పెనుకొండ మండలం అడదాకులపల్లి సమీపంలో ఎండిన పప్పుశనగ పంటను పరిశీలిస్తున్న సభ్యులు
అనంతపురం అగ్రికల్చర్: ఎండిపోయిన పొలాలు.... నెర్రలు చీలిన భూములు...నీళ్లు లేని బావులు చూసి జిల్లాలో కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర బృందం) సభ్యులు అమితవ్‌చక్రవరి, ముఖేష్‌కుమార్ చలించిపోయారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల వాస్తవ నివేదికలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. వర్షాభావంతో ఖరీఫ్ దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం 63 మండలాలను కరువు జాబితాలో ప్రకటించిన నేపథ్యంలో కరువు పరిస్థితులు, రైతుల స్థితిగతులు తెలుసుకునే నిమిత్తం కేంద్ర బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు ఉదయం 11.20 గంటలకు గోరంట్ల చేరుకుని అక్కడి నుంచి పెనుకొండ, రాప్తాడు, అనంతపురం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించి రాత్రి చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. అంతకుముందు కేంద్ర బృందం సభ్యులు వేరుశనగ, పండ్లతోటలు, పప్పుశనగ, పాడి, పశుపోషణ, తాగునీరు, సాగునీరు అంశాల గురించి అధికారులు, రైతులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరువు నివారణను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యామ్నాయ వ్యవసాయం ఏమిటి, పశుశిబిరాలు ఏర్పాటు చేశారా...? తాగునీటి కొరతను ఎలా అధిగమిస్తారు... సాగునీటి పరిస్థితేంటి...? రైతులకు ఏఏ రూపంలో పరిహారం ఇస్తున్నారు...? తదితర అంశాలపై ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. జేసీ–2 హెచ్.సుబ్బరా>జు, వ్యవసాయశాఖ జేడీ ఎస్‌కే హబీబ్‌బాషా, పశుశాఖ జేడీ సన్యాసీరావు, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, హిందూపురం ఏడీ ఎం.రవి ఇతరశాఖల అధికారులు బృందం వెంట ఉన్నారు.
కేంద్ర బృందం పర్యటన సాగిందిలా...
♦ ఉదయం 11.20 గంటలకు గోరంట్ల మండలం మల్లాపురం, కొత్తపల్లి గ్రామాలకు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు స్థానిక రైతు గంగప్పతో మాట్లాడారు. నాలుగు ఎకరాల్లో నాలుగు పళ్లాలు విత్తనాలు వేసి రూ.70 వేలు ఖర్చు చేసినా చివరకు నాలుగు బస్తాలు వేరుశనగ పండిందని, అంతా కలిపినా రూ.5 వేలు కూడా వెనక్కిరావడం లేదని రైతు వాపోయాడు. అలాగే బోరులో నీళ్లు రాక మల్లెతోట కూడా ఎండిపోయిందన్నాడు. ఈ ప్రాంతంలో 800 అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావడం లేదని నరసింహప్ప, గోవిందరెడ్డి తదితరులు బృందం దృష్టికి తీసుకెళ్లారు.
♦ మధ్యాహ్నం 12.30 గంటలకు పెనుకొండ విద్యుత్‌సబ్‌స్టేషన్‌కు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు అక్కడున్న ఫిజోమీటర్‌ను పరిశీలించి భూగర్భజలాల స్థితిగతులు ఆ శాఖ డీడీ పురుషోత్తమరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత నీటి మట్టం రూ.49 మీటర్లు ఉండగా... గతేడాది ఇదే సమయంలో 27 మీటర్లు ఉండటంపై ప్రశ్నించారు. గతేడాది మంచి వర్షాలు పడటం, గొల్లపల్లి రిజర్వాయర్‌లో నీటిమట్టం ఉన్నందున గతేడాది పరిస్థితి బాగానే ఉందన్నారు.
♦ మధ్యాహ్నం 1 గంటకు పెనుకొండ మండలం అడదాకులపల్లి సమీపంలో ఎండిపోయిన పప్పుశనగ పంటను చూశారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధికూలీలు, రైతులతో మాట్లాడారు. ఉపాధి పనిదినాలు 250 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ రూ.300 ప్రకారం చెల్లించాలని శ్రీనివాసులు, కొండారెడ్డి మరికొందరు కూలీలు కోరారు. ఉపాధిహామీ పథకం తీరుతెన్నుల గురించి డ్వామా పీడీ జ్యోతిబసు తెలిపారు.
♦ అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పెనుకొండ మండలం అమ్మవారుపల్లికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు.. అక్కడ తాగునీటి సమస్యను తెలుసుకున్నారు. మూడేళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వ్యవసాయ తోటల దగ్గరకెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ నారాయణస్వామి వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. గ్రామజనాభా ఎంత..? ఎన్ని లీటర్లు అవసరం... ఎన్ని ట్యాంకులు సరఫరా చేస్తున్నారనే వాటిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి సరైనా సమాధానాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
♦ మధ్యాహ్నం 3.15 గంటలకు రాప్తాడు మండలం రామినేపల్లిలో అంగన్‌వాడీ సెంటరును కేంద్ర బృందం పరిశీలించింది.
♦ 3.30 గంటలకు రాప్తాడు మండలం బొమ్మేపర్తి క్రాస్‌లో రైతు రవికి చెందిన వేరుశనగ పొలాన్ని పరిశీలించారు. వేరుశనగ మొక్కలు పెరికి చూడగా చెట్టుకు ఒక కాయ కూడా కనిపించకపోవడంతో చలించిపోయారు. పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర బృందం సభ్యులు అంగీకరించారు. ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేసి ఐదెకరాల్లో వేరుశనగ వేయగా పరిస్థితి ఇలా ఉండటంతో తొలగించడానికి కూడా ఇబ్బందిగా ఉందని రైతు రవి తెలిపాడు.
♦ సాయంత్రం 4.30 గంటలకు అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులకు 6.15 గంటల వరకు కలెక్టర్ వీరపాండియన్, జేసీ ఢిల్లీరావు తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కరువు పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కాసేపు సమావేశం నిర్వహించారు. జిల్లాకు తక్షణ సాయంగా రూ.1,622.72 కోట్లుసాయంప్రకటించాలని కరువు నివేదిక సమర్పించారు. అందులో ఖరీఫ్ పంట నష్టానికిరూ.967.14 కోట్లు ఇన్‌పుట్ ఇవ్వాలని కోరారు. మొత్తమ్మీద వ్యవసాయశాఖకు రూ.1,042.92 కోట్లు, ఉద్యానశాఖకు రూ.46.78 కోట్లు, పట్టుశాఖకు రూ.1.65 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.99.93 కోట్లు, డ్వామాకు రూ.352.76 కోట్లు, మైనర్‌ఇరిగేషన్‌కు రూ.36.12 కోట్లు, పట్టణ తాగునీటి పథకానికి రూ.10.56 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.31.99 కోట్లు అవసరమని నివేదించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
ూ రాత్రి 7 గంటలకు బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లైట్ల వెలుగుల్లో ఎండిన వేరుశనగ పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు అక్కడే రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న హార్సిలీహిల్స్‌కు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment