విజయవాడ: రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున రెండు కరువు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకు ఓ బృందం, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరో బృందం పర్యటిస్తుందని ఆయన వెల్లడించారు. గురువారం కరువుపై కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నేను నెంబర్ వన్ కూలీని అని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో కరువుకు తాళలేక 20 లక్షల మంది కూళీలు వలస బాట పట్టారన్నారు.
కరువు పరిస్థితులు ఎదురవుతాయని ముందుగా తెలిసినా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. వేలాది గ్రామాల్లో ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారని, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు అమ్ముకుంటూ రైతన్నలు కన్నీరు కారుస్తున్నారన్నారు.
అన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి కరువు సహాయ నిధి తెచ్చుకోవడంలో ముందు జాగ్రత్తగా వ్యవహరించినా చంద్రబాబు ముందు చూపుతో ఉండలేకపోయారని రఘువీరారెడ్డి విమర్శించారు. తన స్వంత గ్రామంలోనే ఉపాధి హామీ పథకం అమలుకావడం లేదని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేసి వలసలను నివారించిందని రఘువీరా తెలిపారు.
'కరువు అధ్యయనానికి కాంగ్రెస్ బృందాలు'
Published Thu, May 5 2016 5:25 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement