దిగ్బంధం చేపట్టిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, వామపక్ష నాయకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/కల్లూరు(రూరల్): బంద్ అంటేనే భయపడే స్థితికొచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ తమ లోపాలు, అవకతవకలు, అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలుస్తాయోనని అప్రమత్తమవుతోంది. ఎవరు రోడ్డుమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసినా అరెస్టులకు పూనుకోంటోంది. రాయలసీమలో నెలకొన్న కరువుతో అల్లాడిపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని వామపక్షాలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపును పోలీసులను ప్రయోగించి విఫలం చేసేందుకు ప్రయత్నించింది. ఉదయం ఐదు గంటల నుంచే బస్సు డిపోల ఎదుట ఆందోళనలకు దిగిన నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించిన ఆందోళనలలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా, వ్యాపార, వాణిజ్య సమూదాలు మూతపడడంతో బంద్ విజయవంతమైందని వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు.
రహదారుల దిగ్బంధం..
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ,సీపీఎం, జనసేన వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వారికి ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ, ఐద్వా, పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె దూదేకొండ, హోసూరులో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. దూదేకొండలో ఎద్దుల బండ్లను రోడ్డుకు అడ్డంగా ఉంచి దిగ్బంధం చేయగా హోసూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదోనిలో తెల్లవారుజామునే డిపోల నుంచి వచ్చే బస్సులను అడ్డుకోవడంతో సీపీఐ, సీపీఎం నాయకులను అరెస్టు చేశారు. డోన్, బనగానిపల్లెలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. కర్నూలులో తొమ్మిది గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ, సీపీఎ జిల్లా కార్యదర్శులు కె.గిడ్డయ్య, ప్రభాకరరెడ్డిలతోపాటు 30 మంది అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లావ్యాప్తంగా 270 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో జరిగిన ఆందోళనలలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బంద్ విజయవంతం...
కరువు రైతు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఇచ్చిన కరువు బంద్ విజయవంతమైందని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి, గిడ్డయ్య ప్రకటించారు. పోలీసులతో బంద్‌ను విఫలం చేసేందుకు సర్కార్ యత్నించిన ఎక్కడికక్కడే రైతులు, గ్రామీణ పేదలు రోడ్లమీదకు వచ్చి ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను అడ్డుగా పెట్టి నిరసన తెలిపారన్నారు. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఎకరాకు రూ.25 వేలు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.